విశాఖలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. స్థానిక నేరస్థులకు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన నేరస్తులు కూడా తోడుకావడంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రాజకీయాలలో గ్రూపులు, వర్గాలు ఉన్నట్లుగా నేరస్తులు కూడా గ్రూపులుగా, వర్గాలుగా విడిపోయి ఆధిపత్య పోరు కోసం తరచుగా ఘర్షణ పడుతున్నారు. ఈ క్రమంలో భౌతిక దాడులకు తెగబడుతున్నారు. హత్యలు చేసేందుకు కూడా వెనుకడుగు వేయడం లేదు. విశాఖలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ల పరిధిలో ఇటువంటి గ్రూపుల మధ్య జరిగే ఘర్షణ లే ఎక్కువగా ఉంటున్నాయి. ఏదైనా సమస్య ఉంటే కూర్చుని మాట్లాడి పరిష్కరించుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ఎవరి నుంచి అయినా, ఏదైనా సమస్య వస్తే మాత్రం నేరుగా దాడి చేయడం లేదా హత్య చేయడం జరుగుతుంది. గత రెండేళ్లలో విశాఖలో వరుసగా జరిగిన హత్యలు ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయనే దానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు జరిగిన హత్యలు సంఖ్య గత ఏడాది కంటే ఎక్కువగా ఉండటం విశాఖ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నేరస్తులుగా మారుతున్న వారి వయసు 15 నుంచి 20 ఏళ్ల లోపు ఉండటం విశేషం. మైనర్లు ఎక్కువగా నేర ప్రవృత్తికి అలవాటుపడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మద్యం సేవించడం, అధిక మోతాదులో గంజాయి, డ్రగ్స్ తీసుకోవడం వీరికి అలవాటుగా మారింది. వీరికి తోడు రౌడీషీటర్లు మరోపక్క రౌడీ గ్యాంగ్ లు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పోలీసులు అనే భయం వీరికి ఏ మాత్రం లేదు. కొన్ని హత్యలు ఆయా పోలీస్ స్టేషన్ ల సమీపంలో జరగడం విశేషం. అయితే అక్కడ పోలీసులు కూడా కొన్ని కేసులను రోజుల వ్యవధిలో గంటల వ్యవధిలో చేధించిన రికార్డు ఉంది. కానీ నేరాలను నియంత్రించడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. నగర పోలీసు కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ మాత్రం నేరస్తుల పై ఉక్కుపాదం మోపుతామని ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే నేరస్తులకు హెచ్చరికలు చేశారు. వెంటనే రంగంలోకి దిగి పలు చర్యలు చేపట్టారు. కానీ నేరాలు మాత్రం ఆగడం లేదు. నేరస్తులు వరుస నేరాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.