విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అక్రమ వసూళ్ల వివాదం స్వపక్ష నేతల మధ్య అగ్గి రాజేసింది. ఈ వ్యవహారంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలుగజేసుకోవడంతో రచ్చగా మారింది. ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్, శానిటేషన్ కోసం ఫిషింగ్ హార్బర్ లో ఉండే అందరి వద్ద కొంత సొమ్ము వసూలు చేయాలని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ నిర్ణయించింది. ఈ మేరకు 1000 నుంచి 3000 రూపాయల వరకు వసూలు చేయాలని భావించి ఇప్పటికే అక్కడ వారికి ఈ విషయాన్ని తెలియజేసింది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలయింది. వైసిపి నాయకుడిగా చెలామణి అవుతున్న అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ ఈ విషయాన్ని అసోసియేషన్ చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున అలాగే స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ దృష్టికి తీసుకురాకపోవడంతో అతనిపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఈ క్రమం లోనే ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ పేరుతో అడ్డదారిలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని అతని పై ఆరోపణలు వచ్చాయి. అక్కడితో ఆగకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మంత్రి సీదరి అప్పలరాజు పై కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం కొనసాగుతుంది. దీని పై స్పందించిన అసోసియేషన్ అధ్యక్షులు జానకిరామ్ ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నారని, కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరో పక్క ఫిషింగ్ హార్బర్ లో ఉండే కొంతమంది ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసి అక్రమ వసూళ్ల పై ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా విశాఖ పోర్టు.. ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి కోసం చూసుకుంటాయని ఎవరు కూడా ఎటువంటి డబ్బులు చెల్లించనవసరలేదని చెప్పారు. అయితే ఇక్కడ అసోసియేషన్ అధ్యక్షులు, స్థానిక ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో ప్రకటన చేయడంతో ఎవరు చెప్పింది వినాలో అని అక్కడి వారు సందిగ్ధం లో పడ్డారు.అయితే ఇద్దరు కూడా వైసిపి పార్టీకి చెందిన వారు కావడం విశేషం.ఈ వ్యవహారం వీరిద్దరి మధ్య అగ్గి రాజేసిందనే చెప్పాలి. కొంతమంది అసోసియేషన్ ప్రతినిధులు మాత్రం ఎమ్మెల్యే తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ ఆయన వ్యవహార శైలిని తప్పు పడుతున్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకుల లాగా ప్రత్యారోపణలు చేస్తూ అసోసియేషన్ కు చెడ్డ పేరు తీసుకువచ్చే విధంగా ఎమ్మెల్యే ప్రకటనలు చేయడం సరికాదని అంటున్నారు. ఈ వ్యవహారాన్ని నిశితంగా గమనిస్తున్న టిడిపి, జనసేన పార్టీ నేతలు సమయం చూసుకుని తాము కూడా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఫిషింగ్ హార్బర్ లో అక్రమ వసూళ్ల పై త్వరలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయం రాష్ట్ర మంత్రి సీదరి అప్పలరాజు దృష్టికి వెళ్లినట్లు కూడా సమాచారం. సొంత పార్టీ నేతల మధ్య రాసుకుంటున్న వివాదాన్ని చల్లార్చేందుకు స్థానిక వైసీపీ నేతలు కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.