మొదట్లో మన కరెన్సీ పై మహాత్మగాంధీ ని వద్దనుకున్నారు.. కానీ….

కరెన్సీ ఆ దేశం ఆర్థిక సామర్థ్యాన్నే కాదు ఆ జాతి చరిత్ర, సంస్కృతి, వారసత్వం, వంటి ఎన్నో విషయాలను ఆవిష్కరిస్తుంది. కరెన్సీ నోట్లపై ముద్రితమైన చిహ్నాలు, చిత్రాలు సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవ్యాపితం చేస్తున్నాయి.. ప్రపంచవ్యాప్తంగా, అనేక దేశాలు వారి నాయకులను గౌరవిస్తూ కరెన్సీ నోట్లపై వారి చిత్రాలను ముద్రించారు..

అగ్ర దేశం అమెరికా జార్జ్ వాషింగ్టన్, పాకిస్తాన్‌ లో మొహమ్మద్ అలీ జిన్నా, చైనాలో మావో జెడాంగ్, మనదేశం లో మహాత్మా గాంధీ లు కరెన్సీ హీరోలు గా మారారు. ఇటీవల కాలంలో, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మను మార్చాలని వివిధ వర్గాలు , కొన్ని రాజకీయ పార్టీల నుండి డిమాండ్ వస్తున్న విషయం తెలిసిందే..! జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ పటేల్ ల చిత్రాలను ప్రచురించాలని అదేవిధంగా హిందూ దేవీ దేవతల చిత్రాలను ముద్రించాలని కూడా ప్రతిపాదనలు తీసుకువచ్చారు. ఇతర దేశాల సంగతి ఎలా వున్నా మనదేశపు కరెన్సీ పై మాత్రం మహాత్మాగాంధీ చిత్రం ముద్రించాలన్న ఉద్ధేశం లేదు.. స్వాతంత్ర్యానంతరం మనదేశం లో కరెన్సీ నోట్ల కోసం గాంధీ ఫోటో మొదట తిరస్కరించబడింది.


అయితే వద్దనుకున్న గాంధీ ఫోటో మళ్ళీ భారతీయ కరెన్సీ పై ఎందుకు కనిపించింది…?

భారతదేశం గణతంత్ర రాజ్యం గా అవతరించిన తరువాత రిజర్వ్ బ్యాంక్ ఉనికిలో ఉన్న నోట్లను పునః సమీక్షించి కొత్త నోట్లను జారీ చేయడం కొనసాగించింది. అంతకు ముందే 1949లో కొత్త కరెన్సీకి సంభందించి కొన్ని చిహ్నాలను ఎంపిక చేయాలనుకున్న తరుణం లో గాంధీ చిత్ర ప్రతిపాధనను అప్పటి కమిటీ తిరస్కరించి సారనాథ్‌లోని స్తూపాన్ని ఎంపిక చేసింది.. తరువాత అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ చాలా సంవత్సరాల పాటు మనదేశ ఔన్నత్యాన్ని చాటే పులులు, జింకలు వంటి జంతువుల చిత్రాలు , హిరాకుడ్ ఆనకట్ట, ఆర్యభట్ట ఉపగ్రహం వంటి పారిశ్రామిక ప్రగతికి చెందిన కొన్ని చిహ్నాలు బృహదీశ్వరఆలయం, వంటి చిత్రాలే భారతీయ నోట్లపై స్థానం సంపాదించుకున్నాయి. గాంధీ జయంతి శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 1969 లో తొలిసారిగా మహాత్మాగాంధీ చిత్రం కరెన్సీ నోటుపై కనిపించింది. ఈ డిజైన్‌లో సేవాగ్రాం ఆశ్రమ నేపథ్యం లో సిటింగ్ పోజిషన్ లో వున్న గాంధీ చిత్రాన్ని ముద్రించారు. చాలాకాలం ఆ కరెన్సీ చెలామణి లో వుంది. జనతా పార్టీ ప్రభుత్వం అధిక విలువ కలిగిన నోట్లను రద్దు చేసిన తొమ్మిదేళ్ల తరువాత 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఐదు వందల రూపాయల నోటును మళ్ళీ ప్రవేశపెట్టినప్పుడు కొత్త 500 రూపాయల నోటు పై గాంధీ గారు దర్శనమిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 1996లో మహాత్మా గాంధీ సిరీస్‌ను ప్రారంభించింది, ఇప్పుడు మాత్రం అన్ని డినామినేషన్లలో మహాత్మగాంధీ శాశ్వత చిత్రం గా మారారు.

ఈ నోట్లలో వాటర్‌మార్క్‌లు, సెక్యూరిటీ థ్రెడ్‌ల వంటి మెరుగైన భద్రతా ఫీచర్లను కూడా ప్రవేశపెట్టింది. ఇది భారతదేశ కరెన్సీ చరిత్రలో ఓ గొప్ప సాంకేతిక ప్రగతి. 2016లో, కరెన్సీ నోట్లపై ఇతర నాయకుల ఫోటోలను మార్చే అంశం పై అప్పటి యుపిఎ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది అయితే ఇప్పటికిప్పుడు చిత్రాలను మార్చే అవసరం లేదని కమిటీ అభిప్రాయపడింది. తరువాత ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశంపై స్పందిస్తూ ఏ కరెన్సీ ని చెలామణి చేయాలనే దానిపై ప్రభుత్వం ఆర్‌బిఐతో ఎప్పటికప్పుడు సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని నోట్ల రూపకల్పన భద్రతా లక్షణాలను ప్రభుత్వం సమీక్షిస్తుందని పేర్కొన్నారు.

అంబేద్కర్‌ 125వ జయంతిని పురస్కరించుకుని 125 సర్క్యులేషన్ నాణెం, 10 డినామినేషన్, నాణాలను ప్రధాని విడుదల చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దేశానికి శ్రేయస్సు తీసుకురావడానికి భారతీయ నోట్లపై లక్ష్మీ దేవి , లార్డ్ గణేశ చిత్రాలను ముద్రించాలని డిమాండ్ చేసి రాజకీయ ప్రకంపనలకు ఆజ్యం పోసింది. ఇతర పార్టీలు దీనిపై విమర్శలు చేయడం తో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. ఇదిలా వుంటే రెండేళ్ళ క్రితం కొత్తగా విడుదల చేసిన డిజిటల్ రూపాయి డిజైన్ పై గాంధీ చిత్రాన్ని ముద్రించనందుకు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ అసంతృప్తిని వ్యక్తం చేశారు. డిజిటల్ కరెన్సీ రూపకల్పనలో మహాత్మా గాంధీని విస్మరించినందుకు ఆర్‌బిఐ, కేంద్రప్రభుత్వం లపై మండిపడ్డారు. అయితే తరువాత వచ్చే డినామినేషన్ల పై తిరిగి ఇదే గాంధీ బొమ్మ ను కొనసాగిస్తారా.. లేక కొత్త చిహ్నాలను ప్రింట్ చేస్తారా… వేచి చూడాలి.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More