విశాఖ సముద్ర తీరంలో అగ్నిపర్వతం…?

విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం.. ప్రశాంతతకు అతి అనువైన ప్రాంతం.. పాలనారాజధానిగా పాలకుల మది లో మెదులుతున్న సువిశాల నగరం మరి అలాంటి విశాఖ సముద్ర తీరంలో అగ్నిపర్వతం ఉంది అంటే నమ్మశక్యం కానీ విషయమే.. నిజానికి ఇది అసలు ఊహకందని అంశం. అసత్య ప్రచారం. ప్రజలను భయపెట్టేందుకో.. హడావిడి చేసి భారీ హైప్ క్రియేట్ చేసేందుకో వాడుతున్న వార్త ఇది అని కొందరు కొట్టి పారేస్తుంటే మరి కొందరు పరిశోధకులు మాత్రం అది వాస్తవం ఎందుకు కాకూడదు అని ప్రశ్నిస్తూ మరింత లోతుగా పరిశోధిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. అసలు అగ్నిపర్వతం వుందన్న చర్చ ఇప్పుడే ఎందుకు మొదలైంది. ఇప్పటికే సముద్ర మట్టాలు పెరిగి దేశంలోని పలు తీర ప్రాంతాలు నీట మునుగుతాయనే కథనాలు వెలువడి కలకలం రేపుతున్న నేపధ్యంలో ఇప్పుడు అగ్నిపర్వతం వంతొచ్చింది విశాఖ తీర ప్రాంతంలో అగ్నిపర్వతం ఉందనే చర్చకు ప్రధాన కారణం సముద్రపు ఇసుక రంగు మారడం. ఇదే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. తెలుపు, బంగారు రంగులో ఉండే విశాఖ తీరంలోని ఇసుక ఒక్కసారిగా నలుపు రంగులోకి మారడంతో ప్రజలు భయందోళనకు గురయ్యారు. విశాఖ కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి తీరం వరకు ఇసుక రంగు నలుపులోకి మారడంతో మరెన్నో అనుమానాలు తలెత్తాయి. అయితే గతంలో చాలా సార్లు ఇసుక రంగు నలుపుగా మారినప్పుడు రాని ఆందోళన, భయం ఇప్పుడే ఎందుకు వచ్చిందనేది ప్రశ్నగా మారింది. కొంతమంది పనిగట్టుకుని మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజలను భయానికి గురి చేస్తున్నారు. విశాఖ తీరంలో ఇసుక రంగు నలుపుగా మారడం ప్రమాదానికి సంకేతమని జనాలను బెదరగొట్టారు. మొదట సోషల్ మీడియాలో మొదలైన ఈ ప్రచారం ఆ తర్వాత సాటిలైట్ ఛానల్స్ ,ప్రింట్ మీడియాలో కూడా ఇదే అంశంపై కథనాలు వెలువడ్డాయి. దీనిపై పూర్తిస్థాయిలో వివరాలను సేకరించి ప్రజలకు అందించాలనే తాపత్రయంతో సంబంధిత నిపుణులను, ప్రొఫెసర్లను, సైంటిస్టులను, పలువురు ప్రముఖుల ముందు మైకులు పెట్టి మూడు రోజులపాటు ఇదే అంశాన్ని ప్రసారం చేస్తూ ప్రజలను భయానికి గురి చేశారు. చివరగా తీరంలోని ఇసుక నలుపు రంగులో కి మారడం వలన ఇప్పటికిప్పుడు ప్రజలకు వచ్చే పెద్ద ప్రమాదం ఏదీ లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ విషయంపై పలువురు చెప్పిన అంశాలను చూస్తే మరొక కొత్త విషయం పై అందరూ దృష్టి సారించాల్సి వచ్చింది. అదే విశాఖ తీరంలో అగ్నిపర్వతం.. తీరానికి సమీపంలో అగ్నిపర్వతాలు ఉన్నా, ఏవైనా ఖనిజాల గనులు ఉన్నా కూడా తీరంలోని ఇసుక అయా రంగులను సంతరించుకుంటుంది. కొన్ని కంటికి కనిపిస్తాయి. కొన్ని పరీక్షలు చేస్తే కానీ తెలుసుకోలేం. విశాఖ తీరం పొడవునా అనేక ఖనిజాలు ఉన్నాయనే విషయం పరిశోధనల్లో తేలిందని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇక్కడ వేరువేరు కారణాలు చెప్పినప్పటికీ ప్రత్యేకించి అగ్నిపర్వతం అనే విషయాన్ని పేర్కొనడంతో ఇప్పుడు ఈ అంశం మీదే చర్చ మొదలయ్యింది. కొన్ని దేశాలలో సముద్ర తీరంలో ఉన్న అగ్నిపర్వతాలు బద్దలై తద్వారా జరిగిన రసాయినిక చర్యల ద్వారా ఇసుక నలుపు రంగులోకి రావడం సైంటిస్టులు గుర్తించారు. ఇప్పుడు విశాఖలో కూడా అదే జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఈ వాదన వినడానికి అంత నమ్మశక్యం కాని విధంగా ఉంది. అయినప్పటికీ ఇసుక నలుపు రంగులోకి మారడానికి అది కూడా ఒక కారణమని పరిశోధకులు స్పష్టంగా తెలియజేస్తున్నారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు ఉన్న 32 కిలోమీటర్ల తీర ప్రాంతంలో ఇలా నల్లగా మారే స్పాట్లు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా గోకుల్ పార్క్ బీచ్, సబ్ మెరైన్ బీచ్, ఉడా పార్కు, పెదజాలరిపేట, జోడుగుళ్లపాలెం, తొట్లకొండ, భీమిలి ఇలా అనేక తీర ప్రాంతాల్లో ఇది తరచూ జరిగే పరిణామమేనని అంటున్నారు. తీరంలో ఇసుక నల్లగా మారడానికి గల కారణాలలో తీరం వద్ద ఉన్న లోతు, ఆ సమయంలో అక్కడ అలల తీవ్రత అనేది ఆధారపడుతుందని చెబుతున్నారు. ఏ తీర ప్రాంతంలోనైతే ఖనిజాలు ఎక్కువగా ఉంటాయో, ప్రధానంగా ఏ ఖనిజాలు ఇనుమును థాతువుగా కలిగి ఉంటాయో, అక్కడ ఇసుక నల్లగా మారుతుందని అంటున్నారు. ఎందుకంటే ఇనుము దేనితోనైనా చర్య జరిపినా అది ముదురు నలుపు రంగులోకి మారే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని, తీరంలో ఉండే ఇసుకలోని సిలికాతో ఐరన్ చర్య కారణంగా ఇసుకకు నల్లని రంగుని వస్తుందని పేర్కొంటున్నారు. అయితే చాలామంది చాలా రకాలుగా ఈ అంశంపై తమ అభిప్రాయాలను చెప్పినప్పటికీ విశాఖ సముద్రంలో అగ్నిపర్వతం ఉందని దాని వల్లే ఇసుక రంగు నలుపుగా మారుతుందని కొందరు చెప్పిన ఈ అంశం ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో నగరవాసులు దీనిపై తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Related posts

ఎక్స్ కేటగిరి వద్దన్న విశాఖ స్వామీజీ

అరకు కాఫీ కి టాటా బ్రాండింగ్

మైకేల్ జాక్సన్ బతికేవున్నాడా..?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More