తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన 2025 జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు అక్టోబరు 21 నుండి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. అలాగే
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించు కునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అదే విధంగా జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక తిరుమల, తిరుపతిలలో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
భారీ వర్షాలకుముందస్తు చర్యలు
ఇదిలా ఉండగా భారీ వర్షాల కారణం గా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన టీటీడీ శ్రీవారి మెట్టు నడకదారి మెట్ల మార్గాన్ని, శ్రీవారి పాదాలు, శిలా తోరణం పాప వినాశనం లను ముందస్తు చర్యలలో భాగంగా మూసివేస్తున్నట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు నడక మార్గాన్ని రేపటి వరకు మూసివేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈఓ శ్రీ జె.శ్యామలరావు బుధవారం టీటీడీ ఉన్నతాధికారులతో వర్చువల్ గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విపత్తుల నిర్వహణ ప్రణాళికపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారీ వర్షాల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. కొండ చరియలపై ప్రత్యేక నిఘా ఉంచి ఘాట్ రోడ్లలో ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ కు అంతరాయం కలకగకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ శాఖ ముందస్తు జాగ్రత్తగా జనరేటర్ల కొరకు డీజిల్ ను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఐటీ వింగ్ భక్తుల దర్శనాలు, వసతి, ప్రసాదం వంటి కార్యాకలాపాలకు ఆటంకం కలగకుండా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్నారు. వైద్య శాఖ అంబులెన్సు లను అందుబాటులో పెట్టుకుని సిబ్బందితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంజనీరింగ్ విభాగం డ్యామ్ గేట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఘాట్ రోడ్లలో జేసీబీలను సిద్ధంగా ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ట్రాఫిక్ పోలీసులు ఇంజినీరింగ్ సిబ్బందితో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైతే అగ్ని మాపక సిబ్బంది వేగంగా స్పందించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రజా సంబంధాల విభాగం వాతావరణ సమాచారాన్ని తెలుసుకుంటూ ఎస్వీబీసీ, సోషల్ మీడియా ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ భక్తులను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే పాపవినాశనం, శిలా తోరణం మార్గాలను టీటీడీ మూసివేసింది. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ మార్గాల్లో రాకపోకలను టీటీడీ పునరుద్ధరించనుంది