వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అటు కేంద్ర నాయకత్వంగాని. ఇటు రాష్ట్ర నాయకత్వం గానీ పదేపదే చెబుతున్నప్పటికీ జనసేన నాయకత్వం మాత్రం ఈ విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం బలంగానే జరుగుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలోనూ కేంద్ర బిజెపి పెద్దలు కలిసే పోటీ చేస్తామని, జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా కాకుండా ఇన్ డైరెక్ట్ గా ఈ అంశంపై మాట్లాడారు. తమ అజెండా వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయడమేనని పవన్ కళ్యాణ్ మీడియాతో స్పష్టం చేశారు. పలు సమావేశాలలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటంలో ఒక శాతం కూడా బిజెపి నాయకత్వం పని చేయకపోవడంపై జనసేన నేతల్లో సందేహాలు లేవనెత్తాయి. వైసిపి- బిజెపిల మధ్య జరిగిన అంతర్గత ఒప్పందంలో భాగంగానే వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై బిజెపి పెద్దలు మిన్నుకుంటున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఒకటీ అర ప్రెస్ మీట్ లు పెట్టి వైసిపిని అత్యంత సున్నితం గా తిట్టేసి తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. బిజెపి వైఖరిపై ఇప్పటికి కూడా జనసేనకు పలు సందేహాలు ఉన్న జనసేన బీజేపీ తో కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఒకచోట కలిసి చర్చించుకోవడం కానీ జరగలేదు. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ బిజెపి ఊసు ఎక్కడ ఎత్తడం లేదు.