(సనరా వంశీ) విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో వర్గ పోరు మొదలైంది. స్థానికులు స్థానికేతరులు మధ్య నియోజకవర్గం ఆధిపత్యంపై రగడ కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న తొమ్మిది మంది వైసిపి కార్పొరేటర్లు ఒక వైపు ఉండగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఎస్.సుధాకర్ మరోవైపు ఉన్నారు. ఏడాది నుంచి నియోజకవర్గం పట్టు పై ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతూనే ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో స్థానికంగా ఉన్న కార్పొరేటర్ లలో ఒకరిని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించాలని కార్పొరేట్ లందరూ బహిరంగంగానే పార్టీ అధిష్టానానికి తమ అభిప్రాయాలను తెలియజేశారు. తమలో ఎవరికి ఇచ్చినా అందరం కలిసి పని చేస్తామని కూడా హామీ ఇచ్చారు. కాని నియోజకవర్గానికి ఎలాంటి సంబంధం లేని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ తానే ఎమ్మెల్యే అభ్యర్థిని అని ప్రచారం చేసుకుంటూ ఉండటంపై అసలు గొడవ మొదలైంది. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా తన బాధ్యతలు నిర్వర్తించకుండా నియోజకవర్గంలో తిరుగుతూ కొన్ని ప్రాంతాలలో నిత్యవసర వస్తువులు పంపిణీ చేస్తూ స్థానికంగా ఉన్న నాయకులను, కార్యకర్తలను తమ వైపునకు తిప్పుకుంటూన్నారని సుధాకర్ పై కార్పొరేటర్లు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని గ్రూపులను ఏర్పాటు చేసి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూన్నారని అతనిపై పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మాత్రం బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ కార్పొరేటర్ ల ఆరోపణపై పెద్దగా స్పందించకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. రాష్ట్రస్థాయి నాయకత్వంతో అతనికి సత్సంబంధాలు ఉండటంతో రానున్న ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే టికెట్ కి సంబంధించి పార్టీ పెద్దల నుంచి కూడా హామీ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు నియోజకవర్గంలో ప్రజలకు చేరువుగా ఉంటున్నట్లు కొందరు పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. కార్పొరేటర్లు మాత్రం సుధాకర్ వ్యవహారశైలిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.