ప్రియాంకా గాంధీ దక్షిణాది రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ వ్యవహరించనున్నారు. త్వరలో జరగనున్న పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ తర్వాత ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ప్రియాంకా గాంధీ ఇప్పటి వరకూ యూపీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకున్నారు. దక్షిణాదిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. పార్టీ కూడా ఇంత వరకూ ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. అయితే హఠాత్తుగా ఆమెను దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్ గా నియమించాలని నిర్ణయించడం చర్చనీయాంశమవుతోంది. ఉత్తరాదిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొన్ని రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి.. ప్రాంతీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. కర్ణాటకలో బీజేపీతో పోటీ పడుతోంది. అయితే దక్షిణాదిలోనూ బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనపడుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లి అధికారం దక్కించుకోవడంలో రెండు సార్లు విఫలం కావడమే కాకుండా ఇప్పుడు మరింతగా బలహీనమవుతోందన్న అభిప్రాయాలు కాంగ్రెస్ మీద వస్తున్నాయి. దీంతో స్వయంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కేరళలో వరుసగా రెండో సారి అధికారాన్ని కోల్పోయింది. అక్కడ మరోసారి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడులో అధికారపార్టీ కూటమిలో భాగస్వామిగా ఉంది. కర్ణాటకలో త్వరలో ఎన్నికలుజరగనున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీకి మంచి చాన్సులు ఉన్నాయని భావిస్తున్న తరుణంలో పార్టీ హైకమాండ్ తరపున బలమైన నాయకుడు వ్యవహారాలు పర్యవేక్షిస్తే.. ఇబ్బంది లేకుండా ఉంటుందన్న అంచనాలు పార్టీ పెద్దల నుంచి వచ్చాయి. ఈ కారణంగా ప్రియాంకా గాంధీ కూడా దక్షిణాదిపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ప్రియాంగా గాంధీకి మొదటి టాస్క్‌గా తెలంగాణ ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక ముంచుకొస్తోంది. వచ్చే ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం అంతా రచ్చ రచ్చగా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడమే ఆయన సోదరుడు వెంకటరెడ్డి పీసీసీ చీఫ్‌ను టార్గెట్ చేసుకుని రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఎంట్రీతో వీటన్నింటికీ చెక్ పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రియాంకా గాంధీ ఇటీవల రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆమెకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ఆమె ఎంట్రీతో దక్షిణాదిలో కాంగ్రెస్ రాత మారుతుందేమో చూడాలి .