ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో రాజకీయాలు చొరబడి గందరగోళం చేస్తున్నాయి.. తెలంగాణలోని రెండు ప్రధాన పార్టీల మధ్య ఈ వ్యవహారం అగ్గి రాజేసింది. ఒక పార్టీ విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రయత్నిస్తుంటే, మరో పార్టీ ఆ కార్యక్రమాన్ని ఆపాలని ప్రయత్నాలు చేస్తుంది. అయితే చివరగా కోర్టు ద్వారా విగ్రహా ఏర్పాటును అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ సినీనటి కళ్యాణి ఈ వ్యవహారంలో రాజకీయ పార్టీలకు ఒక పావుగా మారింది. ఇప్పటికే సినిమా అవకాశాలు లేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్న కళ్యాణి ఎన్టీఆర్ విగ్రహా ఏర్పాటును వ్యతిరేకిస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎవరు ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పిన ఒక రాజకీయ పార్టీ అండ ఉందనే ధైర్యంతో తెలుగు వాళ్ళందరూ ఆరాధించే మహానటుడు ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణను అడ్డుకోవడం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. అయితే ఈ గొడవ అంతటికీ కారణం బీఆర్ఎస్ పార్టీ విగ్రహ ఏర్పాటు విషయంలో పూర్తిగా సహకరించడమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో బి ఆర్ ఎస్ పార్టీకి ప్రధాన పోటీ దారు బిజెపి పార్టీ. ఈ వ్యవహారంలో బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఉండటం బిజెపికి రుచించలేదు. ఎన్టీఆర్ అభిమానులు లేదా ఆయన కుటుంబ సభ్యులు లేదా టిడిపి నేతలు ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టిస్తే ఎటువంటి సమస్య ఉండేది కాదు. విగ్రహ ఏర్పాట్లను కూడా బిజెపి అడ్డుకునేది కాదు. కానీ మంత్రి పువ్వాడ అజయ్ నేరుగా ఈ వ్యవహారాలను దగ్గర ఉండి చూసుకోవడమే బిజెపి నేతలకు కంటగింపుగా మారింది. అందుకే సినీనటి కళ్యాణిని ఎరగా వేసి ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు బిజెపి ప్రయత్నించిందనే ఆరోపణలు వస్తున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా పేరు తెచ్చుకున్న నందమూరి తారకరామారావును అందరూ ఆయనను ఎన్టీఆర్ అని పిలుస్తారు. సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు. రాముడు, కృష్ణుడు, రావణాసుడు ఎలాంటి పాత్రలైనా ఆయన కోసమే సృష్టించబడ్డాయా అన్న విదంగా ఉండేవి. అప్పట్లో ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు పాత్రల్లో ఉన్న ఫోటోలు ఇంట్లో పెట్టుకొని పూజించేవారు. అంతటి మహనీయుడి శతజయంతి ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఘనంగా నిర్వహించుకుంటున్న క్రమంలో ఖమ్మంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న 54 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దీనిపై కొన్నిరోజులుగా అభ్యంతరాలు వెలువడటం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సినీ నటి కరాటే కళ్యాణి విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ విగ్రహం అంటూ శ్రీకృషుడి రూపంలో ఉన్న విగ్రహం పెడుతున్నారంటూ ఎన్టీఆర్ గొప్ప నటుడు అనడంలో సందేహం లేదు. కానీ భగవంతుడి కంటే ఎక్కువ కాదని ఆమె వెల్లడించింది. విగ్రహ రూపం మార్చాలని, లేకుంటే ధ్వంసం చేయడానికి కూడా సిద్ధమని సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. యాదవ సంఘాలతో పాటు పలు హిందూ సంఘాలు ఈ విషయ మై ఆందోళన చేపట్టాయి. సినీ నటి కరాటే కళ్యాణి వ్యాఖ్యలు పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించి ఆందోళన విరమించాలని కోరారు. మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కరాటే కళ్యాణి తీరుపై సీరియస్ అయ్యాడు. ఆమె చేసిన వ్యాఖ్యలు పై వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ చేశాడు. అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా ఈ విషయం పై రియాక్ట్ అయ్యారు. ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ఆందోళన విరమించాలని తలసాని కల్యాణికి సూచించారు. కానీ కళ్యాణి మంత్రి సూచలను తిరస్కరించింది. శ్రీకృష్ణ జేఏసీ, భారతీయ యాదవ సంఘం, ఆదిభట్ల కళాపీఠం తదితరులు హైకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషనర్ల వాదనలు విన్న ధర్మాసనం విగ్రహ ఏర్పాటు పై స్టే విధించింది. తాజాగా హై కోర్టు తీరుపై కరాటే కళ్యాణి ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేసింది. ‘ఇప్పడే తీర్పు ఇచ్చారు 28న విగ్రహ ఏర్పాటు చేయకుండా కోర్టు జడ్జీగారు అనుకూల తీర్పు ఇచ్చారు జై శ్రీ కృష్ణ, నువు ఉన్నావు స్వామి’ అంటూ పేర్కొంది. మొత్తానికి మే 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు బ్రేక్ పడినట్టు అయ్యింది. కరాటే కళ్యాణి అభ్యంతరాలపై ఖమ్మం బీఆర్ఎస్ లో ఉన్న యాదవ ప్రతినిధులు ఘాటుగానే స్పందించారు. హైదరాబాద్ నుంచి పెయిడ్ ఆర్టిస్టులను తీసుకు వచ్చి ఖమ్మం లో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఆమె వ్యవహరిస్తుందని బి ఆర్ ఎస్ యాదవ ప్రతినిది పగడాల నాగరాజు తెలిపారు. ఖమ్మంలో ఉన్న యాదవులు ఎవరిని ఆమె సంప్రదించలేదని ఆమె వెనుక ఎవరో ఉండి రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సూట్ కేసుల్లో డబ్బులు తీసుకొని, అనవసర రాద్దాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో పక్క శ్రీ కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని యాదవ సంఘం సీనియర్ నేత కూరాకుల నాగ భూషణం తెలిపారు. ఏపిలో విగ్రహాలు పెట్టినపుడు కరాటే కళ్యాణి ఎక్కడకు వెళ్లారని ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటు పై రాజకీయం చేయడం తగదన్నారు. అభిమానం తోనే విగ్రహం పెడుతున్నాం. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని అంటున్నారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కరాటే కళ్యాణి పై మాత్రం ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి నేతలు గుర్రుగా గా ఉన్నారు. రాజకీయాలు చేయడం సరైనది కాదంటూ మండిపడుతున్నారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలో చాలావరకు ఎన్టీఆర్ రూపంలో శ్రీకృష్ణుడు విగ్రహాలు ఉన్నాయని వాటి విషయంలో లేని వివాదం ఇప్పుడెందుకు తీసుకువచ్చారని ప్రశ్నిస్తున్నారు.