సీనియర్ ఎన్టీఆర్ సినిమాలను చూస్తూ పెరిగానని, ఆయన చేసిన పాతాళభైరవి సినిమా తాను సినిమాల్లోకి రావడానికి కారణమైందని ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. విజయవాడలో జరిగిన నటరత్న స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఎన్టీఆర్ తో గల తన అనుబంధాన్ని వివరించారు. తన ఏడవ ఏట ఎన్టీఆర్ పాతాళభైరవి సినిమా చూసానని కొన్ని సంవత్సరాల వరకు ఆ సినిమా తన మనసులో అలాగే ఉండిపోయిందని చెప్పారు. అప్పటినుంచి తాను ఎన్టీఆర్ సినిమాలను చూస్తూ ఉండేవాడినని తెలిపారు. కర్ణాటకలో లవకుశ సినిమా 100 రోజుల ఫంక్షన్ సందర్భంగా తన 13వ ఏట ఎన్టీఆర్ ను నేరుగా చూడటం జరిగిందని చెప్పారు. తను సినిమాలోకి రాకముందు ఫ్రెండ్స్ తో కలిసి నాటకాలు వేస్తూ ఉండే వాడినని అన్నారు. శ్రీకృష్ణ పాండవీయం సినిమా తనను ఎన్టీఆర్ వీరాభిమానిగా చేసిందని తెలిపారు. ఆయన చేసిన దుర్యోధన క్యారెక్టర్ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. తన తొలి చిత్రం పేరు భైరవని అన్నారు. తనకిష్టమైన పాతాళ బైరవి సినిమాలో భైరవి పేరు పెట్టడంతో తను వెంటనే ఆ సినిమాను చేశానని వెల్లడించారు. ఆర్టిస్ట్ గా బిజీ అవుతున్న సమయంలో రాజమండ్రి లో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా అక్కడ థియేటర్ వద్ద ఏర్పడిన జన సమర్థం వల్ల కిలోమీటర్ల మేర రోడ్డు దిగ్బంధనం అయింది అన్నారు. ఏంటా అని విచారణ చేస్తే ఆరోజు ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా రిలీజ్ అయినట్లు తెలిసిందన్నారు. తనకెంత ఇష్టమైన హీరో ఎన్టీఆర్ చేసిన దానవీరశూరకర్ణ సినిమాను థియేటర్లో ఎన్నోసార్లు చూశానని చెప్పారు. ఆయన మీద ఉన్న ఇష్టం, దుర్యోధన క్యారెక్టర్ మీద ఉన్న మమకారంతో తాను తమిళలో దానవీరశూరకర్ణ సినిమా చేయడానికి ప్రయత్నాలు చేశానని తెలిపారు. అంతా రెడీ అయింది షూటింగ్ కొన్ని రోజులు ఉందనగా చివరిసారిగా దుర్యోధన క్యారెక్టర్ కు స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగిందన్నారు. అప్పటికి తను చాలా సన్నగా ఉండటం వలన దుర్యోధన గెటప్పు తనకు అస్సలు సూట్ కాలేదని సన్నిహితులు చెప్పడంతో తాను ఆ సినిమాను విరమించుకున్నట్లు తెలిపారు. టైగర్ అనే సినిమాలో ఎన్టీఆర్ ది కలిసే అవకాశం వచ్చిందని చెప్పారు. ఆ సినిమాలో ఇద్దరం అన్నదమ్ములు నటించామని తెలిపారు. అయితే అప్పటికి కొందరు ఆ సినిమా దర్శక నిర్మాతలకు రజనీకాంత్ షూటింగ్లకు లేటుగా వస్తాడని, అతనికి ఎక్కువ వ్యసనాలు ఉన్నాయని చెప్పారన్నారు. ఆ కారణంతో ఆ సినిమా నుంచి తనను తీసేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. కానీ ఎన్టీఆర్ దానికి ఒప్పుకోలేదని అతని భవిష్యత్తును నాశనం చేయడానికి మనం ఎవరిమి, అతనితో ప్రేమగా మాట్లాడండి, అభిమానంగా ఉండండి, మంచిగా పని చేయించుకోండి అతన్ని ఈ సినిమా నుంచి తీయడానికి నేను ఒప్పుకోనని ఎన్టీఆర్ కరాకండిగా చెప్పేసరికి ఇక తప్పదన్నట్లు నన్ను ఆ సినిమాకు కంటిన్యూ చేయడం జరిగింది అన్నారు. తన పట్ల ఎంతో ప్రేమను చూపించే ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి రావడం తనకు చాలా సంతోషం అనిపించింది అన్నారు. ఆ వార్త విన్న వెంటనే ఎగిరి గంతేసానని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తనకు చాలా అభిమానమని, ఆయనంటే ఎంతో ప్రేమని చెప్పారు. తమిళంలో శివాజీ గణేషన్, కన్నడలో రాజ్ కుమార్ తెలుగులో ఎన్టీఆర్ ఈ ముగ్గురు తనకు మార్గదర్శకులని, తనకు ఎంతో ఇష్టమైన హీరోలని రజినీకాంత్ చెప్పారు.