పదవ తరగతి పరీక్షల ఫలితాలకు సంబంధించి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ట్విట్టర్ వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా ఏకవచనంతో సంభోదించుకుంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. పరీక్షల ఫలితాల విడుదల నుంచి నేటి వరకు కూడా ఈ వ్యవహారంపై అధికార వైసీపీ పార్టీ , ప్రధాన ప్రతిపక్షం టిడిపి పార్టీ నేతల మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఈసారి పరీక్షలలో మాత్రం 67 శాతానికి పరిమితం కావడంతో విపక్షాలకు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి మరో అవకాశం లభించినట్లయింది. ఈ ఏడాది ఆరు లక్షల పైగా పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో నాలుగు లక్షల మంది పాసయ్యారు. ఇందులో 71 పాఠశాలలో వంద శాతం మంది విద్యార్థులు ఫెయిల్ కావడంతో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విరుచుకు పడేందుకు అవకాశం లభించింది. 2015 లో 91.42 శాతం, 2016 లో 93.26 శాతం, 2017 లో 91.92 శాతం, 2018 లో 94.48 శాతం, 2019 లో 94.88 శాతం ప్రతి ఏడాది స్థిరమైన, గణనీయమైన ప్రగతిని సాధిస్తు వస్తుంది. కానీ ఈ ఏడాది పరీక్షలలో ఉత్తీర్ణత శాతం 67 కు పడిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో అతి తక్కువ ఉత్తీర్ణతా శాతానికి ప్రభుత్వ నిర్వాకరమే కారణం అని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. పథకాల భారాన్ని తగ్గించుకునేందుకు ఇలా విద్యార్థులను పెద్ద సంఖ్యలో పెయిల్ చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఫెయిలన వారికి అమ్మఒడి ఇవ్వరని అలాగే ఇంటర్‌లో చేరే వారి సంఖ్య కూడా తగ్గిపోతుందని, అక్కడా నిధులు మిగుల్చుకుంటారని ఆరోపణలు చేస్తున్నారు. దీని పై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇస్తూ నారాయణ విద్యా సంస్థలు పేపర్లు లీక్ చేయడం వల్ల విద్యార్థులు మానసిక ఆందోళనకు గురయ్యారని అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయని విమర్శించారు. అయితే ఒకపక్క పరీక్షల ఫలితాలపై వివాదం కొనసాగుతుండగా మరోపక్క ఏపీ సర్కార్ మాత్రం ఫలితాల వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉందనేది స్పష్టమవుతుంది. సంబంధిత ఉపాధ్యాయినీలకు నోటీసులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఫెయిల్ అయినందుకు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల ఉపాధ్యాయినీలకు సమగ్రశిక్ష అభియాన్ షోకాజ్ నోటీసులు జారీచేసింది. కొందరు విద్యార్థులు కనీస ఉత్తీర్ణత మార్కులు సాధించలేకపోయారని, ఇది తమ శాఖపై చెడు ప్రభావం చూపిందని ఆయా సబ్జెక్టుల టీచర్లకు పంపిన తాఖీదుల్లో పేర్కొంది. ఈ నోటీసులకు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ నోటీసుల వ్యవహారంతో ప్రభుత్వం కూడా పరీక్షల ఫలితాల శాతం పై అసంతృప్తిగా ఉందనేది తెలుస్తుంది. ఏపీ సర్కార్ దీనిపై సీరియస్ గా స్పందించి తగు చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది.