కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనం పై ఏర్పాటు చేయనున్న రాజముద్ర ను ప్రధాని నరేంద్రమోడీ ఆవిష్కరించిన అనంతరం దానిపై తీవ్ర దుమారం చెలరేగింది కొత్త పార్లమెంటు భవనంపై పెట్టె గుర్తు ని ప్రధాని ఆవిష్కరించడం ద్వారా రాజ్యాంగాన్ని అవమానించారని ఎంపీలను సైతం పిలవకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం సరైనది కాదని విపక్షాలు ఓవైపు ధ్వజమెత్తుతూనే మోదీ సింహాలు ఉగ్రరూపమై భయం గొల్పుతున్నాయని పేర్కొన్నారు. నిజానికి బౌద్ధ చక్రవర్తి అశోకుని పాలనా కాలంలో క్రీ.పూ. 250 ప్రాంతంలో మౌర్య సామాజ్యంలో అశోక చక్రవర్తి.. వారాణసీలోని సార్‌నాథ్ వద్ద అశోక స్తంభంపై తామరపుష్పంలో ఉండే ఈ నాలుగు ఆసియా సింహాల చిహ్నాన్ని ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. తామర పుష్పం లేకుండా సింహాల చిహ్నాన్ని రాజ్యాంగ రూపకర్తలు 1950లో మన జాతీయ చిహ్నంగా తీసుకున్నారు. అందులోని అశోక చక్రాన్ని జాతీయ పతాకం నడుమన చేర్చారు అయితే అప్పటి చిహ్నం లో ఉన్నట్టుగా కొత్త పార్లమెంటు భవనం మధ్యలో పైకప్పు మీద ప్రతిష్ఠించబోయే కాంస్య విగ్రహం లో సింహాల రూపు లో ఆ శాంతం లేదని విమర్శిస్తున్నారు. ఏదైతే మూలం వుందో ప్రస్తుతం దానినే కనుమరుగుచేసే ప్రయత్నం మొదలైందని భవిష్యత్తులో భారత రాజముద్ర స్థానంలో ఈ కొత్త సింహాల గుర్తు మాత్రమే కనిపించినా ఆశ్చర్యం లేదని అసలు జాతీయ చిహ్నాన్ని ఇది ప్రతిబింబించడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పాత చిహ్నంలో శాంతచిత్తంగా ఉండే సింహాలను.. కొత్త దాంట్లో ఉగ్రరూపంలో చూపించారని ధ్వజమెత్తాయి. ఇదిలా ఉంటే శిల్పం లో ఎలాంటి సవరణలు చేయలేదని చిహ్నం శిల్పులు సునీల్ దేవరే, రొమీల్ మోజెస్ స్పష్టం చేశారు. కాంస్యంతోరూపొందించిన ఈ కొత్త చిహ్నం 9,500 కిలోల బరువుతో ఆరున్నర అడుగులతో తయారు చేసినట్టు చెప్పారు. జాతీయ చిహ్నం ఆవిష్కరణ వేడుకల్లో మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, రాజ్యసభ ఉపాధ్యక్షులు హరివంశ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, కేంద్ర గృహ-నగరాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పురీ మాత్రమే పాల్గొన్నారని ఈ కార్యక్రమానికి తమను ఆహ్వానించలేదని ప్రతిపక్షాలు ఆగ్రహంతో ఉన్నాయి. కార్యనిర్వాహక వర్గం అధినేతగా దానిని ఆయనెలా ఆవిష్కరిస్తారని నిలదీశాయి. పైగా చిహ్నంలో మార్పులు చేసి దానిని, రాజ్యాంగాన్ని అవమానించారని ఆరోపించాయి. అసలు కొత్త సింహాలు మనుషులను చంపే విధంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు చేశాయి. భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యంలోని మూడు వ్యవస్థలను స్పష్టంగా వేరు చేసి చూపించిందని ప్రభుత్వ వ్యవస్థ (ఎగ్జిక్యూటివ్), పార్లమెంటు, రాష్ట శాసనసభలు (లెజిస్లేచర్), న్యాయవ్యవస్థ… ఈ మూడూ వేటికవే ప్రత్యేక వ్యవస్థలని రాజ్యాంగం చెబుతోందని వ్యాఖ్యానిస్తుంటే భారతీయ జనతా పార్టీ వర్గాలు మాత్రం ప్రతిపక్షాల విమర్శలను కొట్టి పారేశాయి.