Vaisaakhi – Pakka Infotainment

” ఎవడ్రా మనల్ని ఆపేది “

పొలిటికల్ స్పీచ్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఇది. ఇప్పుడు తెలుగు సినిమా కి ఈ డైలాగ్ కరెక్ట్ గా వర్తిస్తుంది. నాటి సీనియర్ ఎన్టీఆర్ నుంచి నేటి మెగాస్టార్ చిరంజీవి వరకు జాతీయ స్థాయిలో తెలుగు సినిమాకు అన్యాయం జరుగుతూనే ఉంది. జాతీయ అవార్డులలో సైతం అవమానం కొనసాగుతూనే ఉంది. ఇదే విషయమై చాలా సందర్భాలలో చిరంజీవి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలుగు సినిమాకు జరుగుతున్న అన్యాయంపై తన బాధను వ్యక్తం చేశారు. ఇదిలా ఉంచితే బాలీవుడ్లో తమ అదృష్టం పరిక్షించుకోవాలని ప్రయత్నించిన టాలీవుడ్ స్టార్లకు కూడా చిత్కరింపులు కొనసాగాయి. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్ హీరోలు 90వ దశకంలో బాలీవుడ్ లో ప్రయత్నించి విఫలమయ్యారు. తర్వాత తుఫాన్ అనే మూవీ ద్వారా రామ్ చరణ్ కూడా ప్రయత్నించి అవమానాలను మూట కట్టుకున్నాడు. రామ్ చరణ్ కు అసలు నటనే రాదని, అందంగా లేడు అంటూ బాలీవుడ్ జనాలు అవహేళన చేశారు. రామ్ చరణ్ ను బాలీవుడ్ యాక్టర్ గా అంగీకరించమని బహిరంగంగానే చెప్పారు. ఈ పరిస్థితి బ్లాక్ అండ్ వైట్ చిత్రాల నుంచి కూడా కొనసాగుతుంది. నాడు సీనియర్ ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ లు కూడా తొలి నాలల్లో హిందీ చిత్రాలు చేశారు. కొన్ని రాజకీయ కారణాల నేపథ్యంలో, పరిస్థితుల ప్రభావంతో తెలుగు సినిమాల కే పరిమితమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్ సినిమా అనే కిరీటంలో టాలీవుడ్ అనే సినిమా కోహినూర్ వజ్రం లాంటిది అని నిరూపించడానికి రాజమౌళి అనే దర్శకుడు వచ్చాడు. వరస విజయాలతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గానే కాకుండా ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా గుర్తింపు పొందారు. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డును కొల్లగొట్టారు. తెలుగు సినిమా ఈ స్థాయికి వెళుతుందని అస్సలు ఎవరూ ఊహించి ఉండరు. తెలుగు వాళ్లే కాదు అటు నార్త్ ఇండియన్స్ కూడా ఊహించి ఉండరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో రాజమౌళి రూటే వేరు. ఈగ మూవీ ని పాన్ ఇండియన్ గా అన్ని భాషలలో విడుదల చేసి తెలుగు సినిమా సత్తాను చాటారు. ఇక బాహుబలి సినిమాతో తెలుగు సినిమాకు గోల్డెన్ డేస్ ప్రారంభమయ్యాయి. బాహుబలి పార్ట్ -1, పార్ట్ -2 చిత్రాలు హిందీ బెల్ట్ ను కుమ్మేసాయి. భారీ వసూళ్లను రాబట్టి తెలుగు సినిమా సత్తాను చాటాయి. ఈ సినిమాల ద్వారా ప్రభాస్ కూడా నేషనల్ స్టార్ గా గుర్తింపు పొందారు. తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాజమౌళి తెలుగు సినిమాకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చారు. ఈ మూవీ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. నాడు రామ్ చరణ్ ను అవహేళన చేసి అవమానించిన బాలీవుడ్ జనం ఆర్ ఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్ నటనకు ఫిదా అయి సలాం చేశారు. నేడు ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తో జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా అందరి దృష్టి తెలుగు సినిమా మీద పడింది. ఒక తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు సాధించి భారతీయ సినిమా స్థాయిని మరింత పెంచింది. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయినప్పుడే ఆర్.ఆర్.ఆర్ మూవీకి అవార్డు ఖాయమని చాలామంది విశ్లేషించారు. తమ అభిప్రాయాలను వెల్లడించారు. కొందరు మాత్రం పెడవిరిచారు. ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేశారు. కానీ ఫైనల్ గా ఆర్.ఆర్.ఆర్ మూవీ ఆస్కార్ అవార్డును సాధించింది. 95వ ఆస్కార్‌ అవార్డుల వేడుకలో నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ దక్కించుకుంది. ఆస్కార్‌ను దక్కించుకున్న తొలి భారతీయ గీతంగా నాటునాటు రికార్డులకు ఎక్కింది. హాలీవుడ్‌ పాటలను తలదన్నుకుంటూ చివరకు వరకు చేరిన నాటునాటు విజయకేతనం ఎగరవేసింది. ఈ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం కీరవాణి కుమారుడు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్​ పాడారు. ఈ పాటను చంద్రబోస్​ రచించగా కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. నాటునాటు పాటకు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అదిరిపోయే స్టెప్పులు వేశారు. దీనికి ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రాఫర్​గా వ్యవహరించారు. దర్శకుడు ఎస్​.ఎస్​ రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్​, క్రిటిక్స్ ఛాయిస్​ ఆవార్డులు సాధించింది. అయితే తాజాగా ఆస్కార్​ గెలుచుకున్న ఈ నాటు నాటు సాంగ్​ ఇప్పటికే ప్రతిష్టాత్మకమైన గోల్డెన్‌గ్లోబ్‌ సహా ఎన్నో అవార్డులను గెలుచుకుంది. రిహాన్నా పాడిన లిఫ్ట్‌ మి అప్‌, టేలర్‌ స్విఫ్ట్‌ పాడిన కరోలినా, లేడీ గగా పాడిన హోల్డ్‌ మై హ్యాండ్‌ పాటలను వెనక్కి నెట్టి బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును కైవసం చేసుకున్న తొలి ఆసియా పాటగా నాటు నాటు నిలిచింది. ఆర్ఆర్ఆర్ చిత్రంతోపాటు బెస్ట్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో మరో భారతీయ చిత్రం “ది ఎలిఫెంట్ విస్పరర్స” ఆస్కార్ గెలుచుకుంది. ప్రకృతికి మానవ జీవితానికి బంధాన్ని తెలిపే ఈ షార్ట్ ఫిలిం ఎంతో పేరుగాంచింది. అడవిలో నివసించే దంపతులు తప్పిపోయిన ఏనుగు పెంచి పోషించిన కథతో కార్తికి గొన్సాల్వేస్ డాక్యుమెంటరీ రూపంలో ఈ షార్ట్ ఫిలిం తెరకెక్కించడం జరిగింది.ఈ క్రమంలో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” ఆస్కార్ అవార్డు గెలవటం జరిగింది. ప్రపంచంలో ఎంతో ప్రతిష్టాత్మక పేరుగాంచిన ఆస్కార్ రావటంతో “ది ఎలిఫెంట్ విస్పరర్స్” సినిమా యూనిట్ ఆనందానికి అవధులు లేవు. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఈ సినిమాతో మరో రష్యన్ మూవీ పోటీ పడింది. కానీ చివర ఆఖరికి “ది ఎలిఫెంట్ విస్పర ర్స్” కీ ఆస్కార్ అవార్డు వరించింది.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More