బాలీవుడ్ సినిమాలను సూపర్ హిట్ చేసి నెత్తిన పెట్టుకున్న నార్త్ ఇండియన్ ఆడియన్స్ ఇప్పుడవే సినిమాలను బాయ్ కట్ చేస్తున్నారు. సినిమా ఎంత బాగున్నా సరే థియేటర్ల మొహం చూడటం లేదు. ప్రేక్షకులు లేకపోవడంతో షోస్ నిలిపివేయాలిసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా అమీర్ ఖాన్ ” లాల్ సింగ్ చేద్దాం” , అక్షయ్ కుమార్ ” రక్షాబంధన్ ” మూవీలకు ఇటువంటి చేదు అనుభవం ఎదురయింది. సౌత్ లో హిందీ చిత్రాలకు అంతంత మాత్రమే ఆదరణ ఉంటుంది. కానీ నార్త్ లో అలా కాదు. అక్కడ కూడా హీరోలకు పెద్ద ఫ్యాన్ బేస్ ఉంటుంది. తమ హీరోల చిత్రాలు మొదటి రోజు చూసి పెద్ద హడావిడి చేసే అభిమానులు కూడా ఎక్కువమందే ఉన్నారు. తమ హీరో మూవీ బాగుంది అంటే తమ హీరో మూవీ బాగుందని అభిమానుల మధ్య ఘర్షణలు కూడా జరుగుతూ ఉండేవి. కానీ అలాంటి అభిమానులే ఇప్పుడు థియేటర్లకు రావడం మానేశారు. ఇక సాధారణ ప్రేక్షకుడైతే థియేటర్ దరిదాపుల్లోకి వెళ్లడం లేదు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి పెద్ద హీరోల చిత్రాలకు మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 10 కోట్ల కలెక్షన్లు రావడమే గగనం అయిపోయింది. ఇదివరకైతే వీరి చిత్రాలకు మొదటి రోజు కలెక్షన్ 15 నుంచి 30 కోట్ల వరకు వస్తుండేవి. కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి ఏ సినిమా రిలీజ్ అయిన ఓపెనింగ్ డే లో వచ్చే కలెక్షన్లు ఐదు నుంచి ఏడు కోట్ల లోపే ఉండటం బాలీవుడ్ మేకర్స్ ను విస్మయానికి గురిచేస్తుంది. అదే సమయంలో రీజినల్ మూవీస్ కి ఫస్ట్ డే కలెక్షన్ భారీ స్థాయిలో ఉంటున్నాయి మరోవైపు వరుసగా పాన్ ఇండియన్ మూవీలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న టాలీవుడ్ పై బాలీవుడ్ మేకర్స్ గుర్రుగా ఉన్నారు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరో కూడా పాన్ ఇండియన్ మూవీ తీసి హిట్ కొడుతున్నాడు. ఇదే బాలీవుడ్ కి అసలు మింగుడు పడని అంశం.. మేజర్ మూవీ ద్వారా అడవి శేష్, కార్తికేయ -2 ద్వారా నిఖిల్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్లుగా మారిపోయారు. ఈ చిత్రాలకు నార్త్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇటీవల రిలీజ్ అయిన లాల్ సింగ్ చద్దా , రక్షాబంధన్ బాలీవుడ్ మూవీలు నార్త్ ఆడియన్స్ ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. వీటితోనే రిలీజ్ అయిన కార్తికేయ -2 మాత్రం నార్త్ లో హిట్ మూవీగా నిలిచింది. పెద్దగా కాకపోయినా సరే ఆశించిన స్థాయిలో ఈ టాలీవుడ్ మూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయనే చెప్పాలి. లాల్ సింగ్ చద్దా, రక్షబంధన్ చిత్రాలకు అత్యధికంగా థియేటర్ లు కేటాయించడం వల్ల కార్తికేయ మూవీకి థియేటర్ల కొరత ఎదురయింది. దీంతో తక్కువ థియేటర్లలోనే ఈ మూవీ అక్కడ రిలీజ్ చేశారు. ఎన్ని థియేటర్లలో రిలీజ్ చేసినప్పటికీ బాలీవుడ్ మూవీలకు ప్రేక్షకుల ఆదరణ కరువయ్యింది. ఆడియన్స్ లేక థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అదే సమయంలో అక్కడ కార్తికేయ మూవీ రిలీజ్ అయిన థియేటర్ ల వద్ద ప్రేక్షకులు సందడి చేస్తున్నారు. దేశానికి వ్యతిరేకంగా, సైన్యాన్ని చిన్న చూపు చూస్తూ, భారతీయ సంస్కృతిని ఎగతాళి చేస్తూ, కుటుంబ విలువలను మంటగలిపుతూ, సెమీ పోర్న్ కంటెంట్లతో మూవీలు చేస్తున్న బాలీవుడ్ పై నార్త్ ఆడియన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు. ఇండియన్ సినిమా అంటే ఇది అన్నట్లు టాలీవుడ్ సినిమాలకు అక్కడి జనం బ్రహ్మరథం పడుతున్నారు. బాలీవుడ్ కు తమిళ్ , మలయాళం మూవీలు మాత్రమే గట్టి పోటీ ఇస్తాయని బాలీవుడ్ భావించింది. టాలీవుడ్ మూవీస్ తమ దరిదాపుల్లోకి రావని ఊహించింది. తెలుగు సినిమాల పట్ల చులకన భావంతో ఉండేది. కానీ ఆ టాలీవుడ్ మూవీలే పాన్ ఇండియన్ మూవీలు గా మారి ఇండియన్ సినిమాని రూలింగ్ చేస్తాయనే విషయాన్ని అస్సలు ఊహించలేకపోయారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా ఇండస్ట్రీలు బాహుబలి సక్సెస్ ని చూసి అదే రేంజ్ లో పాన్ ఇండియన్ మూవీలుగా తమ సినిమాలను రిలీజ్ చేసి చేతులు కాల్చుకున్నారు. కానీ బాహుబలి తర్వాత టాలీవుడ్ మూవీలకు మాత్రమే పాన్ ఇండియన్ రేంజ్ వచ్చింది. టాలీవుడ్ లో ఏ చిన్న హీరో సినిమా చేసి రిలీజ్ చేసిన అది నేషన్ వైడ్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ మూవీ ఇండియన్ మూవీ గా రూపాంతరం చెందింది. ఇండియన్ సినిమాని టాలీవుడ్ శాసించడంపై బాలీవుడ్ మేకర్స్ తట్టుకోలేకపోతున్నారు. కోట్లు కుమ్మరించి భారీ ఎత్తున తీసిన సినిమాలకు పబ్లిసిటీ ఖర్చులు కూడా రాని పరిస్థితులకు టాలీవుడ్ ఇండస్ట్రీ పరోక్ష కారణమని భావిస్తున్నారు. కానీ నార్త్ ఆడియన్స్ లో వచ్చిన మార్పు దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. బాలీవుడ్ టాప్ స్టార్స్ సినిమాలు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. వాటిని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. వాటికి కూడా గడ్డు పరిస్థితి ఎదురైతే ఇక తమ పరిస్థితి ఏంటనేది ఆందోళనలో ఉన్నారు. కొన్నాళ్ల పాటు తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేయకుండా ఉండటమే బెటర్ అని భావిస్తున్నారు. థియేటర్లో రిలీజ్ చేసి జనాల రాకపోతే అబాసపాలు అయ్యే కంటే కొన్నాళ్ళు ఎదురుచూసి పరిస్థితులు సద్దుమణిగాక అప్పుడు రిలీజ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి అయితే బాలీవుడ్ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.