దేశంలోనే ప్రముఖ రాజకీయ నాయకుని కుమార్తె మాత్రమే కాదు ముఖ్యమంత్రిగా సేవలందించిన నేత తనయ ఆమె.. రాజకీయంగా గుర్తింపు ఉన్న ఆ కుటుంబానికి కూడా వేధింపులు తప్పలేదు, చీత్కారాలు, అవమానాలకు లెక్కలేదు. ప్రత్యర్ధులు కొందరు, తాము అంటే పడని వ్యక్తులు మరికొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ట్రోలింగ్ పై విసిగిపోయిన ఆమె అందరికీ ఓ సామాజిక కార్యకర్తగా తగిన రీతిలో సమాధానం చెబుతూనే ఉంది.ఈ క్రమంలోనే తన మనసులో మాటను ఆమె బయట పెట్టింది. త్వరలో తాను లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకొనున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతుంది. అసలు ఎవరు ఆమె ? ఏంటా కధా అనేది ఇప్పుడు చూద్దాం.. ఆమె పేరు సుచేతన, పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె. లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని సుచేతన్ గా మారాలని (పురుషుడిగా) నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం న్యాయపరమైన సలహా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కావాల్సిన సర్టిఫికెట్ ల కోసం వైద్యులను సంప్రదించినట్టు సమాచారం. సుచేతన ఇటీవలే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్, క్వీర్ (ఎల్జీబీటీక్యూ) వర్క్ షాప్ లకు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను పురుషుడిగా మారేందుకు శస్త్రచికిత్స మార్గాన్ని ఎంచుకున్నట్టు ప్రకటించారు. తాను ఎల్జీబీటీక్యూ ఉద్యమంలో భాగంగా ఇది చేస్తున్నట్లు వెల్లడించారు. ట్రాన్స్ మ్యాన్ గా సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న వేధింపులకు చెక్ పెట్టాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు.తనకు ఇప్పుడు 41 ఏళ్లు అని, తన జీవితానికి సంబంధించి నిర్ణయాలు నేనే తీసుకోగలనని, ఈ అంశంలోకి తన తల్లిదండ్రులను తీసుకురావద్దని అలాగే మానసికంగా నన్ను నేను పురుషుడిగా భావిస్తున్నందున భౌతికంగానూ పురుషుడిగా మార్పును కోరుకుంటున్నానని ఆమె వెల్లడించారు. తాను పురుషుడిగా మారడం ద్వారా తన తల్లిదండ్రుల గుర్తింపు లేదా కుటుంబం గుర్తింపు పెద్ద అడ్డంకి కాబోదని అంటున్నారు. తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు గౌరవిస్తారని అనుకుంటున్నానని, నాకు పోరాడే ధైర్యం ఉందని, ఎవరు ఏం చెప్పినా పట్టించుకోనని స్పష్టం చేశారు. అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు నేను సిద్ధంగా ఉన్నానని, దయచేసి ఈ వార్తలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని మీడియా సుముఖంగా వెల్లడించారు.