5జీ స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ జియో జోరు స్పష్టంగా కనిపించింది. ఏడు రోజుల పాటు జరిగిన వేలంలో ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ సంస్థ.. రూ. 88,078కోట్లు విలువ చేసే బిడ్లను దాఖలు చేసింది. మొత్తం దాఖలైన బిడ్లలో(రూ. 1,50,173కోట్లు).. ఒక్క జియో వాటానే 58.65శాతంగా ఉండటం విశేషం. 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగింపు అనంతరం టెలికాంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్.మీడియా కి వివరాలు వెల్లడించారు. రిలయన్స్ జీయో.. 700ఎంహెచ్జెడ్, 800ఎంహెచ్జెడ్, 1800ఎంహెచ్జెడ్, 3300ఎంహెచ్జెడ్, 26జీహెచ్జెడ్తో కూడిన మొత్తం 24,740ఎంహెచ్జెడ్ స్పెక్ట్రమ్ కోసం వేలం వేసినట్టు పేర్కొన్నారు. ఇక ఎయిర్టెల్.. జియో తర్వాతి స్థానంలో నిలిచింది. మొత్తం మీద.. 19867.8ఎంహెచ్జెడ్ కోసం రూ.43,084కోట్లు విలువ చేసే బిడ్లు వేసింది ఎయిర్టెల్. ఆ తర్వాతి స్థానంలో వొడాఫోన్ ఐడియా ఉంది. 6,228ఎంహెచ్జెడ్ కోసం రూ. 18,799కోట్లు విలువ చేసే బిడ్లను వేసింది ఆ సంస్థ. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ డేటా నెట్వర్క్స్ లిమిటెడ్ కూడా 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంది. 400ఎంహెచ్జెడ్ స్పెక్ట్రమ్ కొనుగోలుకు రూ. 212కోట్లు విలువ చేసే బిడ్లను వేసింది. దేశంలోనే తొలిసారిగా.. జులై 26న 5జీ స్పెక్ట్రమ్ వేలం మొదలైంది. ఏడు రోజుల పాటు సాగిన వేలం.. సోమవారం ముగిసింది. మొత్తం మీద బిడ్డింగ్ కోసం 40రౌండ్లు జరిగాయి. బిడ్లు వేసిన వాటిల్లో.. 71శాతం 5జీ స్పెక్ట్రమ్ అమ్ముడుపోయింది. ఆగస్ట్ 15వ తేదీ నాటికి అలోకేషన్ సహా మొత్తం బిడ్డింగ్ ప్రక్రియను ముగించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, దేశంలోని ప్రధాన నగరాల్లో 5G సేవలను ఈ సెప్టెంబర్ నాటికి అందించాలని పట్టుదలతో ఉంది. సక్సెస్‌ఫుల్ బిడ్డర్లకు 20 ఏళ్ల పాటు ఈ స్పెక్ట్రం అందుబాటులో ఉంటుంది. ఈ వేలంలో విజయవంతమైన బిడ్డర్లు 20 ఏళ్ల పాటు ఆ మొత్తాన్ని 20 వార్షిక వాయిదాల్లో చెల్లించవచ్చు. ఈ ఎయిర్‌వేవ్స్ కు రూ. 4.3 లక్షల కోట్లను రిజర్వ్ ప్రైస్‌గా నిర్ధారించింది. ఇప్పటికే ట్రాయ్ పలు చోట్ల పైలట్ ప్రాజెక్టుగా 5జీని ప్రారంభించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్, బెంగళూరు మెట్రో, కాండ్లా పోర్ట్, భోపాల్‌లోని 11ప్రదేశాల్లో 5జీ సేవలను జియో, ఎయిర్‌టెల్, వీఐ, బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా అందిస్తోంది.