రాష్ట్రంలో ఎక్కడ లేని రాజకీయాలు విశాఖ దక్షిణ నియోజకవర్గం లో చోటు చేసుకుంటున్నాయి. ఆదిపత్యం కోసం ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కామన్.. కానీ ఇక్కడ మాత్రం అధికారపక్షమే హీట్ పెంచేస్తుంది.. ఇదివరకే సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసేందుకు వైకాపా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అదే స్థానంపై మరో నలుగురు నేతలు కన్నేసారు. కానీ రాష్ట్ర నాయకత్వ నిర్ణయం ఇప్పుడు అసంతృప్తులకు ఆశనిపాతంగా మారింది. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావించి స్థానిక కార్పొరేటర్ లతో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి చాలా సమావేశాలలో తాను ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బహిరంగంగా వెల్లడించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని ఆదేశించడంతో ఇక తప్పని పరిస్థితిలో పోటీలో నిలబడి తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవి రావు చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటే ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలా పేరుని ప్రతిపాదించారు. ఇక్కడ కూడా ఆయన ఓటమి చవి చూసారు. ఇక మాజీ ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు తనయుడు, దక్షిణం వైకాపా యువజన నాయకుడు ద్రోణంరాజు శ్రీవత్సవ కూడా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి రెడీ అయి నియోజకవర్గంలో చాలా యాక్టివ్ గా ఉంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో టచ్ లో వుంటున్నారు.ఇక మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.రహమాన్ కూడా ఈసారి ఇక్కడ నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసారు.. ఈ లెక్కను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ప్రధాన పోటీ ప్రతిపక్షాల నుంచి కాకుండా తన పార్టీ నుంచే ఉండటం విశేషం. ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఐదుగురు అభ్యర్థులు వరుసలో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర దిగ్గజ నేత ద్రోణం రాజు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఇక్కడ నుంచే గెలిచి శాసనసభలో తన వాణిని గట్టిగా వినిపించారు. ఇక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత గవర్నర్ కె హరిబాబు కూడా ఇక్కడ నుంచి గెలిచి బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. అలాగే మాజీ మంత్రి ఆళ్వార్ దాస్ , భాట్టం శ్రీరామమూర్తి, ఎస్.ఏ.రహమాన్, ద్రోణం రాజు శ్రీనివాసరావు వంటి ఉద్ధండులు ప్రాతినిధ్యం వహించిన ఈ సీటు నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ తరువాత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో సౌత్ లో ప్రతిపక్షం అన్నదే లేకుండా పోయింది. ద్రోణంరాజు శ్రీనివాస్ ఎన్నికల ముందే వైసీపీలో చేరి గణేష్ కుమార్ మీద పోటీ చేసి స్వల్ప తేడాలో ఓడిపోయారు. ఇక టీడీపీలో ఉంటూ ఈ సీటుని చివరి వరకూ ఆశించి భంగపడిన మైనారిటీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. రహమాన్ కూడా వైసీపీలో చేరిపోయారు. మరో వైపు ప్రజారాజ్యం తరఫున 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కోలా గురువులు ఆ తరువాత వైసీపీలో చేరిపోయారు. ఆయనకు 2014లో వైసీపీ టికెట్ ఇచ్చినా కూడా గణేష్ కుమార్ ఆయన్ని ఓడించారు. మొత్తంగా చూస్తే నియోజకవర్గంలో బలమైన నేతలంతా ఇపుడు వైసీపీలోనే ఉన్నారు. ఇంతమంది నేతలు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గ లో వైసీపీ బలపడింది అనుకోవాలా అంటే అదే రాజకీయ చిత్రం అంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ కి రహమాన్ కి అసలు పడదు, ఇపుడు వారిద్దరూ ఒకే ఒరలో రెండు కత్తుల మాదిరిగా ఉన్నారు. మరో వైపు చూసుకుంటే ద్రోణంరాజు శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వడంతో కోలా గురువులు అప్పట్లోనే అలిగి దూరం జరిగారు.