బి.ఆర్.ఎస్. ఆంధ్రాలో పుంజుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేసింది. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అన్ని స్థానాలకు పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. విజయవాడ వేదికగా కూడా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి చాప కింద నీరులా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. త్వరలో ఏపీ లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్లపై ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా ఇక్కడ వారిలో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాం అని ఓటు అడిగితే కచ్చితంగా తిప్పికొడతారని చాలామంది చెబుతున్నారు. అయితే ఆ పార్టీ నేతలు అవేవీ పట్టించుకోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేయడం వల్ల ఆ పార్టీకి అయితే పెద్దగా ఒరిగిందేమీ లేనప్పటికి బిఆర్ఎస్ నేతలకు వైసీపీ నేతలకు ఉన్న సంబంధాల నేపథ్యంలో ఆ రెండు పార్టీల మధ్య ఎన్నికల సమయంలో అంతర్గతంగా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆంధ్రాలో మరింత బలపడడానికి బి.ఆర్.ఎస్ మాత్రం గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ ను కేంద్ర బిజెపి ప్రభుత్వం తమ స్వార్థానికి వాడుకుంటుందని, ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని బి.ఆర్.ఎస్ నాయకులు ఆరోపణ లు షురూ చేశారు. బిజెపిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా అన్నిచోట్ల పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. దోపిడి వర్గానికి బిజెపి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ, అభివృద్ధి నిధుల విడుదల విషయంలో కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని కేసియార్, కేటీఆర్ వంటి నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇలా ఉండగా ఆంధ్రాలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్పడంపై కూడా బీ.ఆర్.ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండ గడుతున్నారు. ఈ మేరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతుందని ఆ లేఖలో మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కార్పోరేట్ శక్తులకు రూ. 12. 5 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని గుర్తు చేస్తూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. సెయిల్ తో విశాఖ విలీనాన్ని పరిశీలించాలని కేటీఆర్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కానీ , అధికార వైసిపి పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయకుండా తటస్థంగా ఉండటంపై కూడా విమర్శలు వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ విషయంలో బిజెపికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రూపంలో అయినా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందనే ఆలోచనతో వైసిపి, టిడిపి పార్టీలు స్టీల్ ప్లాంట్ విషయంపై సరిగా స్పందించడం లేదనేది తెలుస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం కేటీఆర్ చొరవను మెచ్చుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లు బిజెపి తో ఉన్న అనుబంధం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీపై ఒత్తిడి తెచ్చే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ కేటీఆర్ మాత్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో తమ పార్టీ స్టాండ్ ను ఖచ్చితంగా చెప్పారు. విశాఖ ఉక్కుకు కేంద్రం రూ. 5 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే వర్కింగ్ కేపిటల్, ముడి సరకు కోసం నిధులను సమీకరణ పేరుతో కొత్త కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సరైంది కాదని, వెనక్కి ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంలో పున: పరిశీలన లేదని కూడా కేంద్రప్రభుత్వం ఇటీవలనే స్పష్టం చేసింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఎంపీలు అడిగిన ప్రశ్నకు ఇటీవలనే కేంద్రం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలబాటలో పయనిస్తున్నందున ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. ఏదేమైనప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆంధ్రాలో బి.ఆర్.ఎస్. పార్టీ బలోపేతానికి ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కానున్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి.