ఏదైనా రంగంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే దానికి టాలెంట్ తో పాటు క్యారెక్టర్, అదృష్టం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. టాలీవుడ్ సీనియర్ హీరో, నట కిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ చాలామందిలో మంచి టాలెంట్ ఉంటుంది కానీ వారి ఎంచుకున్న రంగంలో పైకి రావడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా అక్కడే ఉండటం జరుగుతూ ఉంటుంది. దానికి అదృష్టం కలిసి రాలేదని అంటున్నప్పటికి అందులో కొంత వాస్తవం వున్నా చాలామంది గ్రహించని విషయం ఏంటంటే క్యారెక్టర్ అనేది లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ ఎవ్వరు కూడా ఏ రంగంలో కూడా రాణించలేరని ఆయన అంటున్నారు.. వీరభద్ర చౌదరి డైరెక్షన్ లో జరుగుతున్న దిల్ వాలా షూటింగ్ టాకీ పార్ట్ చిత్రీకరణ లో భాగంగా విశాఖ వచ్చిన ఆయన వైశాఖీ డాట్ కామ్ ప్రత్యేక ప్రతినిధి తో ముచ్చటించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలం పాటు కొనసాగానంటే దానికి ప్రధాన కారణం తన క్యారెక్టరేనని చెప్పుకొచ్చారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని ఇప్పటికి కూడా అలాగే బ్రతుకుతున్నానని చెప్పారు.తనకు మంచి టాలెంట్ ఉండొచ్చు, కాస్త అదృష్టం కలిసి రావచ్చు కానీ వీటి కంటే ముందు క్యారెక్టర్ అనేది తనను అందరికీ బాగా దగ్గర చేసిందని తెలిపారు. కలిసి వచ్చినప్పుడు విర్ర వీగిపోకుండా,కలిసి రానప్పుడు డీలా పడిపోకుండా జీవితంలో ఏది ఎదురైనా సరే అన్నింటికీ ఒకేలా స్పందించే విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పారు. అదృష్టం బాగున్నప్పుడు కాస్త కాలర్ ఎగరేస్తూ ఇక అక్కడ నుంచి అతనికి పతనం ప్రారంభం అవ్వడం జరుగుతుందని అన్నారు. తన కెరీర్లో చాలామందిని అటువంటి వ్యక్తులను చూసానని జీవితం చాలా చిన్నదని, దానిని సరైన పద్ధతిలో తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. నాలుగు దశబ్దాలపైగా వరుసగా సినిమాలు చేస్తున్నానంటే దానికి కారణం తన ప్రవర్తనే అని చెప్పారు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకుని, తన మాటల ద్వారా గాని చేతల ద్వారా గాని నొప్పించకుండా ఉండాలని, వీలైతే ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండాలని, అవతల వారిని ఇబ్బంది పెట్టే విధంగా, రోడ్డుకు లాగే విధంగా చేయకూడదని స్పష్టం చేశారు. తన గత చిత్రం ‘అనుకోని ప్రయాణం’ తనక ఎంతో మంచి పేరును తీసుకువచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. థియేటర్ లో ఈ సినిమాకి పెద్దగా ఆదరణ లేనప్పటికీ ఓటిటి లో మాత్రం సూపర్ హిట్ అయిందని చెప్పారు. ఆ సినిమాల్లో తాను చేసిన క్యారెక్టర్ కి మంచి పేరు వచ్చిందని పేర్కొన్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవితో పనిచేసిన చిత్రం వాల్తేర్ వీరయ్య కూడా తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. తాను ఏ సినిమా చేసినప్పటికీ దర్శక నిర్మాతలకు అనుకూలంగా ఉంటానని, ఆ సినిమా బాగా రావడానికి తన పరిధి మేరకు బాగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం తెలుగు సినిమా కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందని కొనియాడారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ప్రతిభగల దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటులు ఇలా ఎంతోమంది కొత్త వాళ్ళు వస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులు భాషా బేధం లేకుండా ప్రతి సినిమాను భుజాన్నేత్తుకుంటారని అన్నారు. మంచి చిత్రానికి ఎప్పుడు ఆదరణ ఉంటుందని డా. రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.
previous post
next post