విశాఖ నగరం మరో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కు వేదిక కానుంది. గత మూడేళ్ల నుంచి క్రికెట్ మ్యాచ్ కు ఇక్కడి స్టేడియంను ఎంపిక చేయడం తర్వాత అనివార్య కారణాల వల్ల మ్యాచ్ లను రద్దు చేయడం జరుగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం పకడ్బందీగా మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాచ్ రద్దయ్యే అవకాశమే లేదు. విశాఖ మదురవాడ ఏడీఏ – విడిసిఏ స్టేడియం వేదికగా ఈ నెల 14న జరగనున్న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ట్వీట్వంటి మ్యాచ్ కు సంబంధించి ఇప్పటికే ఆన్లైన్ టికెట్ల అమ్మకాల జోరు కొనసాగింది. ఆన్ లైన్ లో పెట్టిన వెంటనే టికెట్లన్ని సేల్ కావడం జరిగింది. ఇక ఆఫ్ లైన్ లో టికెట్ల అమ్మకాలు షురూ చేశారు. ఈ నెల 8 నుంచి ఏడీఏ – విడిసిఏ స్టేడియం గేట్ నెంబర్ -17, స్వర్ణ భారతి స్టేడియం, జ్యోతి థియేటర్ వద్ద టిక్కెట్లను విక్రయించనున్నారు. రూ.600 లు, రూ.1500 లు, రూ.2000 లు, రూ.3000 లు, , రూ. 3500 లు, రూ.6000 లుగా టిక్కెట్ ధరలను బీసీసీఐ నిర్ణయించింది. టికెట్ రేటు ఎంత ఉన్నా సరే కొనుగోలు చేసి క్రికెట్ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ట్వీట్వంటి సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా జరగనున్న మూడవ మ్యాచ్ కు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మ్యాచ్ ను తిలకించేందుకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు తరలి రానున్నారు. మూడేళ్ళుగా కోవిడ్ తో రెండుసార్లు జరగవలసిన మ్యాచ్ లు రద్దు కావడం తో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈసారి మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దయ్యే అవకాశం లేకపోవడంతో తమ అభిమాన క్రికెటర్లను నేరుగా చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియానికి తరలిరానున్నారు.