కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రతిఒక్కరు తహతహ లాడుతూ వుంటారు. రకరకాల ప్రవేశ దర్శన టిక్కెట్ల ద్వారా స్వామి వారిని దర్శించుకుంటారు. అలాంటి ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్ ఇతర సేవా టిక్కెట్లన్నీ ఇకపై ప్రతినెలా 18, 19, 20 తేదీలలోనే విడుదల చేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. దీనికి సంబంధించి ఆగస్టు నెలకోసం ఆర్జిత సేవా టికెట్లు, అంగప్రదక్షిణం టోకెన్లను ఎప్పుడు జారీ గురువారం నుంచి మొదలు కానుంది. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభమౌతుంది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. ఇక ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్లు ఈ నెల 23వ తేదీన విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్, శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్లను పొందడానికి భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. నకిలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్టు నెలకు సంబంధించిన 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 25వ తేదీన జారీ చేసే అవకాశం ఉంది. ఆగస్టులో తిరుమలలో వసతి గదులను పొందడానికి అవసరమైన ఆన్‌లైన్ కోటాను ఈ నెల 26వ తేదీన, తిరుపతిలోని విష్ణువాసం, శ్రీనివాసం వంటి చోట్ల వసతి గదులను పొందాలనుకునే వారికి ఈ నెల 27వ తేదీన ఆన్‌లైన్ కోటాను జారీ చేస్తారని ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని భక్తులు టీటీడీ సేవలను వినియోగించుకోవాలని కోరింది.