రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వారధి ఏర్పడబోతుంది… విడిపోయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలు సరికొత్త సన్నిహిత చరిత్ర సృష్టించబోతున్నాయి.. పదేళ్ళ ఉమ్మడి రాజధానిని గడువుకు ముందే వదులుకున్న ఏ పి సీఎం. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆస్తుల్లో వాటా కోసం తన శిష్యుడు లాంటి మాజీ సహచరుడ్ని కలవడానికి చొరవ చూపించారు.. దానికి స్పందించిన రేవంత్ రెడ్డి చర్చలకు ఆహ్వానించడం తో రెండు రాష్ట్రాల ప్రజలు , రాజకీయ విశ్లేషకుల చూపు ఈ మీటింగ్ పై పడింది.. కొన్ని టీడీపీ అనుకూల చానల్స్ అయితే మీటింగ్ కౌంట్ డౌన్ ని స్క్రీన్స్ పై పెట్టాయి.. వైఎస్ సీఎం గా వున్న సమయం లో ఎంతో ఇష్టం గా కట్టుకున్న సీఎం క్యాంప్ ఆఫీస్ (ఇప్పుడు ప్రజాభవన్ గా మారింది)లోకి చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఎంటర్ అవ్వబోతున్నారు. ఈ ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు. సుహృద్భావ వాతావరణంలో ఈ భేటీ జరుగుతున్నందున సమస్యలన్నీ కొలిక్కి వస్తాయని భావిస్తున్నారు. అప్పట్లో రెండు రాష్ట్రాల సీఎంలు స్నేహ భావంతో వున్నప్పటికీ కేసీఆర్, వైఎస్ జగన్ మధ్య జరిగిన చర్చలు సత్ఫలితాలు ఇవ్వలేదు. అయితే రాజకీయ కారణాలతో మాత్రమే వీళ్లిద్దరూ కలిశారు తప్పా.. విభజన హామీలపై కాదని కొంతమంది విశ్లేషకులు చెప్తుంటారు. విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల సంస్థలే ప్రధాన ఎజెండా గా జరిగే ఈ మీటింగ్ జరగనున్న నేపథ్యంలో అన్నీ కొలిక్కి వచ్చేస్తాయని భావిస్తున్నారు. సీఐడీ హెడ్ క్వార్టర్స్, లేక్ అతిథి గృహం ,విద్యుత్తు బకాయిలు ఇలా అన్ని సమస్యలకు గురు శిష్యులు ఆన్సర్ ఇవ్వనున్నారని సమాచారం. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వీరిద్దరు ఎన్నికైన తరువాత జరుగుతున్న తొలి భేటీ కావడం తో సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతుంది . తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క ,పొంగులేటి శ్రీనివాసరెడ్డి , శ్రీధర్ బాబు పాల్గొననుండగా.. ఏపీ నుంచి మంత్రులు సత్యప్రసాద్, జనార్దన్రెడ్డి, దుర్గేశ్ ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొననున్నారు.