ఆర్జీవీ’వ్యూహం’ఎవరి కోసం..?

ఒకప్పుడు సూపర్‌హిట్ సినిమాలకు చిరునామా గా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. కాంట్రవర్సీనే తన సక్సెస్ మంత్రగా మార్చుకున్నారు. ఆయన ప్రకటించే సినిమాలు కూడా ఏదో విధంగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది. గతంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ పేరుతో పెను సంచలనం సృష్టించారు. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గత ఎన్నికల టార్గెట్ గా తీసిన చిత్రాలు విజయవంతం అయ్యాయా… లేదా అన్న విషయం పక్కన పడితే వైసీపీకి మాత్రం రాజకీయంగా బాగా ఉపయోగపడాయానే చెప్పొచ్చు. ఇప్పుడు తాజాగా రామ్ గోపాల్ వర్మ వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకుని మరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తాను చేయనున్న చిత్రాలను ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసిన తర్వాత మరుసటి రోజే తాను చేసే చిత్రాలకు సంబంధించి ఈ ప్రకటన చేశారు. అయితే ఆయన ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పదమైన స్టోరీలను ఎన్నుకొని సినిమాలు గా మలచడం. ఆ సినిమాలను తన స్టైల్ లో ప్రచారం చేయడం. ఆ చిత్రాలు మరింత కాంట్రవర్సీ కావడం జరుగుతుంది. ఆ చిత్రాలు వచ్చి వెళ్లినట్లు జనాలకు కూడా తెలియని పరిస్థితి. అలాగే ఆయన తీసిన మరికొన్ని చిత్రాలు విడుదల కాకుండా కొన్ని ఉన్నాయి. ప్రారంభించి మధ్యలో ఆపేసిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అనౌన్స్ చేసి ఇంకా మొదలుపెట్టని చిత్రాలు కూడా ఉన్నాయి. వర్మ తను తీయబోయే చిత్రం ప్రకటన తర్వాత అది కచ్చితంగా కాంట్రవర్సీ సినిమానే అయి ఉంటుందని జనాలు మాట్లాడుకోవడం సహజం. కానీ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కలిసిన మరుసటి రోజే వర్మ సినిమా ప్రకటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరింత వేడిని పెంచింది. ప్రతిపక్ష పార్టీలను, ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేసి తీసే ఈ సినిమాలను ఎన్నికల ముందు రిలీజ్ చేస్తారనే విషయాన్ని వర్మ తన ట్విట్ లలో నర్మగర్భంగా చెప్పారు. రామ్ గోపాల్ వర్మ తన కొత్త సినిమాపై ట్వీట్ తో పాటు ఓ ఆడియోను రిలీజ్ చేశారు. ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారింది. త్వరలో వ్యూహం అనే రాజకీయ సినిమా తీస్తానని ఇది అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన ‘వ్యూహం’ కథ, రాజకీయ కుట్రల విషంతో నిండి వుంటుంది. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్టే ‘వ్యూహం’ సినిమా” అని తెలిపారు. ఈ సినిమా రెండు పార్ట్స్‌గా రాబోతుందని. మొదటి పార్ట్ ‘వ్యూహం’, సెకండ్‌ పార్ట్ ‘శపథం’. ఈ రెండింటిలోనూ రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా ఉంటాయని ఆర్జీవీ చెప్పారు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ట్వీట్లు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం ‘వ్యూహం’ షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ పార్ట్ 2 ‘శపథం’లో తగులుతుందని సెటైరికల్‌ గా తెలిపారు. వ్యూహం చిత్ర నిర్మాత తనతో అంతకు ముందు వంగవీటి సినిమా తీసిన దాసరి కిరణ్ అని అర్జీవీ తెలిపారు. ”ఎలక్షన్స్ టార్గెట్‌గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన అవసరం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదు.” అని ఆర్జీవీ ట్విటర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.  వచ్చే ఎన్నికలలో అధికారం కోసం మళ్లీ మూడు పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. ప్రస్తుతం అయితే వైసీపీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొరకరాని కొయ్యగా తయారయ్యారు. అతన్ని ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు రంగంలోకి దిగుతున్నారు. ఇటీవల వైజాగ్ లో జరిగిన ఘటన నేపథ్యంలో మళ్లీ పవన్ కళ్యాణ్- చంద్రబాబునాయుడు దగ్గరయ్యారు. ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే వచ్చే ఎన్నికలలో వైసిపికి గట్టి పోటీ తప్పదు. ఆ పార్టీలు విడివిడిగా బరిలోకి దిగితే వైసిపికి బాగా కలిసి వచ్చే అంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో వైకాపా నేతలు పవన్ కళ్యాణ్ టార్గెట్ గా వ్యక్తిగత దూషణలు చేస్తూ రాజకీయ వేడిని పెంచుతున్నారు. వైకాపా నేతలకు దీటుగానే జనసేన నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరోపక్క టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇతర పార్టీలతో పొత్తులకు కూడా వెనకాడటం లేదు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షాల వ్యవహార శైలి, అధికార పార్టీ ని ఇరుకున పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అలాగే ప్రజలకు తెలియని మరికొన్ని విషయాలను రాజకీయ చిత్రాలుగా మలిచి ఎన్నికల ముందు రిలీజ్ చేసేందుకు రాంగోపాల్ వర్మ సమయతమవుతున్నారు. ఈ చిత్రాలు అధికార పార్టీకి అనుకూలంగానూ, ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగాను ఉంటాయనే విషయం తన ట్వీట్ ల ద్వారా వర్మ నేరుగానే చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన తర్వాతే ఎన్నికలను టార్గెట్ చేసుకొని తాను రెండు భాగాలుగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలను తీస్తున్నట్లు వర్మ ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాల ద్వారా మళ్లీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లనే టార్గెట్ చేస్తారని అటు టిడిపి ఇటు జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఆ సినిమాలకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు వెల్లడి చేయలేదు. ఆ సినిమాల కథ, అందులో ఉండే క్యారెక్టర్ల గురించి వర్మ బయట పెడితే మాత్రం ఖచ్చితంగా అది మరింత కాంట్రవర్సీ కావడం ఖాయమని స్పష్టమవుతుంది. కాంట్రవర్సీ సినిమాలతో వివాదాస్పద దర్శకుడుగా మారిన వర్మ నుంచి త్వరలో రానున్న వ్యూహం, శపథం పొలిటికల్ చిత్రాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత వేడిని పెంచడం ఖాయమని తెలుస్తుంది.

Related posts

చంద్రబాబే నంబర్ వన్

ఎవరో ఒకరు నాయకత్వం తీసుకోవాల్సిందేనా..?

ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి….-నిర్మాత నట్టి కుమార్ ఫైర్

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More