ఐపీఎల్ మీడియా హక్కుల వేలం ప్రక్రియలో భాగంగా బీసీసీఐకి కళ్లు చెదిరే ఆదాయం వచ్చింది. నాలుగు ప్యాకేజీలలో భాగంగా ‘ఎ’, ‘బి’ ప్యాకేజీలకే ఏకంగా రూ. 44 వేల (రూ. 44,075 కోట్లు) కోట్ల మేర ఆర్జించింది భారత క్రికెట్ బోర్డు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్ల సాలరీ పర్స్ కూడా పెరిగే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ప్రస్తుతం ఐపీఎల్ లో రిటెన్షన్ తో పాటు వేలం ప్రక్రియతో కలిపి ఆటగాళ్ల సాలరీ పర్స్ రూ. 90 కోట్లుగా ఉంది. అయితే 2017-2022 కాలానికి గాను మ్యాచ్ విలువ రూ. 54 కోట్లుగా ఉండగా తాజాగా అది వంద కోట్లు (రూ. 107.5 కోట్లు అని టాక్) దాటింది. అంటే గతంతో పోల్చితే డబుల్ అయింది. దీంతో ప్లేయర్స్ మనీ పర్స్ కూడా డబుల్ (రూ. 180 కోట్లు) అయ్యే అవకాశాలున్నట్టు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఆటగాళ్లు రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల వరకు కూడా పొందే అవకాశం ఉంటుంది. 2023 లో ఐపీఎల్ మినీ యాక్షన్ జరుగనుంది. మరి ఆటగాళ్ల మనీ పర్స్ పెరుగుతుందా..? అనేది త్వరలో తెలియనుంది.దీంతో పాటే టైటిల్ విన్నర్ కు ఇచ్చే ప్రైజ్ మనీ (ప్రస్తుతం రూ. 20 కోట్లు) కూడా పెరిగే అవకాశం లేకపోలేదు. ఇదే విషయమై ఇటీవలే బీసీసీఐ చర్చలు కూడా జరిపినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇక వీటితో పాటు బీసీసీఐతో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్ల జీతాలు కూడా పెరిగే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీసీసీఐతో సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్ల వేతనాలు కూడా డబుల్ అయ్యే ఆస్కారముంది. బీసీసీఐ కంటే ఆస్ట్రేలియా క్రికెట్ (సీఏ), ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తమ క్రికెటర్లకు మంచి వేతనాలను అందిస్తున్నాయి. సీఏలో కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లతో పోలిస్తే మన ఆటగాళ్లకు చెల్లించేది చాలా తక్కువ. 2008 లో 8 ఫ్రాంచైజీలతో ప్రారంభమైన ఐపీఎల్.. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. మీడియా హక్కుల వేలం జరుగుతున్న నేపథ్యంలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా 2008 న ఐపీఎల్ మీడియా రైట్స్, జట్లు, ఇతర విషయాలు గుర్తు చేసుకుంటున్నారు. వాటిమీద ఓ లుక్కేద్దాం.. 2008 నుంచి 2016 వరకు : సోనీ (రూ. 8,200 కోట్లు) 2017 నుంచి 2022 వరకు : స్టార్ ఇండియా (రూ. 16,348 కోట్లు) 2023 నుంచి 2027 వరకు : సోనీ (రూ. 44,075 కోట్లు- ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది) దీని ప్రకారం చూస్తే ఐపీఎల్ మీడియా హక్కుల విలువ 2008 తో పోలిస్తే ఇప్పటికీ 5 రెట్లు ఎక్కువగా పెరిగింది. మరి పైన పేర్కొన్న వాటిపై కూడా బీసీసీఐ దృష్టి సారిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.