ప్రజాయుద్ధనౌక పొలిటికల్ ఎంట్రీ..?

తెలుగు రాష్టాలతో పాటు దేశంలోని చాల రాష్ట్రాలకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు గద్దర్. భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం అంటు అడవి బాట పట్టి తన ఆట పాటలతో విప్లవ పంథాను కొనసాగించిన ప్రజా యుద్దనౌక. అణగారిన వర్గాలను తన పాటతో చైతన్యం తీసుకువచ్చి పోరుబాట పట్టించడమే కాదు రాజ్య హింసకు వ్యతిరేకంగా పోరాటం చేసి పాలక ప్రభుత్వాలను సైతం తన పాటతో వణింకించిన విప్లవ కారుడిగా పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి దిశానిర్దేశం చేయడంలోను పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోవడం లోనూ గద్దర్ ప్రముఖ పాత్ర పోషించే వాడని నిఘా వర్గలు సైతం అనేక సార్లు వెల్లడించడంతో గద్దర్ కరుడుగట్టిన కమ్యూనిస్టుగా ముద్ర పడ్డారు. గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావ్. బ్రిటిష్ పాలన ను తీవ్రంగా వ్యతిరేకించిన గదర్ పార్టీ కి గుర్తుగా గద్దర్ అన్న పేరు తో ఉద్యమ గీతాలను రచించిన ఆయన అదే పేరుతో స్థిరపడిపోయారు. అలాంటి గద్దర్ మారుతున్న పరిణామాలతో మావోయిస్టు పార్టీకి దూరం అయి ప్రజా క్షేత్రంలో ప్రత్యేక పోరాటాలను కొనసాగిస్తు తన ఆట పాటలతో పాలక ప్రభుత్వాలను నిలదీస్తునే వస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చాల వేదికల పై గద్దర్ తన గొంతుకతో లక్షల మందిని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లించిన ఘనత ఉంది. గతంలో రాజకీయంగా గద్దర్ కు చాల అవకాశాలు వచ్చినప్పటికి కారణాంతరాలవల్ల ఎన్నికలకు దూరంగా ఉంటు వచ్చారు. తాను నమ్మిన సిద్దాంతానికి వ్యతిరేకమనే భావన వల్లనే గద్దర్ ఇన్నాళ్లూ ఎన్నికల్లో పోటి చేయడానికి ఆసక్తి చూపనట్లు తెలుస్తోంది. కానీ ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చిన గద్దర్, తొలిసారి తన ఓటు హక్కును 2018 తెలంగాణ ఎన్నికల్లో వినియోగించుకున్నారు. 2018 డిసెంబర్ 7న తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. దానికంటే కొన్ని రోజుల కిందటే ఆయన ఎన్నికల జాబితాలో తన పేరు నమోదు చేయించుకున్నారు. అప్పుడు ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎన్నికల నేపథ్యంలో గద్దర్ తన భార్యతో కలిసి భారత రాజ్యాంగ పుస్తకం,అంబేద్కర్, ఫూలే ఫొటోలను పట్టుకొని హైదరాబాద్‌ అల్వాల్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకొని కొత్త చర్చకు తెరలేపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు న్యాయం జరగదని, విప్లవం గట్టిగా నమ్ముతుంది. గద్దర్ కూడా తన జీవితంలో సింహభాగం విప్లవం కోసమే పనిచేశారు. విప్ల‌వం కోసమే త‌న శ‌రీరంలో తూటాలను కూడా భ‌రించాడు. అలాంటి అరుదైన ప్ర‌జా గాయకుడు. ఇటీవల రామానుజుడి గురించి పాడటానికి తన గొంతును సవరించుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వెయ్యేళ్ల కింద‌టే కుల‌, మ‌తాలు,వ‌ర్గ విభేదాలు ఉండ‌రాద‌ని, స‌మ‌స్త మాన‌వులంతా ఒక్క‌టేన‌ని స‌మ‌తా నినాదాన్ని వినిపించిన శ్రీ రామానుజుడి గురించి గ‌ద్ద‌ర్ పాట పాడారు. అప్పట్లో అది చర్చనియాంశమైంది. మరెన్నో నిర్ణయాలతో ఆశ్చర్యపరిచన ఆయన ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో హైలైట్ అవుతున్నారు. కొంతకాలం క్రితమే ఆయన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని కలవడం సర్వత్రా ఆసక్తి నెలకొల్పింది. అప్పుడు ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారనే చర్చ జోరందుకుంది. కట్ చేస్తే ఆ తర్వాత ఆయన గాంధీ భవన్లో కనిపించారు. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే ఈ రెండు భేటీల్లోనూ ఆయన కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కోరారు. సాధారణంగా గద్దర్ లాంటి నాయకుడు వెళ్లి బండి సంజయ్, రేవంత్ రెడ్డిని కలవగానే రాజకీయ చేరికలకు సంబంధించిన మాటలు, అనుమానాలే పుడతాయి. గద్దర్ బీజేపీలో చేరుతారేమో అనే ప్రచారం పుట్టినా ఆశ్చర్యం లేదు. కానీ వామపక్ష భావజాలంతో చాలా గాఢంగా పెనవేసుకుపోయిన జీవిత నేపథ్యం ఉన్న గద్దర్ కాషాయ కండువా కడతారా? కమలదళంతో కలుస్తారా? అంటే నమ్మడం కష్టమే. కానీ రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. అలాగే గతంలో కాంగ్రెస్ పెద్దలను గద్దర్ కలిశారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మూడు రంగుల జెండా వైపు చూస్తున్నారా అనే ప్రచారం కూడా జరిగింది. మరోవైపు కేసీఆర్ ను తెలంగాణ ప్రభుత్వ పధకాలను కూడా ప్రశంసించి గులాబీ గూటివైపే అడుగులు అన్నట్టు వ్యవరించారు. పార్టీ ఎదన్నది పక్కన పెడితే వచ్చే ఎన్నికలలో మాత్రం కచ్చితంగా ఆయన రాజకీయ అరంగేట్రం చేయడం ఖాయం గానే తెలుస్తోంది. తెలంగాణలో జనసేన పార్టీ నుంచి కరీంనగర్ ఉమ్మడి జిల్లా లేదంటే ఖమ్మం జిల్లా నుండి పోటీ చేస్తారంటు ప్రచారం మొదలైయ్యింది. గతంలో కూడా గద్దర్ పవన్ కళ్యాణ్ కోసం చాలా గొప్పగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ వంటి చాలా అవసరం అని చెప్పారు. భవిష్యత్తులో అతనితో కలిసి పని చేసే అవకాశాలు కూడా లేకపోలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా గద్దర్ పట్ల చాలా గౌరవాన్ని చూపిస్తూ గద్దర్ వంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరమని కొనియాడారు. అటువంటి వ్యక్తులు అరుదుగా ఉంటారని, వారిది స్ఫూర్తిదాయకమైన జీవితమని ఆయన సేవలు ప్రజలకు ఎంతో అవసరం అని పేర్కొనడం జరిగింది. అయితే మరోపక్క అటు కాంగ్రెస్ పార్టీ కూడా గద్దర్ ను పార్టీలో తీసుకొనే విషయంపై సమాలోచన చేస్తుంది. వచ్చే ఎన్నికలలో గద్దర్ ఖచ్చితంగా ఎన్నికల బరిలో ఉండటం తథ్యమని రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్నారు. గద్దర్ పొలిటికల్ ఎంట్రీ పై రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గం నుండి పోటీ చేస్తారనే అంశంపై మాత్రం క్లారీటి లేకుండాపోయింది. అభిమానుల సందేహాలకు తెర దించుతూ మరికొన్ని రోజుల్లోనే గద్దర్ నుంచి స్పష్టమైన ప్రకటన ఆశించవచ్చంటున్నారు

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

అయ్యప్ప ఆలయ దర్శనం పై కేరళ సర్కార్ నిర్ణయం ఆమోద యోగ్యమేనా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More