అందరికీ వార్తలందించే వారే వార్తల్లోకి ఎక్కారు.. మంచేదో.. చెడేదో.. ప్రపంచానికి చెప్పేవారే వివాదాలకు కేంద్రబిందువు గా మారారు.. ఫోర్త్ ఎస్టేట్ కి ప్రతినిధులు గా చెప్పుకునే వాళ్లే పోరాటానికి సై అంటున్నారు.. అసలు వారి సంఘం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం (వీ.జె.ఎఫ్) వీటన్నింటినీ ఓ అడ్డాగా మారింది. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడిన వి.జె.ఎఫ్ లో ఆధిపత్యం కోసం కొందరు కుమ్ములాడుకుంటున్నారు. అందరి సంక్షేమం కోసమే ఫైట్ చేస్తున్నామని చెప్పి తమ వ్యక్తిగత ఏజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఒకపక్క ప్రస్తుత కమిటీ అని చెప్పుకుంటున్న వారిపై అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ డిమాండ్ చేస్తూ వచ్చిన ఫిర్యాదులపై ఓ వైపు విచారణ కొనసాగుతుండగా మరోపక్క ప్రెస్ క్లబ్ లో సభ్యత్వాలపై కూడా లొల్లి ప్రారంభమైంది. చాలామంది అనర్హులు మెంబర్లుగా కొనసాగుతున్నారని వారిని తొలగించాలని కూడా అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. మొదట త్రీ మెన్ కమిటీ ఆ తర్వాత ఫైవ్ మెన్ కమిటీ ఏర్పాటు చేసి ఫిర్యాదులపై విచారణ సాగించి కొంత మంది సభ్యత్వాలను తొలగించడం తో వివాదం మరింత రాజుకుంది. ప్రస్తుత పాలకవర్గానికి , మరికొంతమంది పాత్రికేయులకు మధ్య. మొదలైన వివాదం అటు పోలీసులకు ఇటు ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదులతో రచ్చ కెక్కింది.. ఈ గొడవ జరుగుతున్న సమయంలోనే విశాఖ జర్నలిస్టులు రెండు గ్రూపులుగా విడిపోయారు. ప్రతిరోజు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటూ విశాఖ జర్నలిస్టుల పరువును బజారుకీడ్చారు. జర్నలిస్టులందరూ కూర్చొని సీనియర్ల సలహాలతో సమస్యను పరిష్కరించుకోవల్సింది పోయి తమ వివాదాన్ని అధికారులు చేతుల్లో పెట్టారు. గతంలో విశాఖ జర్నలిస్టులకు అంతర్గతంగా ఎన్ని గొడవలు జరిగిన, సమస్యలున్న కొందరు సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసేవారు. మీడియా వాళ్లకి అధికారులు, రాజకీయ నాయకులు కూడా మరింతగా గౌరవాన్ని ఇచ్చేవారు. రెండు గ్రూపులుగా ఏర్పడి ప్రెస్ క్లబ్ పై ఆదిపత్యం కోసం తమ పంచాయతీని తీర్చాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో జర్నలిస్టుల మధ్య జరుగుతున్న వ్యవహారాలన్నీ అధికారుల దృష్టికి వెళ్లాయి. ఈ గొడవల కారణంగా జర్నలిస్టులపై వారికున్న అభిప్రాయాన్ని కూడా మార్చుకున్నారు. ఈ మధ్యలో వాట్సప్ గ్రూపుల వేదికగా రెండు వర్గాలు ఆరోపణ, ప్రత్యారోపణలు చేసుకోవడం సాగాయి. అక్కడితో ఆగకుండా ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ మరిన్ని వివాదాలకు ఆజ్యం పోశారు. ప్రతిరోజు గ్రూపులలో ఒకరినొకరు దూషించుకుంటూ మెసేజ్లు చేస్తూ ఉండటం సర్వసాధారణమైపోయింది. అయితే ఇటీవల వీ.జే.ఎఫ్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో మరింత గంధరగోళ పరిస్థితి నెలకొంది. వారం వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నట్లు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. కనీసం పోటీదారుల ప్రచారానికి కూడా సమయం లేకుండా తక్కువ సమయంలో ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలనే అధికారుల నిర్ణయంపై కొందరు జర్నలిస్టులు భగ్గుమన్నారు. ఇది కుట్రలో భాగంగానే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారంటూ కొందరు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గొడవ ఇలా జరుగుతున్న సమయంలో ప్రెస్ క్లబ్ సభ్యత్వాల తొలగింపు మరో వివాదానికి తెరలేపింది. అర్హులైన కొందరు సీనియర్ జర్నలిస్టులను ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ను తొలగించారని రచ్చ మొదలయ్యింది. తొలగించిన జర్నలిస్టుల పేర్ల లిస్టును గ్రూపులలో పెట్టడంతో అందులో పేర్లు ఉన్నవాళ్లు మరింత ఆగ్రహానికి గురయ్యారు. అన్యాయంగా తమ సభ్యత్వాన్ని తొలగించారని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం ఈ ఫీల్డ్ కి దూరంగా ఉన్నవాళ్లను, చనిపోయిన వాళ్లను, జర్నలిజం వృత్తి వదిలి వేరువేరు వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకునే వాళ్లను, దూర ప్రాంతాలకు వెళ్లిపోయిన వాళ్ళని మాత్రమే ప్రెస్ క్లబ్ మెంబర్ షిప్ నుంచి తొలగించాలనే ప్రతిపాదనలు అధికారుల దృష్టికి కొందరు తీసుకువెళ్లారు. అయితే ఈ లిస్టులో కొందరు సీనియర్ జర్నలిస్టుల పేర్లు ఉండటం వివాదానికి కారణమయ్యింది. ఇందులో కొందరు జర్నలిస్టులు స్పందించి తాడోపేడో తేల్చుకుంటామని, అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెబుతున్నారు. ఈ ఎన్నికలు జరగకూడదనే ఉద్దేశంతో సభ్యత్వాల లొల్లిని తెరపైకి తీసుకొచ్చారని, ఈ కారణంగా ఎవరైనా కోర్టుకు వెళితే కోర్టు తీర్పు వచ్చేంతవరకు ప్రెస్ క్లబ్ అధికారుల ఆధీనంలో ఉంటుందని అందుకే కొందరు కావాలని వివాదాలను సృష్టిస్తున్నట్లు పలువురు జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. అయితే రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎన్నికలు జరగాలనే భావిస్తున్నారు. అయితే ఇందులో ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఎవరితోను గొడవలు లేవు. మనస్పర్ధలు లేవు. ప్రెస్ క్లబ్ ఎన్నికల కోసం, అలాగే అక్కడ జరిగిన అక్రమాల కోసం మూడు నెలలుగా విశాఖ జర్నలిస్టుల మధ్య ఎటూ తెగని గొడవ జరుగుతుంది. ఇప్పుడు సభ్యత్వాల లొల్లి కూడా కొనసాగుతుంది. అయితే సందులో సడే మియా లాగా గొడవలు జరుగుతున్న సరే ఆవేమి పట్టించుకోకుండా ప్రెస్ క్లబ్ ఎన్నికలలో ఫలానా దానికి పోటీ చేస్తున్న నాకు ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేసుకుంటున్నారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే అలా ప్రచారం చేసుకుంటున్న వాళ్ల సభ్యత్వాలను కూడా తొలగించాలని అధికారులకు ఇచ్చిన ప్రతిపాదనల లిస్టులో ఉండటం విశేషం. ప్రస్తుతమైతే వీజేఎఫ్ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. సభ్యత్వాల లోల్లి ఒక కొలిక్కి వస్తే ఇక ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా షురూ అవుతుందనేది తెలుస్తుంది.