రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయిలో తమ జెండాను పాతేందుకు బిజెపి సమాయత్తమవుతుంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు బిజెపి సపోర్ట్ చేయడం పై ఆంధ్ర ప్రజలు ఇప్పటికి గుర్రుగానే ఉన్నారు. దీనికి తోడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కేంద్ర బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదనే ఆరోపణలు కూడా ఉండనే ఉన్నాయి. ఇలాంటి కారణాలతోనే బిజెపి పట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగానే ఉన్నారు. ఆ ప్రభావం విభజన తర్వాత జరిగిన ఎన్నికలలో బాగానే కనిపించింది. బిజెపి కేంద్ర నాయకత్వం అన్ని రాష్ట్రాలలో తమ పార్టీని బలోపేతం చేసుకుంటూ వెళ్తూ ఉంది. కానీ ఏపీ లో మాత్రం అది ఇప్పట్లో జరిగే అవకాశం లేదని గ్రహించిన ఆ పార్టీ ఎన్నికల బరిలోకి సింగిల్ గా వెళ్లే సాహసం చేయలేని పరిస్థితిలో ఉంది. అయితే ఈసారి జరిగే ఎన్నికలలో టిడిపి ,జనసేన లతో కలిసి బరిలోకి దిగేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆ మూడు పార్టీలు పొత్తు పై ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈసారి ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ 2030 ఎన్నికలలో మాత్రం పార్టీని రాష్ట్రంలో పూర్తిగా బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాలలో తమ అభ్యర్థులను పోటీలోకి నిలపాలనే ఆలోచన చేస్తూ మిషన్ 2030 పేరుతో ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.. రాష్ట్రంలో పర్యటిస్తున్న రాష్ట్ర కీలక బిజెపి నేతలు మాత్రం పొత్తులపై తమకేమీ తెలియదని చెబుతూనే రానున్న కాలంలో బిజెపి ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేపట్టడం ఖాయమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. 2030 మిషన్ పేరుతో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర నాయకత్వం పని చేస్తున్నదని చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని ఆ పార్టీ కీలక నేతలు సోము వీర్రాజు, జీవిఎల్. నరసింహారావు వంటి పలువురు నేతలు సుడిగాలి పర్యటనలు చేస్తూ పార్టీ క్యాడర్ ను ఉత్తేజ పరుస్తున్నారు. గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని నేతలకు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకున్న సరే పార్టీ బలోపేతానికి ముందుకు వెళ్లాల్సిందేనని ఖరాఖండిగా చెబుతున్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశానుసారం ప్రతి ఒక్కరు పార్టీ కోసం పని చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.2030 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి అధికారం చేపట్టడం మే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పనిచేయాలనే కేంద్ర నాయకత్వం సూచన మేరకు ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలన్నారు. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా వంటి వారు రాష్ట్ర నాయకత్వానికి ఎప్పుడూ తోడుగా ఉంటారని పేర్కొంటున్నారు. 2030 మిషన్ కోసం అహర్నిశలు పనిచేయాల్సిందేనని చెబుతున్నారు.