వచ్చే ఎన్నికలలో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు అటు కేంద్ర నాయకత్వంగాని. ఇటు రాష్ట్ర నాయకత్వం గానీ పదేపదే చెబుతున్నప్పటికీ జనసేన నాయకత్వం మాత్రం ఈ విషయమై పెద్దగా పట్టించుకోవడం లేదనే ప్రచారం బలంగానే జరుగుతుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలోనూ కేంద్ర బిజెపి పెద్దలు కలిసే పోటీ చేస్తామని, జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా కాకుండా ఇన్ డైరెక్ట్ గా ఈ అంశంపై మాట్లాడారు. తమ అజెండా వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయడమేనని పవన్ కళ్యాణ్ మీడియాతో స్పష్టం చేశారు. పలు సమావేశాలలో కూడా అదే విషయాన్ని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం పై చేస్తున్న పోరాటంలో ఒక శాతం కూడా బిజెపి నాయకత్వం పని చేయకపోవడంపై జనసేన నేతల్లో సందేహాలు లేవనెత్తాయి. వైసిపి- బిజెపిల మధ్య జరిగిన అంతర్గత ఒప్పందంలో భాగంగానే వైసీపీ ప్రజా వ్యతిరేక పాలనపై బిజెపి పెద్దలు మిన్నుకుంటున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు. అప్పుడప్పుడు సోము వీర్రాజు, జివిఎల్ నరసింహారావు లాంటి వాళ్ళు ఒకటీ అర ప్రెస్ మీట్ లు పెట్టి వైసిపిని అత్యంత సున్నితం గా తిట్టేసి తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. బిజెపి వైఖరిపై ఇప్పటికి కూడా జనసేనకు పలు సందేహాలు ఉన్న జనసేన బీజేపీ తో కలిసి ఒకే కార్యక్రమంలో పాల్గొనడం కానీ ఒకచోట కలిసి చర్చించుకోవడం కానీ జరగలేదు. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిన పవన్ కళ్యాణ్ బిజెపి ఊసు ఎక్కడ ఎత్తడం లేదు. దీంతో బిజెపి నాయకత్వంలో ఓ వైపు అసహనం వ్యక్తం చేస్తూనే ఏదైతే జరగకూడదని అనుకుంటున్నారో, అదే జరుగుతుందేమో అన్న అనుమానం కనిపిస్తుంది. టిడిపి తో జత కట్టేందుకు జనసేన ఆసక్తిని కనబరచడం ఆ నేతలకు మింగుడు పడడం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల హైదరాబాదులో టిడిపి- జనసేన మధ్య జరిగిన రహస్య సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. టిడిపి జనసేన కలిసి వెళితే అధికారాన్ని సమంగా పంచుకోవడం అంటే కొన్నాళ్ల చంద్రబాబు నాయుడు మరికొన్నాళ్లు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా కొనసాగాలి అనే ప్రతిపాదనను జనసేన టిడిపి ముందుంచినట్లు సమాచారం. మిగతా అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందించిన టిడిపి ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం ఆలోచనలో పడిందట. మరోసారి ఈ విషయంపై ఇరుపార్టీలు మళ్లీ ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమావేశ విషయాలు బహిర్గతం కావడంతో బిజెపి నేతలు గుర్రుగా ఉన్నారు. బీజేపీతో కలిసి వెళ్దామని ప్రకటన చేసిన తర్వాత కూడా టిడిపి తో రహస్య మంతనాలు ఏంటని బిజెపి నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఒకపక్క బిజెపితో సై అంటూనే మరోపక్క టిడిపితో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండడం రాష్ట్ర బిజెపి నాయకత్వం ఢిల్లీ పెద్దలకు వెల్లడించినట్లు తెలుస్తుంది. జనసేన- బీజేపీ పొత్తు ప్రకటనలు మాటల వరకే పరిమితం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి కొద్ది రోజుల్లో ఇరు పార్టీల మధ్య చోటుచేసుకోనున్న పరిణామాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
previous post
next post