1970 లో పాకిస్తాన్ – భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. అదును చూసి భారత్ ను దెబ్బ కొట్టాలని పాకిస్తాన్ ఎదురుచూస్తుంది. భారత్ పై దాడి చేసేందుకు కుట్రలు చేస్తుంది.నిఘా వర్గాల ద్వారా సమాచారం అందుకున్న భారత్ కూడా అప్రమత్తమయింది. ముఖ్యంగా తీరప్రాంతాలలో నావికా దళాన్ని అలర్ట్ చేసింది. ఆ సమయంలోనే పాకిస్తాన్ కు చెందిన సబ్ మెరైన్ పి.ఎన్.ఎస్. ఘాజీ విశాఖ తీరంలో చొరబడినట్లు సమాచారం అందింది. పాకిస్తాన్ లక్ష్యాన్ని గుర్తించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సమయంలోనే ఇక్కడ వైస్ అడ్మిరల్ గా పని చేస్తున్న కృష్ణన్ ఈ సంపత్ వినాయక ఆలయానికి వచ్చి ఈ ప్రమాదం నుంచి తప్పించాలని పూజలు చేసారట. 1971న డిసెంబర్ లో ఆ ఘాజి సబ్ మెరైన్ సముద్రంలోనే పేలి, మునిగిపోయింది. దానితో స్వామి మహిమ వల్లే పాకిస్తాన్ సబ్ మెరైన్‌ని ముంచెయ్యగలిగామని భావించిన కృష్ణన్ ఆలయానికి వచ్చి వెయ్యి కొబ్బరికాయలు కొట్టినట్లు సమాచారం. అప్పటినుంచి ఆయన విశాఖలో ఉన్నంత వరకూ ప్రతీరోజూ సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తరువాతే విధులకు వెళ్లే వారట. ఆ ఘటన తరువాత వైజాగ్ లోని సంపత్ వినాయక్ ఆలయం పాపులారిటీ పెరగడానికి ఇది చాలా ఉపయోగపడిందని అంటారు. ఈ ఆలయం లో కొలువైన స్వామివారిని, సకల సంపదలూ అనుగ్రహించే దైవంగా, వాస్తుదోషం నివారణకు అధిష్టాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు.1962 లో ఈ ఆలయాన్ని, ఎస్ జీ సంబందన్ & కో చెందిన ఎస్జీ సంబందన్, టీఎస్. సెల్వంగనేషన్ టి.ఎస్.రాజేశ్వరన్ లు నిర్మించారు. తమ వ్యాపారకార్యాలయం ఎదుట వాస్తుదోష నివారణార్థం నిర్మించిన ఆలయం “సంపత్ వినాయక” ఆలయం. స్థానిక మత్స్యకారులు (జాలర్లు) వారి రోజువారీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించేముందు తప్పనిసరిగా ఈ ఆలయానికి వచ్చి ప్రతిరోజూ స్వామివారికి దీపం వెలిగించి, భక్తి శ్రద్ధలతో ప్రార్ధించి మంచి ఫలితాలను పొందేవారు. “కంచి పరమాచార్య” శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరరేంద్ర సరస్వతి మహాస్వామివారు “మహాగణపతి యంత్రాన్ని” 1967లో ఇక్కడ ప్రతిష్టించారు ‘‘సంపత్ వినాయక’’ లేదా “శ్రీ సంపత్ వినాయగర్” ఆలయం తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ వైశాల్యం చాలా చిన్నగా ఉంటుంది. బొజ్జ గణపయ్య కొలువుతీరిన అతి బుల్లి ఆలయంగా దీన్ని చెప్పొచ్చు.