కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కోసం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపలేదని మండిపడుతున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళని వారిపై వేటు తప్పదనే సంకేతాలను గట్టిగానే ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజలకు నేరుగా చెప్పేందుకు కూడా సమయం కేటాయించని వారికి ఇక టిక్కెట్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందే టికెట్టు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానన్నారు. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, జిల్లా ఇన్‌ఛార్జిలతో జరిగిన భేటీ సందర్భంలో ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నేతల పనితీరుపై ఐప్యాక్ టీమ్ నివేదికలను ఎమ్మెల్యేలకు వెల్లడించారు ముఖ్యమంత్రి. 27 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. గడప గడపకు కార్యక్రమంలో కొందరు సరైన పనితీరు కనపరచలేదన్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టాలని సదరు ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోకుంటే సీటు ఇచ్చేది లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. నవంబరులో మరోసారి ఎమ్మెల్యేల పనితీరు రివ్యూ చేస్తామన్నారు. గడప గడపకు సమీక్షలో ఈ 27 మందిపై పూర్తిగాఫోకస్ పెట్టారు. ఈ 27 మందిలో మంత్రులు సైతం ఉన్నారు. తాను అనుకున్న 175 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదనే తేల్చిచెప్పారు. ఎన్నికలకు 6 నెలల ముందే సీటు ఇవ్వనివారి పేర్లు ప్రకటిస్తానని సీఎం.. ఎమ్మెల్యేలతో చెప్పారు. వారంలో 4 రోజులు జనంలోనే ఉండాలని జగన్ ఎమ్మెల్యేలకు సూచించారు. కొంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్లకుండా.. కొడుకులు లేదా వారసులను పంపడం కరెక్ట్ కాదన్నారు. ఇకపై అలా కుదరదని.. నేతలే స్వయంగా వెళ్లాలన్నారు.