తెలుగు సినీ పరిశ్రమలో పదేళ్ల ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ నేపథ్యం, యాస, భాష పెట్టకపోతే ఆ చిత్రాలు ఆడవేమో అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణఉద్యమం జరగకక ముందు ఈ భాషను కేవలం హాస్యపాత్రలకు, విలనిజానికి సింబల్‌గా పెట్టి కించపరచడం జరిగేదన్న ఆరోపణల స్థాయి నుంచి తెలంగాణ నేపథ్యం, భాష మెయిన్ స్ట్రీమ్ సినిమాగా అవతరించింది. క్రమక్రమంగా పుంజుకొని ఈ నేపథ్యంలో సినిమా చేస్తే బాక్సాఫీస్ సక్సెస్ అనే స్థాయికి ఎదిగింది.. సినిమాల ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, కుటుంబ జీవన విధానం ఎలా ఉంటాయో చూపించాలనుకునేక ప్రయత్నం ఇప్పుడు ఊపందుకుంది.. ప్రస్తుతం తెలంగాణ భాషతోపాటు గ్రామీణ తెలంగాణకు చెందిన కథలు సినిమాగా రావడం గొప్ప అచీవ్‌మెంట్. అర్బన్ సిటీ రొమాంటిక్ కథలు కాకుండా, మట్టివాసనతో తీసే పల్లె కథలు కూడా విజయం సాధిస్తాయనే నమ్మకం ఏర్పడింది. ‘ఇది మన తెలంగాణ సినిమా’ అని అందరూ గర్వంగా చెప్పుకొనేలా ఇక్కడి సినిమా ఎదిగింది. దీనిని తెలంగాణ సాధించిన గొప్ప సాంస్కృతిక విజయంగా అభివర్ణిస్తున్నారు భాషాభిమానులు.. ప్రస్తుతం వరుసగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ తెలుగు సినిమాలు రూపొందుతున్నాయి. డీజే టిల్లు, ఫిదా, ఇస్మార్ట్ శంకర్, రుద్రమదేవి, రాజన్న వంటి సినిమాలతో సహా ఇటీవల విడుదలైన బలగం, దసరా లాంటి సినిమాలు అదే కోవకు చెందుతాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కమర్షియల్గానూ మంచి విజయం సాధిస్తున్నాయి. ఒకప్పుడు తెలంగాణ యాసంటే కాస్త చిన్నచూపు ఉన్నప్పటి మాట వాస్తవమైనప్పటికి ఇప్పుడు మాత్రం అందరి ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు తెలంగాణ భాష, యాస, సంస్కృతికి ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. ఇక గత కొంత కాలంగా టాలీవుడ్లో తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తూ ఘన విజయం కూడా సాధిస్తున్నాయి. అక్కడ యాస, భాషలకు ఎంతో ప్రత్యేకత ఉంది. అక్కడ జీవవిధానం కూడా తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా ఉంటుంది. హిందీ, ఉర్దూ, అరబిక్ కలగలసిన తెలుగు ఇక్కడి ప్రత్యేకత. ప్రతి విషయాన్ని సొంతం చేసుకుని పలకరించే తెలంగాణ యాస, వేషధారణ, అందరినీ బంధువులను చేసుకుని అన్న, అక్క అంటూ ఆత్మీయ పలకరింపు తెలంగాణకే సొంతం. అయితే ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ ఒకటే ఉండేది. ఇప్పుడు కూడా ఒకటే అయినా రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. అయితే చాలా మంది అగ్ర దర్శకులు మాత్రం ఇదివరకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా కనిపించే వాళ్లు. అక్కడక్కడా మాత్రమే తెలంగాణ ప్రాంతం నుంచి దర్శకులు సత్తా చూపించే వాళ్లు. ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో రాజమౌళి, త్రివిక్రమ, కొరటాల, బోయపాటి లాంటి కొందరు దర్శకులు మినహా మిగిలిన వాళ్లంతా కూడా తెలంగాణ నుంచే ఉన్నారు. వీరిలో సురేందర్ రెడ్డి, సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, సంపత్ నంది, వేణు ఉడుగుల, టిల్లు వేణు లు ఉన్నారు. వీరికి ముందు బి.నర్సింగ్ రావు, అల్లాణి శ్రీధర్, ఎన్.శంకర్,మధుర శ్రీధర్ రెడ్డి, దశరథ్ లు తెలంగాణ నుంచి దర్శకులుగా కొనసాగారు. చాలామంది తెలంగాణకు సంబంధించిన నటులు కూడా వరుస సినిమాలలో తమ సత్తా చాటుతూన్నారు. తెలంగాణ యాస, భాష, సంస్కృతితో వచ్చి సూపర్ హిట్ చిత్రాలుగా నిలిచిన వాటిలో న్యాచురల్ స్టార్ నాని, మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో నటించిన దసరా మూవీ సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా కథ పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని (తెలంగాణ)లోని సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలోని ఒక గ్రామం నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవ్వగా.. అతనితోపాటు, నాని కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా దసరా నిలిచిందని చెప్పవచ్చు. ఇక జబర్ధస్త్ షోతో కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్న వేణు ఎల్దండి దర్శకుడిగా మారి తీసిన చిత్రం బలగం. తెలంగాణ లోని విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిన బలగం చిత్రం కుటుంబ విలువలను కలిగి ఉన్న సినిమాగా అందరినీ బాగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. శేఖర్ కమ్ముల ఫిదా మూవీ లో కూడా తెలంగాణ సంప్రదాయాల గురించి చూపించారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ – బస్టర్ గా నిలిచి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. “వచ్చిండే.. మెల్లా మెల్లగా వచ్చిండే..” అంటూ సింగర్ మధుప్రియ పాడిన అశోక్ తేజ గీతానికి స్పింగులు మింగినట్లు సాయిపల్లవి తన నృత్యంతో నర్తించి అందరినీ ఫిదా చేసిన ఈ పాట సౌత్ సినీ ఇండస్ట్రీ లో టాప్ రికార్డును సొంతం చేసుకుంది. కాకతీయ సామ్రాజ్యం చరిత్ర ఆధారంగా రూపొందిన సినిమా ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో రాణి రుద్రమగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ ‘ది వారియర్ క్వీన్’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైంది. ఈ సినిమాలో కాకతీయ సామ్రాజ్యం, తెలంగాణలోని నేటి వరంగల్ ఒకప్పటి ఓరుగల్లు రాజధానిగా రుద్రమదేవి పాలన గురించి వివరించారు. ఇవే కాకుండా చాలా సినిమాలు తెలంగాణ నేపథ్యంలో రూపొంది ప్రేక్షకులను మెప్పించాయి. డీజే టిల్లు సినిమాలో హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా తెలంగాణ యాసతో డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించారు. ఈ చిత్రం తెలంగాణ నేపథ్యంలోనే కొనసాగుతుంది. నవీన్ పోలిశెట్టి హీరో గా వచ్చిన జాతి రత్నాలు, రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం లోని కొమురం భీం పాత్రలు కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన వారివే. నాగార్జున గతంలో రాజన్న సినిమాను కూడా తెలంగాణ నేపథ్యంలో తీసి ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా నటులు కూడా తెలంగాణ యాస, భాషలను ఎంతో ఇష్టంతో నేర్చుకుని మాట్లాడటంతో అభిమానులను ఆ చిత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపద్యంలో చిన్నా ,పెద్ద అన్న తేడా లేకుండా తెలంగాణ చిత్రాలు ధియేటర్లలోను , ఓటీటీ ల్లోనూ సందడి చేసేందుకు క్యూ కట్టాయి.. ప్రతి శుక్రవారం ఒక తెలంగాణ మాండలీక చిత్రం విడుదవుతుందంటేనే అర్ధం చేసుకోవచ్చు జోష్ ఎట్లుందో..