రాష్ట్రంలో ఎక్కడ లేని రాజకీయాలు విశాఖ దక్షిణ నియోజకవర్గం లో చోటు చేసుకుంటున్నాయి. ఆదిపత్యం కోసం ఎక్కడైనా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పోరు కామన్.. కానీ ఇక్కడ మాత్రం అధికారపక్షమే హీట్ పెంచేస్తుంది.. ఇదివరకే సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆ నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసేందుకు వైకాపా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అదే స్థానంపై మరో నలుగురు నేతలు కన్నేసారు. కానీ రాష్ట్ర నాయకత్వ నిర్ణయం ఇప్పుడు అసంతృప్తులకు ఆశనిపాతంగా మారింది. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావించి స్థానిక కార్పొరేటర్ లతో ఒక వర్గాన్ని ఏర్పాటు చేసి చాలా సమావేశాలలో తాను ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బహిరంగంగా వెల్లడించారు. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయాలని ఆదేశించడంతో ఇక తప్పని పరిస్థితిలో పోటీలో నిలబడి తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవి రావు చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే మత్స్య కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని అనుకుంటే ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలా పేరుని ప్రతిపాదించారు. ఇక్కడ కూడా ఆయన ఓటమి చవి చూసారు. ఇక మాజీ ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాసరావు తనయుడు, దక్షిణం వైకాపా యువజన నాయకుడు ద్రోణంరాజు శ్రీవత్సవ కూడా ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడానికి రెడీ అయి నియోజకవర్గంలో చాలా యాక్టివ్ గా ఉంటూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో టచ్ లో వుంటున్నారు.ఇక మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ.రహమాన్ కూడా ఈసారి ఇక్కడ నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు తన ప్రయత్నాలు ముమ్మరం చేసారు.. ఈ లెక్కను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు ప్రధాన పోటీ ప్రతిపక్షాల నుంచి కాకుండా తన పార్టీ నుంచే ఉండటం విశేషం. ఒక ఎమ్మెల్యే సీటు కోసం ఐదుగురు అభ్యర్థులు వరుసలో ఉన్నారు. అయితే అధిష్టానం మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర దిగ్గజ నేత ద్రోణం రాజు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఇక్కడ నుంచే గెలిచి శాసనసభలో తన వాణిని గట్టిగా వినిపించారు. ఇక బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రస్తుత గవర్నర్ కె హరిబాబు కూడా ఇక్కడ నుంచి గెలిచి బీజేపీ పక్ష నేతగా వ్యవహరించారు. అలాగే మాజీ మంత్రి ఆళ్వార్ దాస్ , భాట్టం శ్రీరామమూర్తి, ఎస్.ఏ.రహమాన్, ద్రోణం రాజు శ్రీనివాసరావు వంటి ఉద్ధండులు ప్రాతినిధ్యం వహించిన ఈ సీటు నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ తరువాత వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. దాంతో సౌత్ లో ప్రతిపక్షం అన్నదే లేకుండా పోయింది. ద్రోణంరాజు శ్రీనివాస్ ఎన్నికల ముందే వైసీపీలో చేరి గణేష్ కుమార్ మీద పోటీ చేసి స్వల్ప తేడాలో ఓడిపోయారు. ఇక టీడీపీలో ఉంటూ ఈ సీటుని చివరి వరకూ ఆశించి భంగపడిన మైనారిటీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. రహమాన్ కూడా వైసీపీలో చేరిపోయారు. మరో వైపు ప్రజారాజ్యం తరఫున 2009 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన కోలా గురువులు ఆ తరువాత వైసీపీలో చేరిపోయారు. ఆయనకు 2014లో వైసీపీ టికెట్ ఇచ్చినా కూడా గణేష్ కుమార్ ఆయన్ని ఓడించారు. మొత్తంగా చూస్తే నియోజకవర్గంలో బలమైన నేతలంతా ఇపుడు వైసీపీలోనే ఉన్నారు. ఇంతమంది నేతలు ఉన్నారు కాబట్టి ఈ నియోజకవర్గ లో వైసీపీ బలపడింది అనుకోవాలా అంటే అదే రాజకీయ చిత్రం అంటున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ కి రహమాన్ కి అసలు పడదు, ఇపుడు వారిద్దరూ ఒకే ఒరలో రెండు కత్తుల మాదిరిగా ఉన్నారు. మరో వైపు చూసుకుంటే ద్రోణంరాజు శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వడంతో కోలా గురువులు అప్పట్లోనే అలిగి దూరం జరిగారు. ప్రస్తుతం ఐదు గ్రూపులుగా వైసీపీ దక్షిణ నియోజకవర్గంలో ఉందనే చెప్పాలి. వీరంతా వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు. అయితే ఈ నాయకులు కలసికట్టుగా పనిచేస్తే ఇక్కడ మొత్తానికి మొత్తం ఓట్లు వైసీపీకే పడతాయి. అక్కడ ప్రతిపక్షానికి నో ఛాన్స్. కానీ అంత సీన్ లేదని అంటున్నారు. టీడీపీలో ఉంటూనే రహమాన్ గణేష్ కుమార్ ఓటమికి తెర వెనక కృషి చేశారని పెద్ద టాక్. ఇక వైసీపీలో శ్రీనివాస్ ని ఓడించడానికి కోలా గురువులు వర్గం గట్టిగా పనిచేసిందని ఓ వర్గం ఆరోపణ ఈ నేపధ్యంలో మళ్ళీ వాసుపల్లికి జగన్ టికెట్ ఇస్తే ఆనాటికి పార్టీలో ఎంతమంది ఉంటారో చెప్పడం కష్టమే టికెట్ రేసులో నుంచి మిగిలిన వారిని తప్పించేస్తే ఎవరి దారి వారు చూసుకునే ప్రమాదమూ లేకపోలేదు. అయితే ఇపుడు ఈ నియోజకవర్గం నుంచి సీటు ఆశిస్తున్న ఐదుగురిలోనూ వాసుపల్లికి స్ట్రాంగ్ బేస్ ఉండడమే జగన్ ఆయన్ని చేరదీయడానికి అసలైన కారణం అంటున్నారు. ఒకవేళ వాసుపల్లి కి మళ్ళీ ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ చేస్తే ఆ టికెట్ ఆశించిన మిగిలిన వారు కచ్చితంగా వాసుపల్లి ఓటమికి పనిచేస్తారనే తెలుస్తుంది. ఇక్కడ ఉన్న నాయకులకు ఒక్కరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది. వాసుపల్లికి ప్రధాన పోటీదారులుగా ఉన్న సీతంరాజు సుధాకర్ , కోలా గురువులు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓడిపోవడంతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. వచ్చే ఎన్నికలలో ఇక్కడ వైసిపి అభ్యర్థి ఓడిపోవడానికి ఆ పార్టీ నాయకులు చాలు అన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి చూసిన సీతంరాజు సుధాకర్ స్థానిక హోటల్ లో నిర్వహించిన సమావేశంలో తన ఓటమిక గల కారణాలను సమీక్షిస్తున్న సమయంలో మళ్లీ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు పార్టీ నాయకులు ముందే బాహాటంగా ప్రకటించారు. ఆయన ప్రకటనపై అక్కడ కు వచ్చిన కొందరు నాయకులు విస్తు పోయారు. ఇక కోలా గురువులు కూడా చాప కింద నీరులా ఎమ్మెల్యే పోటీ కోసం తన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాట మొదలైంది. టికెట్ ఆశించిన వారికి పార్టీ నాయకత్వం మొండి చేయి చూపితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందని చాలామంది భావిస్తున్నారు. మిగిలిన కొందరు పార్టీ కూడా మరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.