హర్యానాలోని షహబాద్‌ లో తొలిసారిగా లక్ష చండీ మహాయజ్ఞం

యావత్‌ భారతావనిలోనే తొలిసారిగా బృహత్తరమైన వైదిక కార్యక్రమానికి విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీకారం చుడుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్ష చండీ మహాయజ్ఞాన్ని తలపెడుతోంది. హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర సమీపంలోని షహబాద్‌ వేదికగా 16 రోజులపాటు ఈ యజ్ఞం జరుగుతుంది. ఈనెల 10వ తేదీ నుండి మొదలై 26వ తేదీ వరకు ఈ మహా క్రతువు సాగుతుంది. గుంతి మాత సంకల్పించిన ఈ భారీ యజ్ఞాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వామివార్లు పర్యవేక్షిస్తారు. దీనికి అష్టోత్తర శత కుండాత్మక అప్రతిహత లక్ష చండీ మహాయాగంగా నామకరణం చేసారు. ఇంత పెద్ద ఎత్తున చండీ యజ్ఞాన్ని గతంలో తలపెట్టినట్లు దాఖలాలు లేవు. పూర్వకాలంలో చత్రపతి శివాజీ మహరాజ్‌, పూనా శ్రీమంతులు నిర్వహించినట్లు చరిత్రలో చెప్పుకోవడమే తప్ప ఆధారాలు కూడా లేవు. ఇప్పటివరకు సహస్ర, అయుత చండీ యాగాలు మాత్రమే జరిగాయి. తొలిసారిగా భరత భూమి సాక్షిగా లక్ష చండీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ద్వాపర యుగంలో ధర్మరాజు చేపట్టిన రాజసూయ యాగం చేయడం వల్ల దక్కిన ఫలితం ఈ యజ్ఞాన్ని సందర్శించిన వారికి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. కలౌ చండీ వినాయకౌ అని ఆగమ శాస్త్రం చెబుతోంది. కలియుగంలో ప్రార్ధించిన వెంటనే ఫలితాన్నిచ్చేది చండీ దేవత, వినాయకుడు మాత్రమే అంటారు. అలాంటి చండీమాతను ప్రార్ధిస్తూ దేశ సంక్షేమం కోసం చేపడుతున్న యజ్ఞాన్ని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 17 రోజులపాటు యాగ ప్రాంగణంలోనే ఉండి పర్యవేక్షిస్తారు. శ్రీ లక్ష చండీ మహాయజ్ఞంలో ఏకకాలంలో 1760మంది రుత్విక్కులు పాల్గొంటున్నారు. వీరికి సహాయకులుగా మరో 400 మంది బ్రాహ్మణులు ఉంటారు. మొత్తం 2160 మంది బ్రాహ్మణోత్తములు 22 రాష్ట్రాల నుండి హాజరవుతున్నారు. వీరిలో సింహభాగం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి వెళుతున్నారు. వీరంతా యజ్ఞం కోసం ఏర్పాటు చేసిన 110 హోమ గుండాల్లో వీరంతా కలిసి రోజుకు 7040 చండీ పారాయణ హోమాలను నిర్వహిస్తారు. 16 రోజుల పాటు ఒక లక్షా 12వేల 640 చండీ పారాయణ హోమాలు చేస్తారు. వైదిక ప్రపంచంలో కనీవినీ ఎరుగని ఈ యజ్ఞం కోసం 55 ఎకరాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారు. నిర్వహణ బాధ్యతను గుంతి మాత ఆశ్రమం చేపట్టగా పర్యవేక్షణ బాధ్యత విశాఖ శ్రీ శారదాపీఠం భుజానకెత్తుకుంది. రోజుకి లక్ష మంది సందర్శించేలా ఏర్పాట్లు పూర్తి చేసారు. ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణ ఉట్టిపడేలా, భారీ ఎత్తున తాత్కాలిక నిర్మాణాలు చేసారు. ఐదు ఎకరాల ప్రాంగణంలో యాగశాలలు నిర్మించగా, గుడారాలు, మహా మండపాలు, వసతి, భోజన సదుపాయాలు, శౌచాలయాలు, పార్కింగ్‌ తదితరాల కోసం మిగిలిన ప్రాంతాన్ని కేటాయించారు. ప్రత్యేక డిజైన్‌లతో ముఖ ద్వారాలను రూపొందించారు. 310 మంది కార్మికులు యాగశాలలు, మహా మండపాల నిర్మాణం కోసం శ్రమించారు. వేద విహితంగా యజ్ఞ నిర్వహణ కోసం విశేష ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. 1500 టన్నుల స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నారు. 8వేల కిలోల నువ్వులు, ధాన్యాన్నియజ్ఞంలో వినియోగిస్తారు. 16 రోజుల్లో 41 కిలోల చందనం, పది కిలోల కుంకుమ పువ్వు, 550 కిలోల కర్పూరం, 5వేల కొబ్బరి కాయలు, 16వేల మారేడు కాయలు, 25లక్షల తమలపాకులు, 21వేల అరటిపళ్ళు, వంద కిలో జాజి కాయలు, 110 కిలోల కర్జూరం, వంద కిలోల చొప్పున యాలకులు, లవంగాలు వినియోగిస్తారు. టన్నుల కొద్దీ సమిధలను కొనుగోలు చేసారు. దీక్షా వస్త్రాలుగా ధరించేందుకు బ్రాహ్మణుల కోసం 6600 పంచెలను అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే 2200 చొప్పున పంచపాత్రలు, దర్భాసనాలు, లోటాలు, జపమాలలు, చండీ పారాయణ గ్రంధాలు, ఉప వస్త్రాలను బ్రాహ్మణులకు అందిస్తారు. యజ్ఞం పూర్తయ్యే లోపు 900 కిలోల చొప్పున పసుపు – కుంకుమ అవసరమవుతాయని అంచనా వేసారు. దీంతోపాటు 2లక్షల అగరబత్తి ప్యాకెట్లను, 250 కిలోల వక్కలను కూడా యాగశాలల్లో వినియోగించనున్నారు. ఈనెల పదవ తేదీ ఉదయం మండప ప్రవేశంతో యజ్ఞం మొదలవుతుంది. మధ్యాహ్నం నుంచి హవనం ప్రారంభమవుతుంది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, తిరిగి మూడున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హవనం కొనసాగుతుంది. సాయంత్రం ఆరు గంటలకు మహా హారతి ఉంటుంది. అలాగే నిత్యం సాంస్కృతిక ఆరాధన కూడా నిర్వహిస్తారు. 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు పూర్ణాహుతితో ఈ మహా క్రతువు పూర్తవుతుంది.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

మంగ్లీకి బిస్మిల్లా ఖాన్ గౌరవపురస్కారం

మొదలైన సినిమాటిక్ ఎక్స్పో

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More