అష్టభైరవులు వున్నారా..? ఏ క్షేత్రాలకు వారు పాలకులు..?

దేవరాజ సేవ్యమాన పావనాగ్ని పంకజం..
వ్యాళయజ్ఞ సూత్ర మిందు శేఖరం కృపాకరం..
నారదాది యోగివృన్ద వందితం దిగంబరం కాశికాపురాధినాధ కాలభైరవం భజే…
కాశికా పురాది నాథుడు కాలభైరవుడు ఆ క్షేత్ర పాలకుడైన ఈ విశ్వాన్ని అంతటినీ తన కంటి చూపు తోనే శాశిస్తున్న దైవం.. ఈ భూమ్మీద జన్మ తీసుకున్న మానవులనే కాదు.. కష్టాలు,దుఃఖాలు అనుభవిస్తున్న సకల ప్రాణులను అక్కున చేర్చుకుని స్వాంతన కల్గించే దేవతా మూర్తి. జీవితం లో వచ్చే ఒడిదుడుకులను దుఖాలను నివృత్తి చేసుకోవడం కోసం భైరవసేవన ఒక పరిష్కారం అని పండితులు చెప్తుంటారు. సతీదేవి శరీరత్యాగం చేసిన కారణంతో శివుడు దుఖాన్ని తట్టుకోలేక ఆశ్రయించిన భైరవ రూపాన్ని సేవిస్తే సాక్షాత్తూ పరమ శివున్ని సేవించినట్లే అని వివరిస్తు..”నేను భైరవ రూపంలో లోకానికి సుఖం చేకూర్చూతాను.” అని సదాశివుడి వాక్యాన్ని గుర్తుచేస్తున్నారు.. అలాంటి కాలభైరవుడు అష్ట రూపాలలో దర్శన మిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నాడు. మనం ఒకే రూపాన్ని తరచూ చూస్తుంటాం.. భైరవుని(కుక్క)తో సహా వున్న రూపాన్ని కానీ అష్ట భైరవులు వివిధ జంతువులను వాహనాలుగా చేసుకుని దర్శనమిస్తున్న విషయం కొంతమందికే తెలుసు..
అసితాంగో రురుశ్చండహ్ క్రోధశ్ఛోన్మత్త భైరవ
కపాలీ భీషణశ్చైవ సంహారశ్చాష్టభైరవాహ్
కాలభైరువుడికి ఎనిమిది రూపాలు ఈ ఎనిమిది రూపాలు అష్ట దిక్కులకు అధిపతులు ఒక్కోరూపం ఒక్కో ప్రత్యేకం ఆ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

అసితాంగ భైరవుడు. ఈయన నల్లని శరీరఛాయలో, దిగంబరంగా శాంతి రూపంలో, త్రినేత్రుడై బ్రహ్మీ శక్తితో కూడి నాలుగు చేతులతో. అక్షమాల, ఖడ్గం, కమండలం, పానపాత్ర ధరించి దర్శనమిచ్చే ఈయన హంసవాహనుడు. వరాలని ప్రసాదించే భూషణాధికారి. సరస్వతి ఉపాసకులు అసితాంగ భైరవుని అర్చించి సిద్ది పొందిన అనంతరమే సరస్వతీ ఉపాసన సిద్దిస్తుంది. బ్రహ్మ స్వరూపుడు. అయిన ఈ మూర్తి
మహా సరస్వతికి క్షేత్రపాలకుడు. తూర్పు దిశకు అధిపతి.

రురు భైరవుడు స్వచ్చమైన తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో కత్తి, టంకము, పాత్ర, లేడిని ధరించి త్రినేత్రుడై దిగంబర ధారి గా దర్శనమిస్తారు. మహేశ్వరి శక్తితో కుమారరూపంతో వృషభ వాహనుడై ప్రసన్న వదనం కలిగి దర్శనమిచ్చే రురు బైరవుడ్ని శ్యామల, ప్రత్యంగిర, దశమహావిద్యల ఉపాసకులు ఈ మూర్తినిఉపాసన చేసిన తరువాతే అమ్మవారి ఉపాసనలు సిద్దిస్తాయి.రుద్ర స్వరూపుడైన రురు భైరవుడు రుద్రాణికి క్షేత్రపాలకుడు.ఆగ్నేయ దిశకు అధిపతి.

చండ భైరవుడు. తెల్లని శరీర ఛాయతో, మూడు నేత్రాలతో, నాలుగు చేతులతో, దిగంబరంగా, కౌమారి శక్తి కలిగి నెమలి వాహనధారి అయిన ఈ చండ బైరవుడిని సుబ్రమణ్య కన్యకాపరమేశ్వరి ఉపాసకులు ముందుగా సేవిస్తే ఆ అనుగ్రహంతోనే ఉపాసనలు సిద్దిస్తాయి. సుబ్రమణ్య స్వరూపుడయిన ఈయనను పూజిస్తే. సర్పదోషాలు తొలగిపోతాయి. సంతానం లేనివారు,వివాహం కానివారు దక్షిణ దిశకు అధిపతి అయిన చండ భైరవుడ్ని ప్రార్థిస్తే కోర్కెలు సిద్ధిస్తాయి

క్రోధ భైరవుడు. నీలి శరీర ఛాయతో వైష్ణవి శక్తితో కూడిన శాంత రూపంతో గరుడ వాహనారూడుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో గద, చక్రం, పానపాత్ర, శంఖం ధరించి ఉంటాడు. వైష్ణవ ఉపాసకులు అంటే గరుడ, హనుమ, సుదర్శన, నారసింహ, వరాహ, కృష్ణ ఉపాసకులు ముందుగా ఈయన ఉపాసన చేయాలి. విష్ణు స్వరూపుడు అయిన క్రోధ బైరవుడు నైరుతి దిశాధిపతి.

ఉన్మత్త భైరవుడు ఉన్మత్త భైరవస్వామి బంగారు శరీర ఛాయతో, వారాహి శక్తితో కూడిన శాంత రూపంలో, అశ్వరూడుడై ఉంటాడు. చతుర్భుజలలో రోకలి, కత్తి, కపాలము, వేటకత్తి ధరించివుంటారు వారాహి,కుబేర ఉపాసకులు ముందుగా ఈ మూర్తి ని పూజిస్తేనే ఉపాసనలు సిద్దిస్తాయి. పశ్చిమ దిక్కుకి అధిపతి అయిన ఉన్మత్త బైరవుడు వారాహి స్వరూపుడు.

కపాల భైరవుడు రుధిర దేహకాంతితో, మూడు దిగంబర శరీరంతో, ఇంద్రాణీ శక్తితో కూడిన శాంతమైన బలరూపంతో గజవాహనుడై ఉంటాడు. నాలుగు చేతుల్లో వజ్రం,ఖడ్గం, పానపాత్ర, పాశం ధరించి ఉంటాడు. భౌతిక సుఖ సంపదలు కావాల్సిన వారు ఈయన ఉపాసన చేయాలి. ఈ ఉపాసనతో ఈ లోకంలోనూ, స్వర్గలోకంలోను సుఖాలు సిద్దిస్తాయి. ఇంద్ర స్వరూపుడు అయిన కపాల బైరవుడు వాయువ్య దిశకు అధిపతి. స్వర్గ క్షేత్రపాలకుడు.

భీషణ భైరవుడు ఎర్రని శరీర ఛాయతో, త్రినేత్రుడిగా, దిగంబర శరీరంతో, చాముండా శక్తితో, శాంత బాలరూపంతో, సింహ వాహనారూడుడై ఉంటాడు. చతుర్భుజాలతో శూలం, ఖడ్గం, కపాలము, ముద్గరం ధరించిన భీషణ బైరవుడ్ని చండి, చాముండా ఉపాసకులు ఉపాసన చేయడంతో చండీ సప్తసతి సిద్దిస్తుంది. చాముండాకు క్షేత్ర పాలకుడైన ఈ బైరవుడు ఉత్తర దిశకు అధిపతి.

సంహార భైరవుడు
మూడు నేత్రాలతో, శూలం, చక్రం, గద, ఖడ్గం, అంకుశం, పాత్ర, శంఖం, డమరుకం, వేటకత్తి, పాశం ధరించిన పది చేతులు కల సంహార భైరవుడు ,నాగ యజ్ఞోపవీతం తో, దిగంబరంగా, బాల రూపంతో, కోరలు గల భయంకర వదనంతో, కుక్క వాహనంగా విభిన్నంగా దర్శనమిస్తారు. తాంత్రికులు కాపాలికులు, యామలులు, ఈ భైరవ ఉపాసన అనంతరమే.. ఈయన దయతోనే తాంత్రిక షట్కర్మలు సిద్దిస్తాయి, ఫలవంతమౌతాయి సర్వశక్తి స్వరూపుడైన ఈయన ఈశాన్య దిశకు అధిపతి తంత్ర క్షేత్రపాలకుడు.. దిగంబరాయ విద్మహే కాశీక్షేత్రపాలాయ ధీమహి
తన్నో కాల భైరవ ప్రచోదయాత్

Related posts

‘మట్కా’ నుంచి వింటేజ్ బ్రాండ్ న్యూలుక్ పోస్టర్స్

అక్టోబరు 19న శ్రీ‌వారి ఆర్జితసేవా ఆన్లైన్ టికెట్ల విడుదల

మొదట్లో మన కరెన్సీ పై మహాత్మగాంధీ ని వద్దనుకున్నారు.. కానీ….

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More