పొలిటికల్ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇది. ఇప్పుడు తెలుగు సినిమా కి ఈ డైలాగ్ కరెక్ట్ గా వర్తిస్తుంది. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి మెగాస్టార్ చిరంజీవి వరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు అన్యాయం జరుగుతూనే ఉంది. జాతీయ అవార్డులలో సైతం అవమానం కొనసాగుతూనే ఉంది. ఇదే విషయమై చాలా సందర్భాలలో చిరంజీవి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాకు జరుగుతున్న అన్యాయంపై తన బాధను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంచితే బాలీవుడ్లో తమ అదృష్టం పరిక్షించుకోవాలని ప్రయత్నించిన టాలీవుడ్ స్టార్లకు కూడా చిత్కరింపులు కొనసాగాయి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు 90వ దశకంలో బాలీవుడ్ లో ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత తుఫాన్ అనే మూవీ ద్వారా రామ్ చరణ్ కూడా ప్రయత్నించి అవమానాలను మూట కట్టుకున్నాడు. రామ్ చరణ్ కు అసలు నటనే రాదని, అందంగా లేడు అంటూ బాలీవుడ్ జనాలు అవహేళన చేశారు. రామ్ చరణ్ ను బాలీవుడ్ యాక్టర్ గా అంగీకరించమని బహిరంగంగానే చెప్పారు. ఈ పరిస్థితి బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుంచి కూడా కొనసాగుతుంది. నాడు సీనియర్ ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లు కూడా తొలి నాలల్లో హిందీ చిత్రాలు చేశారు. కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో, పరిస్థితుల ప్రభావంతో తెలుగు సినిమాల కే పరిమితమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ సినిమా అనే కిరీటంలో టాలీవుడ్ అనే సినిమా కోహినూర్ వజ్రం లాంటిది అని నిరూపించడానికి రాజమౌళి అనే దర్శకుడు వచ్చాడు. వరస విజయాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గానే కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. తెలుగు సినిమా ఈ స్థాయికి వెళుతుందని అస్సలు ఎవరూ ఊహించి ఉండరు. తెలుగు వాళ్లే కాదు అటు నార్త్ ఇండియన్స్ కూడా ఊహించి ఉండరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో రాజమౌళి రూటే వేరు. ఈగ మూవీ ని పాన్ ఇండియన్ గా అన్ని భాషలలో విడుదల చేసి తెలుగు సినిమా సత్తాను చాటారు. ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. బాహుబలి పార్ట్ -1, పార్ట్ -2 చిత్రాలు హిందీ బెల్ట్ ను కుమ్మేసాయి. భారీ వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటాయి. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కూడా నేషనల్ స్టార్ గా గుర్తింపు పొందారు. తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి తెలుగు సినిమాకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చారు. ఈ మూవీ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. నాడు రామ్ చరణ్ ను అవహేళన చేసి అవమానించిన బాలీవుడ్ జనం ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ నటనకు ఫిదా అయి సలాం చేశారు. నేడు ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి తెలుగు సినిమా మీద పడింది. ఒక తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు సాధించి భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పుడే ఆర్.ఆర్.ఆర్ మూవీకి అవార్డు ఖాయమని చాలామంది విశ్లేషించారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు మాత్రం పెడవిరిచారు.