వైజాగ్ స్టీల్ పై కేంద్రం కొత్త ఎత్తుగడ..!

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ ముడి సరుకుగా మారింది. ఎన్నో ప్రధాన సమస్యలు ఏపీ లో ఉన్నా వాటన్నిటిని పక్కదోవ పట్టించేందుకు స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఎన్నికలలో ఈ స్టీల్ ప్లాంట్ అంశమే ప్రధాన అజెండాగా రాజకీయ పార్టీలు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఇప్పుడు కొత్త వ్యూహం మొదలుపెట్టినట్లు సమాచారం. అప్పుడప్పుడు వివాదాస్పద ప్రకటనలు చేయడం, తర్వాత వాటిని సరిదిద్దుకొవడం సర్వసాధారణంగా మారిన కేంద్రం వైజాగ్ స్టీల్ ని టాటా కి అప్పగించే యోచన లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రైవేటు రంగంలో 70 వేల కోట్ల నష్టంలో నడుస్తున్న అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌గా ఉన్న టాటా ప్లాంట్ విశాఖ ఉక్కు పరిశ్రమను ఎలా టేకప్ చేయాలనుకుంటోందననే ప్రశ్న కూడా చాలామందిలో ఉదయించినా కరోన సమయంలోను ఇతర పరిస్థితులోను ప్రజలకు అండగా నిలిచిన టాటా సంస్థలపై ప్రజలకు ఉన్న సాఫ్ట్ కార్నర్ను అస్త్రం గా మలచుకోవాలన్నది కేంద్రం కొత్త ఎత్తుగడ. భారతదేశంలో ఎన్నో స్టీల్ ప్లాంట్ లు ఉండగా విశాఖ స్టీల్ ను మాత్రమే ప్రైవేటుపరం ఎందుకు చేయాలి అనేది ఇప్పుడు చర్చగా మారింది. దీనికి కూడా కారణం ఉంది. మూడు లక్షల కోట్ల ఆస్తులు.. సులువుగా వాణిజ్యం, రవాణా, చేసుకోవడానికి పోర్టులు. రైల్వే, విమానయాన అవకాశాలు.. క్వాలిటీ తో ఉత్పత్తి చేస్తున్న ఐరన్ కు మంచి డిమాండ్ ఇలాంటి కారణాల దృష్ట్యా కొన్ని కార్పొరేట్ సంస్థలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రైవేటుపరం చేయడానికి ఒప్పించిందనేది ప్రచారం సాగుతుంది. 2001 లోనే టాటా సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ ను చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే మధ్యలో రాజకీయ నేతల జోక్యం ఎక్కువవడంతో గుజరాత్ వ్యాపారస్తులు సీన్ లోకి వచ్చారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం వారికే అప్పచెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఏమైందో తెలియదు కానీ సీన్లోకి మరొక ఇద్దరు ముగ్గురు వచ్చి చేరారు. మరోపక్క ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం యూనియన్ల పోరాటం కొనసాగుతూనే ఉంది. దేశీయ ఉక్కు దిగ్గజంగా పేరున్న టాటా స్టీల్‌ వైజాగ్ స్టీల్ ను దక్కించుకునేందుకు సిద్దమవ్వడమే ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారిన అంశమైంది. సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.వి. నరేంద్రన్‌ ఈ విషయాన్ని రెండేళ్ల క్రితమే ధ్రువీకరించారు. అయితే విశాఖ ఉక్కుపై టాటా ఇంత మక్కువకు పలు కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయని చెప్పక తప్పదు. తూర్పు తీర ప్రాంతంలో ఉన్న వైజాగ్‌ స్టీల్‌ను టాటా దక్కించుకోగలిగితే ఆగ్నేయాసియా మార్కెట్లలో వ్యాపారం మరింత సులువు కానుండగా, దేశీయ మార్కెట్లోనూ రైలు, రోడ్డు మార్గాల్లో ప్రత్యేక ఉక్కు ఉత్పత్తులను సరఫరా చేసేందుకు అవకాశం లభించనుంది. 22 వేల ఎకరాల భూములున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు స్వల్ప దూరంలోనే గంగవరం పోర్టు ఉండటం మరో అనుకూల అంశం. కాగా తద్వారా బొగ్గు తదితర ముడిసరుకుల దిగుమతి, స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతి మరింత సులభమవుతుంది. కోల్ కతా కేంద్రంగా వ్యాపారాన్ని సాగిస్తున్న టాటా స్టీల్ కు దక్షణాదిలో విశాఖ లాంటి ప్లాంట్ దక్కితే అది సంస్థకు తిరుగులేని వ్యాపార అవకాశంగా భావిస్తుంది. భౌగోళికంగా దక్షిణాదిన తీర ప్రాంతం కావడం, నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తోండటం, 22 వేల ఎకరాల్లో విస్తరించి ఉండటం వంటి కొన్ని ప్రధాన కారణాలు తమకు లాబించే అంశాలని టాటా సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు పై ఆసక్తి కనబరిచింది. దీనిపై బిడ్ వేయడానికి కూడా సిద్ధం అవుతుంది. ప్రస్తుతం రాజకీయపరంగా బిజెపి -బి ఆర్ ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న నేపథ్యంలో అలాగే స్టీల్ ప్లాంట్ ను చేజెక్కించుకోవడానికి పోటీలో ఉన్న బిఆర్ఎస్ కు చెక్ పెట్టాలంటే టాటా సంస్థకే స్టీల్ ప్లాంట్ అప్పగిస్తే ఎటువంటి గొడవ ఉండదది.. ప్రజలు, ప్లాంట్ ఉద్యోగులు దీన్ని స్వాగతిస్తారని బిజెపి నమ్ముతోంది. వేరే ఏ ప్రైవేట్ సంస్థకు స్టీల్ ప్లాంట్ ను అప్పగించిన పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టగా గతేడాది 18 వేల కోట్ల రూపాయలతో టాటా సంస్థకు చెందిన టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కోట్‌ చేసిన బిడ్‌ను కేంద్రం ఆమోదించింది. ఆ తర్వాత మూడు రోజులకు బిడ్డింగ్‌ను ధృవీకరించింది. అప్పటివరకు ఉద్యమాలు చేస్తున్న ఎయిర్ ఇండియా ఉద్యోగస్తులు టాటా సంస్థ కొనుగోలు చేయడంతో వారి పోరాటానికి విరామం ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ టాటా సంస్థ కొనుగోలు చేస్తే కూడా అలాగే ఉంటుందని కేంద్రం భావిస్తుంది. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా మొండిగా వెళుతున్న కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి త్వరలో ఒక స్పష్టమైన వివరణ ఇవ్వనన్నట్లు తెలుస్తుంది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More