ప్రస్తుతం రెండు రాష్ట్రాలలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బలమైన వ్యక్తులుగా ఉన్న కెసిఆర్ కు తెలంగాణ లో జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రా లో చెక్ పెట్టేందుకు వైరిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో వీరిని ఢీ కొట్టాలంటే సింహం సింగిల్ గా వెళ్తే సరిపోదు సరైన బలగంతో, మందిమార్బలం తో బందోబస్తుగా వెళ్లాల్సిందే. అందుకే ఉభయరాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఐక్యత రాగాన్ని ఒకే ట్యూన్ లో ఆలపిస్తున్నాయి కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికలలో అధికార పార్టీని ఢీకొట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. తెలంగాణలో బిజెపి పార్టీ లీడ్ తీసుకుంటుండగా ఆంధ్రాలో టిడిపి లీడ్ తీసుకుంది. రెండు రాష్ట్రాలలో టిడిపి, జనసేన పార్టీలు పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు ఓకే వేదికపై కనిపించి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు తాజాగా టిడిపి నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ లు కలసి మాట్లాడుకోవడం రాజకీయంగా పెద్ద చర్చకు తెర తీసింది. బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న అన్‌స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా రానున్నారనే ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఈనెల 27న లేదా 28న దీనికి సంబంధించిన షూటింగ్ జరగనుందని సమాచారం. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలవడం రాజకీయంగా ఆసక్తిని కలిగించింది. అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు జరుగుతున్నాయి. షూటింగ్ గ్యాప్‌లో వీరిద్దరూ కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటుగా ఇద్దరు భేటీ అవ్వగా ఏపీ రాజకీయాల గురించే ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. బయట మాత్రం ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ జరుగుతుంది. గతంలో వీరిద్దరి మధ్య వచ్చిన చిన్న వివాదం నందమూరి – మెగా అభిమానుల మధ్య మరింత చిచ్చు పెట్టింది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తప్పనిసరిగా వీరిద్దరూ రాజకీయంగా కలిసి పని చేసే అవకాశాలు ఉండటంతో ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక అన్‌స్టాపబుల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనే ఎపిసోడ్ వ్యూస్ పరంగా రికార్డులను క్రియేట్ చేయడం ఖాయమని స్పష్టమవుతుంది.