వివాదాస్పద ‘పెగాసస్’ స్పైవేర్ (నిఘా సాఫ్ట్‌వేర్) బలమైన ఆయుధంగా మారిన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తన రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, యాక్టివిస్టులపై దీనిని ప్రయోగిస్తుందని నాలుగేళ్ల క్రితం దేశంలో జరిగిన రచ్చ పై కొందరు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించగా.. అది తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి స్పైవేర్ వినియోగాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది..
పెగాసస్ అనేది అత్యంత ఆధునిక, శక్తివంతమైన నిఘా సాఫ్ట్‌వేర్. దీని ద్వారా దేశ వ్యతిరేక శక్తుల కమ్యూనికేషన్ ఏ రూపంలో ఉన్నా సరే ట్రాక్ చేయవచ్చు. తద్వారా వారి కుట్రలు, పన్నాగాలను ముందుగానే పసిగట్టి జాగ్రత్తలు చేపట్టవచ్చు. అయితే ఈ పెగాసస్ అస్త్రాన్ని బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులైన కాంగ్రెస్ సహా వివిధ విపక్ష పార్టీలపై ప్రయోగిస్తుందని, ఆ జాబితాలో జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులతో పాటు మరికొందరు ప్రముఖులు కూడా ఉన్నారని పేర్కొంటూ 2021లో ఒక అంతర్జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. దీంతో దేశమంతటా ప్రతిపక్ష రాజకీయ పార్టీలు, కొన్ని మీడియా సంస్థలు గగ్గోలు పెట్టాయి. తమ వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆందోళనలు జరిగాయి. కొందరు ఈ విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ఆ కేసు నాలుగేళ్లుగా కొనసాగుతూ తాజాగా విచారణకు వచ్చింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్‌తోకూడిన ధర్మాసనం అన్ని పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ద్రోహులపై స్పైవేర్ ప్రయోగిస్తే తప్పేంటి?
కేసు గత విచారణలో భాగంగా పెగాసస్ స్పైవేర్ వినియోగం, దుర్వినియోగంపై సాంకేతిక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు నివేదికను అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 ఆగస్టులో నిపుణుల బృందం ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ నివేదికను బహిర్గతం చేయడం లేదని ఆరోపిస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకొస్తూ.. వెంటనే ఆ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ జోక్యం చేసుకుంటూ.. “దేశ భద్రత కోసం స్పైవేర్ వినియోగిస్తే తప్పేంటి?” అని ప్రశ్నించారు. దేశ వ్యతిరేక శక్తులపై ఈ నిఘా సాఫ్ట్‌వేర్ ప్రయోగిస్తే ఎలాంటి తప్పులేదని, అయితే దాన్ని ఎవరిపై ప్రయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న అని అన్నారు. దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని కూడా ఆయనన్నారు. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరలేరని, అయితే సామాన్య పౌరుల గోప్యతకు భంగం వాటిల్లితే తాము దర్యాప్తు జరిపిస్తామని పేర్కొన్నారు.పహల్‌గాం ఉగ్రదాడి ఘటనను ధర్మాసనం పరోక్షంగా ప్రస్తావించింది. ప్రస్తుతం దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో గమనిస్తూ.. మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు వెల్లడించింది. దేశ భద్రత, సార్వభౌమౌమత్వానికి సంబంధించిన నివేదిక, సమాచారాన్ని బహిర్గతం చేయడం సరికాదని ఘాటుగా స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఈ నివేదిక ప్రజా సమూహంలో చర్చింకుకునే పబ్లిక్ డాక్యుమెంట్‌గా మారకూడదని అభిప్రాయపడింది.
పెగాసస్ స్పైవేర్ అంటే..?
పెగాసస్ అనేది ఇజ్రాయిల్ దేశానికి చెందిన NSO గ్రూప్ రూపొందించిన అత్యంత అధునాతన స్పైవేర్. ఇది స్మార్ట్‌ఫోన్‌లలోకి చొరబడి కాల్స్, మెసేజ్‌లు, ఈ-మెయిళ్లు, ఫొటోలు, లొకేషన్ డేటాను సేకరించగలదు. ఇది “జీరో-క్లిక్” దాడులను నిర్వహించగలదు. అంటే యూజర్ ఎటువంటి లింక్‌ను క్లిక్ చేయకుండానే ఫోన్ హ్యాక్ అవుతుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఉగ్రవాదాన్ని ఎదుర్కోడానికి, దేశ వ్యతిరేక కుట్రలను ముందే పసిగట్టడానికి మాత్రమే తాము ప్రభుత్వాలకు అందజేస్తున్నామని NSO గ్రూపు తెలియజేసింది. మొత్తమ్మీద భారత రాజ్యాంగంంలోని ఆర్టికల్ 21 ప్రసాదించిన వ్యక్తిగత గోప్యత హక్కును ఈ స్పైవేర్ ఉల్లంఘిస్తుంది అనేది పిటిషనర్ల వాదన కాగా.. దేశంలో విధ్వంసాలు సృష్టిస్తూ, మారణహోమాలు తలపెట్టిన ఉగ్రమూకకు ఈ గోప్యత హక్కు ఎక్కడిది అని ప్రభుత్వం వాదిస్తోంది. సుప్రీంకోర్టు సైతం కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ ఉగ్రవాదులకు గోప్యత హక్కు లేనే లేదని తెగేసి చెప్పింది. అయితే దీన్ని ఎక్కడైనా దుర్వినియోగం చేస్తే తాము దర్యాప్తు జరిపించి తగిన చర్యలు తీసుకుంటామని పిటిషనర్లకు భరోసా ఇచ్చింది.