సరిగ్గా ముప్పై మూడేళ్ళ క్రితం రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ ఉత్తరాంధ్రలోనే!

మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ ‘చివరి ప్రయాణం’ మే 21, 1991న ఉత్తరాంధ్ర నేలలోనే సాగింది. సరిగ్గా ముప్పై మూడు సంవత్సరాల క్రితం, అప్పుడు జరుగుతున్న లోక్ సభ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. ఒడిస్సా రాష్ట్ర పర్యటన అనంతరం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. తొలుత పాలకొండ(రాజీవ్ అంతర్గత భద్రత సిబ్బందిలో పాలకొండవాసి ఒకరు ఉండేవారు) జూనియర్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత, శ్రీకాకుళం పట్టణంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ఎన్నికల భారీ బహిరంగ సభలో, పార్టీ అభ్యర్థి డాక్టర్ కణితి విశ్వనాథం కు మద్దతుగా పాల్గొన్నారు. తర్వాత విజయనగరం చేరుకున్నారు. రాజీవ్ రాక కోసం విజయనగరం ప్రజలు ఆ రోజు ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. రాజీవ్ రాకతో వారంతా ఆనందంతో పొంగిపోయారు. రాజీవ్ కు ఘనస్వాగతం లభించింది. బొబ్బిలి స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటి చేసిన ఆనంద గజపతి రాజును గెలిపించేందుకు విజయనగరం ఫుట్ బాల్ గ్రౌండ్‌లో ఎన్నికల ప్రచారసభ లో ఆయన పాల్గొన్నారు. అనంతరం విశాఖ చేరుకొని సాగర తీరంలో పార్టీ అభ్యర్థి ఉమా గజపతిరాజు కు మద్దతుగా ఎన్నికల ప్రచారం సభలో పాల్గొన్నారు. స్థానిక సర్క్యూట్ హౌస్ లో కాసేపు సేద తీరారు. అక్కడ తనను కలిసిన విశాఖ కాంగ్రెస్ పార్టీనాయకుల్ని, కార్యకర్తలని కలుసుకొని సరదాగా ముచ్చటించారు. తమిళనాడులోని ఎన్నికల ప్రచారం కోసం సాయంత్రం ఏడున్నరకు విశాఖ నుంచి బయలుదేరి వైజాగ్ విమానాశ్రయానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ విమానం బయలుదేరే సమయంలో కమ్యూనికేషన్ సిస్టం పనిచెయ్యడం లేదని పైలెట్లలో ఒకరైన కెప్టెన్ చందోక్ గమనించారు. ఈ విషయం రాజీవ్ గాంధీతో చెప్పగానే స్వయంగా పైలెట్ అయిన రాజీవ్ గాంధీ ఆయనతో కలిసి ఆ సమస్యను సరిచేసే ప్రయత్నం చేసినా ఫలించలేదు. దానితో ఆ రాత్రికి వైజాగ్ లోనే ఉండిపోవడానికి సిద్ధమైన రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ కి వెళ్లిపోయారు. ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లిపోగానే విమానం ఇంజినీర్ విమానాన్ని మరోసారి పరీక్షించి అందులోని లోపాన్ని సరిచేశారు. దీంతో విమానం రెడీ అయిపోయింది అనే వార్త విని వెంటనే రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ కి తిరిగి వచ్చారు. అయితే వేరే కారులో వచ్చిన ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ సాగర్ మాత్రం విమానాన్ని అందుకోలేకపోయారు. రాజీవ్ గాంధీతో పాటు, ఆయన మీడియా సలహదారు సుమన్ దూబేతో పాటు బల్గెరియా నుంచి వచ్చిన ఇద్దరు జర్నలిస్టులు, పైలెట్స్ ఆ విమానంలో ఉన్నారు. సాయంత్రం 6:30 కి విశాఖలో విమానం బయలుదేరింది. తన ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకొని తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్ కు రాత్రి 10 గంటలకు రాజీవ్ చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన మానవ బాంబు దాడిలో దారుణ హత్యకు గురయ్యారనే వార్త దేశ ప్రజలతోపాటు ఉత్తరాంధ్ర ప్రజానీకాన్ని శోక దుఃఖములోకి నెట్టేసింది. రాజీవ్ చివర రాజకీయ మజిలీ ఉత్తరాంధ్రయే కావడం చరిత్రలో నేడొక జ్ఞాపకంగా మిగిలిపోయింది. రాజీవ్ గాంధీ వైజాగ్ లో చివరిసారిగా ప్రసంగించిన ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో ఆయన విగ్రహంతో పాటు రాజీవ్ స్మృతి భవనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ విషాదాన్ని, నాటి పర్యటనను అది గుర్తుచేస్తూనే ఉంటుంది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More