వివాదాస్పద సినిమాలకు, వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ రాజకీయ నేపథ్యంలో కొందరిని టార్గెట్ చేస్తూ చేస్తున్న సినిమాలు అనుకూల ఫలితాలు ఎంత వరకు ఇస్తాయి అన్నది పక్కన పెడితే రీచ్ మాత్రం పక్కా… ఇప్పుడు తాజాగా మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాంగోపాల్ వర్మ మరోసారి రంగంలోకి దిగారు. యధావిధిగానే వైసీపీకి అనుకూలంగా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తూ మరో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతి పై సినిమా తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఆర్జీవీ తాజాగా ఆ చిత్రానికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. గత ఎన్నికల సమయంలో కూడా వైసిపి అనుకూలంగా టిడిపిని టార్గెట్ చేస్తూ వరుస సినిమాలు చేసిన వర్మ కు అప్పటి రోజులు ఆవిధంగా కలిసిచ్చినా ఇప్పటి వ్యూహం ఎంతమేర వర్కవుట్ అవుతుందో తేలాల్సి ఉంది. జగన్ మోహన్ రెడ్డి పాత్రను ప్రముఖ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా, భారతి పాత్రలో మాసన రాధకృష్ణన్ నటిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ లను టార్గెట్ చేసి సినిమాలు అప్పట్లో చాలా దుమారాన్ని లేపాయి. వైసిపి నేతలను ఆయన నేరుగా కలిసిన తర్వాతే ఆ సినిమాల పనులను ప్రారంభించారు. అప్పటి టిడిపి ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో వైసీపీకి బాగా లాభించింది. ఎన్నికల ముందు వరకు కలిసి ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకొని విడిపోయి విడివిడిగా పోటీ చేయడం జరిగింది. ఇది కూడా వైసిపి కి బాగా కలిసి వచ్చింది. ఎన్నికల తర్వాత మెజార్టీ సీట్లతో వైసీపీ విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ సినిమాలో తీస్తే బాధ్యతను రామ్ గోపాల్ వర్మకు వైసీపీ అప్పగించింది. ఏపీలో జరుగుతున్న రాజకీయాల ఆధారంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ‘ వ్యూహం ‘ టైటిల్ తో చడిచప్పుడు లేకుండా షూటింగును కొనసాగించేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేశారు. ఇక ఈ సినిమా గురించి రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ అహంకారానికి, ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుంచి ఉద్భవించిన వ్యూహం కథ రాజకీయ కుట్రలతో నిండి ఉంటుందని ప్రకటించారు.మొదటి భాగం వ్యూహం షాక్ నుంచి తేరుకునే లోపే రెండోభాగం శపథంతో మరో షాక్ ఇస్తానని కూడా ఆర్జీవీ గతంలోనే అనౌన్స్ చేశారు. రాంగోపాల్ వర్మతో వంగవీటి చిత్రాన్ని నిర్మించిన దాసరి కిరణ్ వ్యూహం, శపథం చిత్రాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మొత్తంగా వ్యూహం స్టిల్స్ తో ఏపీ రాజకీయాల్లో హీట్ పెంచిన ఆర్జీవీ పూర్తి స్థాయి సినిమాతో ఇంకెంత దుమారం రేపుతారో చూడాలి. అయితే గత ఎన్నికల ముందున్న పరిస్థితులు వేరు. ప్రస్తుత పరిస్థితులు వేరు. గతంలో టిడిపి, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో వైసీపీకి కలిసి వచ్చింది. ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. వైసిపి ఈసారి గెలవడం అంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికలలో ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ఆర్జీవి వ్యూహం ఈసారి ఫలించే అవకాశాలు లేనట్టుగా కూడా స్పష్టం చేస్తున్నారు. దీనికి తోడు డైరెక్టర్ మహి కూడా యాత్ర-2 పేరుతో మరో సినిమాను కూడా చేస్తున్నారు. జగన్ రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఎన్నికల ముందు ఈ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు.
previous post
next post