విశాఖలో పారిశ్రామిక ప్రమాదాలకు అంతం లేకుండా పోతోంది. ఏదో ఒక పరిశ్రమలో ప్రతి నెలా ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. పరవాడలోని ఫార్మాసిటీ, అచ్యుతాపురం, నక్కపల్లి పారిశ్రామికవాడలు, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లలో తరచూ ఇలా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.పేరుకు విశాఖ మహా నగరం.. మరోవైపు ప్రశాంతతకు మారు పేరు అని గుర్తింపు.. టూరిజంలో నెంబర్ వన్ ప్లేస్.. ఐటీ హబ్ గా ఎదుగుతున్న వైనం..మరో వైపు ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటన.. ఇవ్వన్నీ కూడా విశాఖకు మరింతగా గుర్తింపు తెచ్చే అంశాలు అయినప్పటికీ విశాఖనగరంలో ప్రస్తుత పరిస్థితి మాత్రం క్షణ క్షణం.. భయం భయంగా మారింది. ముఖ్యంగా విశాఖ జిల్లాను వరస అగ్ని ప్రమాదాలు భయపెడుతున్నాయి. దీంతో జిల్లాలోని ప్రజలు వణికిపోతున్నారు. స్థానిక ప్రజలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామంటున్నారు. ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు మారుపేరైన విశాఖ జిల్లాలో వరస ప్రమాదాలు జరుగుతుండటం ఆంధోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎందుకిలా జరుగుతోందని స్థానికులు భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పటికైన ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండి.. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలిని కోరుతున్నారు. వరుస ప్రమాదాల నేపథ్యంలో అధికారుల వైఫల్యమే కారణమనే వాదన వినిపిస్తోంది ప్రమాదం జరిగినప్పుడు హెచ్చరించడం.. తరువాత నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ.. కఠిన చర్యలు తీసుకోకపోవడంతోనే అంతా నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.గతంలో సింహాచలం ఏపీ ట్రాన్స్ కో సబ్ స్టేషన్లో మంటలు చెలరేగాయి. సబ్ స్టేషన్లోని ట్రాన్స్ ఫార్మర్లు భారీ శబ్దంతో పేలాయి. దీంతో స్టానిక ప్రజలు భయాంధోళనలకు గురయ్యారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గల కారణాలు ఎంటి అనే విషయంపై దర్యాప్తు చేసి అసలు కారణం వెల్లడించారు. గోపాలపట్నంలో ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరిన్ గ్యాస్ లీకై 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత హిందూస్థాన్ షిప్‌యార్డులో క్రేన్ పనితీరు పరిశీలిస్తుండగా విరిగిపడి ఎనిమిది మంది మరణించారు. కరోనా సమంలో పరిశ్రమలను నడపడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసినప్పటికి వాటిని సరైన విధంగా పాటించక పోవడంతో కరోన సమయంలో పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి పరిశ్రమలలో భద్రత ప్రమాణాలను అధికారులు ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. గతంలో దువ్వాడ ఎస్‌ఈజెడ్‌లో విదేశాల నుంచి తుక్కు తెచ్చే ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అదే విధంగా పరవాడ మండలం భరణికం గ్రామంలో అనన్య ఫార్మా కంపెనీలో లిక్విడ్ అమోనియం గ్యాస్ లీకై ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కళ్ల మంటలు, ఒళ్లంతా దురదలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్నఅధికార యంత్రాంగం కంపెనీని తాత్కాలికంగా షట్‌డౌన్ చేయించి, విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత హెచ్‌పీసీఎల్‌లో క్రూడాయల్ శుద్ధి చేసే యూనిట్-3లో మంటలు చెలరేగాయి. భారీ ప్రమాదమేనని అంతా భావించారు. అయితే అధికారులు తక్షణమే స్పందించడం, ఆ యూనిట్‌కు క్రూడాయిల్ సరఫరా నిలిపివేయడం, ఆరుకు పైగా అగ్నిమాపక శకటాలతో నీటిని విరజిమ్మడంతో మంటలు అదుపులోకి వచ్చాయి.హెచ్‌పీసీఎల్, స్టీల్‌ప్లాంటు, షిప్‌యార్డు, ఫార్మా సిటీ వంటి భారీ పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే విచారణకు ఆదేశించినా, ఆ తరువాత నివేదిక బయటకు రాకుండా, ఎటువంటి చర్యలు లేకుండా కాలం గడిపేస్తున్నారు. గతంలో షిప్‌యార్డులో జరిగిన క్రేన్ ప్రమాదానికి యాజమాన్యం పొరపాటే కారణమని తేలినా ఇప్పటివరకు ఏ ఒక్కరిపైనా చర్యలు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి.ఇక ఎల్‌జీ పాలిమర్స్‌లో ప్రమాదానికి సంబంధించి హైపవర్ కమిటీ సిఫారసులను అమలు చేయలేదని అలాగే స్టీల్‌ప్లాంటులో ఏమి జరిగినా బయటకు పొక్కనివ్వరని, అది ప్రభుత్వ సంస్థ అయినా, ప్రైవేటు సంస్థ అయినా గోప్యంగా ఉంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ఏ ప్రమాదం జరిగిన రెండు మూడు రోజులు హడావిడి చేసి ఆ తరువాత దానిని పక్కన పెట్టేస్తున్నారని పలువురు చెబుతున్నారు. దాదాపుగా 20 వేల కోట్ల వ్యయంతో కొన్నేళ్లుగా విస్తరణ పనులు చేపడుతున్న హెచ్‌పీసీఎల్‌లో రోజూ వేయి మందికి తక్కువ లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.అక్కడ ఇది వరకు జరిగిన ప్రమాదం సమయంలో యూనిట్‌లో కూడా 100 మంది వరకు విధుల్లో ఉన్నారని, సైరన్ మోగడం వల్ల వారంతా అప్రమత్తమై ప్రాణాలు దక్కించుకున్నారని అంటున్నారు. లేదంటే…కొందరు బలి అయిపోయి ఉండేవారని చెబుతున్నారు. పరిశ్రమల్లో భద్రత వ్యవహారాలు పరిశీలించే ఇన్‌స్పెక్టరీస్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పెట్రోలియం ఎక్స్‌ప్లోజివ్స్ ఆర్గనైజేషన్, బాయిలర్స్ విభాగం వంటివి పూర్తిస్థాయిలో అన్ని పరిశ్రమలను సకాలంలో తనిఖీ చేయలేకపోతున్నాయి. ఈ కారణంగానే పరిశ్రమలలో నిర్లక్ష్య ధోరణి యథేచ్ఛగా కనిపిస్తుందని దీని వలన ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఎవరికి వారు నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తూ, భద్రతకు తగిన జాగ్రత్తులు తీసుకోవాలని అంటున్నారు. కానీ కొన్ని సంస్థలు వాటిని పెడచెవిన పెడుతున్నాయని, అటువంటిచోట్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఇదివరలో హెచ్‌పీసీఎల్‌లో జరిగిన ప్రమాదానికి కూడాఇదే కారణమని నిపుణులుచెబుతున్నారు. తాజాగా విశాఖ జిల్లాపెదగంట్యాడ శ్రావణ్ షిప్పింగ్ గోదాంలో అగ్ని ప్రమాదం అలాగేఅనకాపల్లి జిల్లా అచ్యుతపురం ఎస్.ఇ.జెడ్ గ్యాస్ లీక ఘటన భద్రత ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యం కారణంగా జరిగాయని నిపుణులు చెబుతున్నారు. –సనారా వంశీ