తెలుగు రాష్ట్రాల్లో వేడి విపరీతంగా పెరిగిపోయింది. గతంతో పోల్చుకుంటే.. ఈసారి మరీ ఎక్కువగా నమోదైంది. ఇక హైదరాబాద్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ఏప్రిల్ 2022లో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ పెరిగిపోయాయి. అంతే కాకుండా విపరీతమైన వడ గాలులు వీచాయని ఒక అధ్యయనం తెలిపింది. గ్రీన్‌పీస్ ఇండియా సంస్థ.. 2021 మరియు 2022లో హీట్‌వేవ్‌ను పోల్చి చూసింది.గత ఏడాది ఏప్రిల్‌లో ఒక్క హీట్ వేవ్ మాత్రమే ఉండగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనే 10 హీట్‌వేవ్ రోజులు ఉన్నట్టుగా వెల్లడించింది. భారతదేశంలోని 10 రాజధాని నగరాల్లో ఉష్ణోగ్రతలను చూపించే డేటాను విడుదల చేయగ 2021తో పోల్చినప్పుడు ఉష్ణోగ్రతలో దారుణమైన పెరుగుదలను చూశాయి. నివేదిక ప్రకారం, ఏప్రిల్‌లో హైదరాబాద్ నగరంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదైంది. సాధారణంగా ఉష్ణోగ్రతలు ఏప్రిల్ చివరి నాటికి, మే ప్రారంభంలో పెరుగుతాయి. కానీ ఈసారి ఏప్రిల్ ప్రారంభంలోనే హైదరాబాద్‌లో విపరీతమైన వేడి వాతావరణం నెలకొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి 72ఏళ్ల రికార్డు.. బ్రేక్ అయ్యింది. దేశంలో హీట్వేవ్ పరిస్థితులపై యూఎన్ ఏజెన్సీ డబ్ల్యూఎంఓ ఆందోళన వ్యక్తం చేసింది.. వాయువ్య భారతం, మధ్య భారతంలో ఉష్ణోగ్రతలు సగటున 35.90డిగ్రీలు, 37.78డిగ్రీలు నమోదయ్యాయి. ఇది 122ఏళ్ల గరిష్ఠం. ఈ విషయాన్ని భారత వాతావరణశాఖ వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిందని, ఫలితంగా దేశంలో పవర్ కట్లు పెరిగాయని పేర్కొంది. భారతదేశంలో ఒక సంవత్సరంలో అత్యంత వేడిగా ఉండే రోజుల సంఖ్య 1950లో 40 ఉండేది. కానీ 2020 వచ్చేసరికి.. 100 రోజులకు చేరింది. ఇక ముందు ముందు ఇంకా ఎన్నిరోజులు వేడిగా ఉంటాయోనని ఆందోళన మెుదలైంది. ఈ ఉష్ణోగ్రత పెరుగుదల ఎక్కువగా గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల పెరుగుదల కారణం. భూ వినియోగంలో మార్పులు, చెట్లు నరికేయడం లాంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ వడగాలులు.. గ్లోబల్ వార్మింగ్ మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందో గుర్తు చేసేందుకు ఓ ఉదాహరణ. రుతుపవనాలు తెలంగాణలో ఎంటర్ అయినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఎండలు దారుణంగా ఉండడం పరిస్థితి కి అద్దం పడుతోంది.