విశాఖ రాజకీయాలు రంగులు మారుతున్నాయి. ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాలను పక్కన పెట్టి తమ వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్తున్నారు. సుమారుగా విశాఖలో అన్ని రాజకీయ పార్టీలలో ఇదే జరుగుతుంది. విశాఖ జిల్లా వైకాపా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తితో పార్టీకి, తన పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చేసారు. ఈ క్రమంలోనే అతను జనసేన లో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరిగింది. అందరూ అనుకున్నట్లుగానే పంచకర్ల ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో పంచకర్ల జనసేనలో చేర బోతున్నారనే వార్తలు నిజమయ్యాయి. అనంతరం పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ. జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి నేను కూడా ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు అదే విషయం ఆయనతో చెప్పానని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానని, పవన్ కళ్యాణ్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తానని తెలిపారు. పంచకర్ల జనసేనలో చేరిన తర్వాత విశాఖ వైసిపి నుంచి మరింత మంది నేతలు వరుసకట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే టిడిపి సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అతి త్వరలో జనసేనలోకి వెళ్తారని విస్తృత ప్రచారం జరుగుతుంది. ఎన్నికల కొద్ది నెలలు ముందు పరిస్థితులను బట్టి రాజకీయ వ్యవహారాలలో భాగంగా గంటా శ్రీనివాసరావు సరైన నిర్ణయం తీసుకొని ఉన్నట్లు అతని అనుచరులు చెబుతున్నారు. పంచకర్ల తర్వాత వైసిపి తో పాటు టిడిపి నుంచి కూడా వలసలు ఉన్నట్లయితే బాగా ప్రచారం జరుగుతుంది.