ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకే.. జ’గన్’ షాట్

అధికార వైసీపీ రాజకీయ చతురతకు మరింత పదును పెట్టింది. తొలిసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రేసులోకి అడుగుపెట్టి.. అభ్యర్ధులను ప్రకటించింది. ఉత్తరాంధ్ర నుంచి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్‌ను ఎంపిక చేసింది. వాస్తవానికి సీతంరాజు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గా పోటీకి సిద్ధపడుతున్నారు. హైకమాండ్ అవకాశం కల్పిస్తుందనే ధీమాతో సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అంటున్నారు. దీంతో తరచూ అక్కడ కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు సీతంరాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో .. అధినేత ఆలోచనల్లో భాగంగానే ఆ నిర్ణయం జరిగిందని టాక్‌. అంతే కాకుండా ఎమ్మెల్సీని గెలిపించుకునే బాధ్యత తాము తీసుకున్నామనే సంకేతాలను పార్టీ పంపినట్లయిందని చర్చ జరుగుతోంది. సాధారణంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భం లేదు. అయితే ఈసారి పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. తొలిసారి వైసీపీ పోటీ చేస్తోంది. అనేక సమీకరణాలను వడపోసిన తర్వాతే ఆ నిర్ణయం తీసుకుందనే టాక్ వినిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకే పదవులు ఇస్తున్నారనే అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నంలా ఉత్తరాంధ్ర సీటును బ్రాహ్మణ సామాజికవర్గానికి కేటాయించడం ద్వారా ఉభయ తారకమైన ఆలోచన చేసిందని అంటున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ. విద్యావంతులు, ఉద్యోగులు అధికశాతం ఉంటారు. వీరిలో మెజార్టీ ఓటర్లు వివిధ కారణాలతో బీజేపీ, టీడీపీకి దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఉంది. అలాంటి సెగ్మెంట్‌ను ఆకర్షించడం ద్వారా మరింత బలోపేతం కావాలనే ఆలోచన చేసినట్టుగా తెలుస్తోంది. రాజకీయంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బ్రాహ్మణులకు ప్రాధాన్యం లేదనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. వీటన్నింటినీ ఒకేసారి పరిష్కారించేందుకే సీతంరాజును ఎంపిక చేసినట్టు విశ్లేషిస్తున్నారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30మంది బరిలో ఉంటే.. పోటీ ప్రధాన అభ్యర్ధుల మధ్యే సాగి టీడీపి ,బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపొందారుఇప్పుడు బీజేపీకి జనసేనతో మాత్రమే పొత్తు ఉంది. ఈ రెండు పార్టీల బలం ఎంత వరకు నెగ్గుకొస్తుందనేది ఒక ప్రశ్న. టీడీపీ వైఖరి వెల్లడి కావాల్సి ఉంది. పోటీకి ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరు చర్చలు జరుపుతున్నారట. వైసీపీ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉంది. అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా తన వైఖరిని స్పష్టంగా చెప్పేసింది అధిష్ఠానం. పైగా ఎమ్మెల్యేలకు పెద్ద టాస్క్ ఇవ్వనుందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావించి ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగక తప్పదు.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More