జన హృదయాలలో నిలిచిపోయి స్వాతంత్ర్య సమరం లో లో కీలకభూమిక పోషించిన వందేమాతరగీతం కు తగిన గౌరవం ఎందుకు లభించలేదు.? తరువాత పుట్టిన జనగణమన ఎందుకు జాతీయగీతం హోదా పొందింది.? భారత స్వాతంత్ర్య పోరాటం లో వందేమాతరం ప్రస్తావన అసలు విడదీయలేనిది.. వందేమాతరం నినదించిన కారణం తో ఎంతోమంది యోధులు జైలు జీవితం అనుభవించారు. వందేమాతరం గేయం అన్నా నినాదం అన్నా , బ్రిటిష్ వారి గుండెల్లో అలజడి చెలరేగేది. మరి అలాంటి వందేమాతరం తగిన గౌరవాన్ని, చట్టపరమైన, రాజ్యాంగ పరమైన గుర్తింపును గాని, రక్షణను గాని ఎందుకు పొందలేకపోయింది. దీని నేపద్యాన్ని ఓసారి పరిశీలిస్తే 1876 లో బంకిమ్ చంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రాయగా విశ్వకవి రవీంద్ర నాధ్ ఠాగూర్ స్వరకల్పన చేయడం తో ఈ గేయం ప్రాచుర్యం లోకి వచ్చింది1896 లో కలకత్తా లో జరిగిన కాంగ్రెస్ మహాసభ లో ఈ గేయాన్ని ఆలపించడంతో ఇది దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. దేశభక్తి ప్రదర్శనకు, బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక ధిక్కార స్వరానికి వందేమాతరం గొప్ప నినాదమైంది. స్వాతంత్ర్య పోరాటం ఉదృతంగా జరుగుతున్న దశలోనే 1911 లో రవీంద్ర నాధ్ ఠాగూర్ జనగణమన ను లిఖించారు. వందేమాతరం అంత కాకపోయినా పోరాటం లో అదికూడా ఓ భాగమైంది. అవిభక్త భారతదేశ స్ఫూర్తి ఆ గీతం లో కనిపించే విధంగా విశ్వకవి ఆ గీతాన్ని మలిచారు.స్వాతంత్ర్య సిద్ధి అనంతరం 1947 అర్ధరాత్రి సమావేశమైన భారత రాజ్యాంగ సభ అజెండా లో భాగంగా వందేమాతరం అలపిస్తుండగా ముస్లీం లీగ్ తన అభ్యంతరం తెలిపింది. ఇందులో హిందూమత పదాలు ఉన్నాయని దీనిని తాము జాతీయ గీతం గా ఒప్పుకోమని స్పష్టం చేయడం తో వందేమాతరం, జనగణమన ఈ రెండింటి లో ఏది జాతీయగీతం గా ఉండాలో తేల్చుకోవాల్సిన సమయంలో కాంగ్రెస్ పార్టీ జనగణమన వైపు మొగ్గుచూపింది. ముస్లీం లను నొప్పించకూడదన్న ఆ నిర్ణయం తో 1950 జనవరి24 న జరిగిన రాజ్యాంగ సభ చివరి సమావేశంలో జనగణమన జాతీయగీతం గా ఉంటుందని తీర్మానం చేస్తూ స్వాతంత్ర్య పోరాటం లో కీలక పాత్ర పోషించిన వందేమాతరం గేయం సమానహోదా తో గౌరవం పొందుతుందని ప్రకటించారు.. అయితే వందేమాతర గీతం పై నిర్ణయాన్ని చట్ట బద్దం చేయలేదు. తరువాత1971 లో తెచ్చిన జాతీయ చిహ్నాల అవమానించడాన్ని నిరోధించే చట్టం లో కూడా వందేమాతర గీత సమానహోదా ప్రస్తావన తీసుకురాలేదు. 76 లో తీసుకువచ్చిన ఆర్టికల్51ఏ లో కూడా వందేమాతరం హోదా ని విస్మరించారు. వందేమాతరం గీతానికి జనగణమన తో పాటుగా చట్ట బద్ధమైన సమానహోదా కల్పించాలని కోరుతూ గౌతమ్ మొరార్క అనే వ్యక్తి వేసిన పిటిషన్ కు స్పందించిన కేంద్రప్రభుత్వం దేశానికి ఒకే జెండా , ఒకే జాతీయగీతం వుంటాయని పేర్కొంటూ జనగణమన తో సమానంగా వందేమాతరం గీతాన్ని చూడలేమని కోర్టుకు స్పష్టం చేసింది. అలా అని దీన్ని తక్కువ చేయినట్టుకాదని వివరణ ఇచ్చింది. వందేమాతరగీతానికి న్యాయం జరగాలంటే నిబంధనలు రూపొందించాలని 2016 లో రాజ్యసభ కు తెలిపిన కేంద్రం ఆవైపుగా అడుగులు మాత్రం వేయలేదు.