జీఎస్టీ మండలి సమావేశం.. జనాలకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టబోతోంది. మరిన్ని వస్తువుల మీద జీఎస్టీని పెంచుతూ జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జులై 18 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ప్రింటింగ్/రైటింగ్ ఇంక్, ఎల్ఈడీ ల్యాంప్‌లు, లైట్లు, మెటల్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులపై ప్రస్తుతం ఉన్న 12శాతం జీఎస్టీని 18శాతానికి పెంచారు. సోలార్ వాటర్ హీటర్లు, సోలార్ సిస్టమ్స్ మీద 5శాతంగా ఉన్న జీఎస్టీని 12శాతం చేశారు. చెప్పుల తయారీ సంస్థలకు సంబంధించిన వివిధ పనులపై 5శాతంగా ఉన్న జీఎస్టీని 12శాతంగా మార్చారు. రోడ్డు, బ్రిడ్జులు, రైల్వే, మెట్రో వంటి కాంట్రాక్టు పనులపై ఉన్న రేటును 12శాతం నుంచి 18శాతానికి తీసుకెళ్లారు. టెట్రా ప్యాక్‌పై ఉన్న 12శాతం జీఎస్టీని 18శాతంగా మార్చారు. పాలిష్డ్ డైమండ్ రేట్‌ను 0.25శాతం నుంచి ఏకంగా 1.5శాతానికి పెంచేశారు. కత్తులు, కట్టింగ్ బ్లేడ్లు, పేపర్ నైఫ్‌లు, పెన్సిల్ షార్ప్నర్లు, స్పూన్లు, ఫోర్క్‌లు- 18శాతం, విద్యుత్‌తో పనిచేసే పంపులు, బైసైకిల్ పంపులు- 18శాతం, మిల్లింగ్ పరిశ్రమలో వినియోగించే యంత్రాలు, విత్తనాల కోసం ఉపయోగించే యంత్రాలు, వెట్ గ్రైండర్లు- 18శాతం, నగదు విత్‌డ్రా చేసుకునేందుకు వినియోగించే చెక్‌లు- 18శాతం, అట్లాస్‌లు, వాల్ మ్యాప్‌లు- 12శాతం, హోటల్ వసతు రూ.1000(రోజుకు) దాటితే 12శాతం, ఆసుపత్రుల్లో రూమ్ రెంటు రోజుకు రూ. 5వేలు దాటితే 5శాతం పెంపుదల చేసారు.