విజయవాడ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో జూనియర్ ఎన్టీయార్ ట్వీట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ పై టిడిపి నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్లుగా ఈ ట్వీట్ ఉందని ఆరోపిస్తున్నారు. అటు టీవీ చానళ్ల లోను, ఇటు సోషల్ మీడియాలోనూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ పైనే రభస కొనసాగుతుంది. కొంతమంది టిడిపి శ్రేణులు కూడా ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా ఉన్న పేరును డాక్టర్ వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకుంది. ఈ విషయం మీద టీడీపీ ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయం మీద తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్ సహా ప్రతి నేత ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త కూడా ఖండిస్తూ వస్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి పెద్ద అసెట్ గా భావిస్తూ వస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చాలా తెలివిగా నర్మగర్భ సమాధానం చెప్పడం ఇప్పుడు టీడీపీ శ్రేణులకు మింగుడు పడడం లేదు. టిడిపిని ఎలాగో డిఫెండ్ చేయడం లేదు. కనీసం తన సొంత తాత పేరు తీసేస్తే కూడా డిఫెండ్ చేయాలని పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఉన్నారా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తెలివిగా ట్వీట్ చేసిన 20 నిమిషాల వ్యవధిలో తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతా నుంచి నిమిషం 26 సెకండ్లు ఉన్న ఒక వీడియో బిట్ విడుదల చేశారు. ఇందులో చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి, వైయస్సార్ కి పోలికా? సిగ్గుండాలంటూ ఘాటు కామెంట్స్ చేస్తున్న విజువల్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎన్టీఆర్ ట్వీట్ కి కౌంటర్ గా ఇస్తూ చేసిందే అని పలువురు భావిస్తున్నారు. కొందరు ఎన్టీఆర్ కంటే వైయస్సార్ గొప్పవాడు అని అంటున్నారని అసలు ఎందులో వైయస్సార్ గొప్ప అంటూ చంద్రబాబు నాయుడు వీడియోలో ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ కు రాజశేఖర్ రెడ్డి కి పోలిక ఇందులో పోలికా లేక, సమాజానికి ఇచ్చిన సేవలో పోలికా లేక జీవితంలో పోలికా అని తాను ప్రశ్నిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో వైసీపీ నేతలు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అప్పుడు టిడిపి శ్రేణులు పేర్కొన్నాయి. తనకు ఎంతో ఇష్టమైన తాత నందమూరి తారక రామారావు పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ కి ఆ పేరు తొలగించి వైయస్సార్ పేరు పెట్టడంపై జూనియర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో సరిగా స్పందించలేదని టిడిపి నేతలు అంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తనకు సంబంధం లేని చాలా విషయాలలో రాజకీయ పార్టీలు బలవంతంగా తన పేరును లాగి ఇబ్బంది పెట్టడంపై కూడా జూనియర్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యవహారంపై ఎవరిని నోప్పించకుండా అటు సీనియర్ ఎన్టీఆర్ కు, ఇటు వైయస్సార్ కు సముచిత గౌరవమిస్తూ తను చేసిన ట్వీట్ ఇంత రాద్ధాంతానికి కారణం అవుతుందని ఊహించలేదు. తన ట్విట్ పై వస్తున్న విమర్శలకు ఎన్టీఆర్ స్పందించలేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం టిడిపి నేతల ట్రోలింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో ఇప్పటికి కూడా ఎన్టీఆర్ కు ప్రాధాన్యతను ఇవ్వడం లేదని, అలాగే పార్టీలో కూడా సరైన గుర్తింపు లేదని, ఇప్పుడు పార్టీకి ఏదైనా కష్టం వస్తే మాత్రం ఎన్టీఆర్ కావలసి వస్తుందని ఫ్యాన్స్ దుయ్యబడుతున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయాల లోకి లాగి అతని సినీ కెరీర్ ను నష్టం చేయడానికి, వ్యక్తిగతంగా అతనికి సమస్యలు తెచ్చి పెట్టడానికే టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నారని జూనియర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.