కరోన థర్డ్ వేవ్ తర్వాత పరిస్థితులు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో గడిచిన ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 35 లక్షల కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా చైనా, జపాన్‌లో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేలా మారింది. ఇక చైనాలో వేలాది మంది ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోక పేషెంట్లు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండిపోతున్నారు. ఇంకా చైనాలో ఎక్కడ చూసినా ఆసుపత్రి మార్చురీల్లో శవాలు పేరుకుపోతున్నాయి. ప్రపంచదేశాలలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన కరోనా హెచ్చరిక ఒక్కసారిగా ఉలికిపాటు కి గురిచేసింది.. దాంతో రాష్ట్రాలన్ని అప్రమత్తమయ్యాయి. కేంద్రం జారీ చేసిన ఆదేశాలు, సూచనలను పాటిస్తూ.. నమోదయిన కేసులపై అనుమానం ఉన్నవాటిని జీనోమ్ సీక్వేన్సీకి పంపుతున్నారు. అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే లక్షణం ఉన్న బీఎఫ్.7 (BF.7) అనే సబ్ వేరియంట్ ఇప్పుడు చైనాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఒక్క మంగళవారం రోజే 3,049 బీఎఫ్.7 సబ్ వేరియంట్ కరోనా కేసులు చైనాలో నమోదు కావడంతో అక్కడి ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వేల కొద్దీ కేసులు వెలుగుచూస్తుండటంతో చైనాలో వైద్య ఆరోగ్య శాఖ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మళ్లీ కఠిన ఆంక్షలకు చైనా తెర లేపింది. ఈ బీఎఫ్.7 సబ్ వేరియంట్ సోకిన వ్యక్తులు చనిపోతుండటం కూడా చైనా భయానికి కారణంగా తెలిసింది. చైనాలో ఈ వేరియంట్ కారణంగా ఆదివారం నాడు రెండు మరణాలు, సోమవారం నాడు ఐదు మరణాలు నమోదయ్యాయి. దీంతో.. చైనాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేగింది. ఈ వేరియంట్ చాలా వేగంగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, బెల్జియం దేశాలకు వ్యాపించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే ఈ వేరియంట్ గురించి హెచ్చరికలు జారీ చేసింది. అయితే చైనాలో పెరుగుతున్న కరోనా కేసులు భారత్‌లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 కేసులు భారత్‌లో కూడా నమోదు కావడం ఆందోళన కలిగించే విషయంగా మారింది. గుజరాత్‌లో రెండు కేసులు, ఒడిశాలో ఒక కేసు నమోదు కావడంతో కేంద్రం కూడా అలర్ట్ అయింది. దేశవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రపంచాన్ని ఇంతలా భయపెడుతున్న ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7 అత్యంత వేగంగా వ్యాప్తి చెందే వైరస్. గత వేరియంట్లతో పోల్చితే రోగ నిరోధక శక్తిని తగ్గించి మనిషిని కుంగదీసి ప్రాణాలను పొట్టనపెట్టుకునే ప్రమాదకర వేరియంట్ ఈ BF.7 సబ్ వేరియంట్ అని ప్రచారం జరుగుతోంది. కాగా, దేశంలో ఆరోగ్య వ్యవస్థ పటిష్టంగా ఉందని, దేశ ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని నీతి అయోగ్ కోవిడ్ 19 వర్కింగ్ చైర్మన్ ఎన్‌కే అరోరా తెలిపారు. ఇంకా మన దేశంలో రోగనిరోధక శక్తి కలిగినవారే ఎక్కువగా ఉన్నారని, ఒక వేళ కరోనా వ్యాపించిన ప్రభుత్వం దగ్గర ప్రభావవంతమైన టీకాలు ఉన్నాయని పేర్కొన్నారు. కరోనావైరస్ యొక్క కొత్త వేరియంట్ విభిన్నమైనది, ప్రాణాంతకమే కాకుండా అది సరిగ్గా గుర్తించడానికి వీలు కానిదని లక్షణాలు కూడా పరిమిత సంఖ్యలో కీళ్ల నొప్పులు, తలనొప్పి, మెడలో నొప్పి, ఎగువ వెన్నునొప్పి , న్యుమోనియా , సాధారణంగా ఆకలి లేకపోవడం వంటి సాధారణ లక్షణాలు మాత్రమే ఉండడం తో దీనిని గుర్తించడం కొద్దిగా కష్ట సాధ్యం కాబట్టి మళ్ళీ అందరూ మాస్క్ లు ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.