అరకు కాఫీ ప్రాధాన్యతను పురష్కరించుకుని ప్రముఖ వాణిజ్య సంస్థ టాటా సంస్థ మార్కెటింగ్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ టాటా సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు. టాటా సంస్థకు కావలసినంత మేర కాఫీ గింజలు అందించడం జరుగుతుందని, సంస్థ ఆశించిన స్థాయిలో గ్రేడింగ్ చేయిస్తామని కలెక్టర్ తెలిపారు. ఆర్గానిక్, ఇనార్గానిక్ వేరు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం సరైన మార్కెటింగ్ లేక గిరిజన రైతులు దళారులను నమ్మి మోసపోతున్నందున నూతన మార్కెటింగ్ విధానాలను అన్వేషిస్తున్నామని ఇటువంటి సమయంలో టాటా సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. సంస్థ ప్రతినిధులు కాఫీ లోగో రూపొందించి కాపీ రైట్స్ తీసుకుంటామని హామీ ఇచ్చారు.
టాటా గ్రూప్ ఎక్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ బిజినెస్ హెడ్ అమిత్ పంత్ మాట్లాడుతూ గత రెండు రోజులుగా పాడేరు ఏజన్సీ ప్రాంతంలో పర్యటించి ఇక్కడ పండుతున్న కాఫీ నాణ్యతలను పరిశీలించామని కాఫీ పంట బాగుండడమే కాకుండా ఆర్గానిక్ విధానంలో పండిస్తున్నారని తెలిపారు. ఐటిడిఎ, జిసిసి తరుపున కాఫీ కొనుగోలు, బ్రాండింగ్ కు సిద్ధంగా ఉన్నామని, రైతులకు అవసరమైన శిక్షణలు అందించి కాఫీ పంటకు అదనపు విలువలు జోడించే విధంగా ఐటిడిఎ, జిసిసి, కాఫీ బోర్డు, రైతులకు అన్నివిధాల సహకరిస్తామని వివరించారు. అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్న విషయాన్ని గుర్తించామని తెలిపారు. భీసుపురం, సుంకర మెట్ట కాఫీ తోటలను పరిశీలించి సంతృప్తి పోదామని వెల్లడించారు.