Vaisaakhi – Pakka Infotainment

డైరెక్టర్స్ అసోసియేషన్ కు ప్రభాస్ 35 లక్షల విరాళం..

ప్రపంచంలో అత్యధిక చలనచిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానంబీపొందిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జయంతిని పురస్కరించుకుని.. తెలుగు దర్శకులు మే 4వ తేదీని “డైరెక్టర్స్ డే” గా ప్రకటించుకుని గత 5 ఏళ్లగా ఒక వేడుకలా జరుపుకుంటున్నారు! అయితే తెలుగు దర్శకుల సంఘానికి ఓ సంక్షేమ నిధి సమకూర్చుకోవడమే ప్రధాన ధ్యేయంగా..హైద్రాబాద్ లాల్ బహుదూర్ స్టేడియంలో..ఈ ఏడాది “డైరక్టర్స్ డే” మహోత్సవాన్ని.. నిర్వహించుకోబోతున్న తరుణంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 35 లక్షల విరాళాన్ని ప్రకటించారు.. ఈ విషయాన్ని దర్శకుడు మారుతి కార్యక్రమ కర్టెన్ రైజర్ ప్రోగ్రాం లో ఎనౌన్స్ చేశారు.. ఉత్సవ వివరాలను సినిమా దర్శకుల సంఘం వెల్లడించింది.. ఈ ఏడాది విడుదలైన కొత్త దర్శకుల సినిమాల నుంచి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి, ఆ చిత్ర దర్శకులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున తమ సంఘం నగదు బహుమతితో పాటు మెమెంటో ఇచ్చి సత్కరించనుంది.. దర్శకులు అనిల్ రావిపూడి..అనుదీప్.. శివ నిర్వాణా తదితరులు తోటి దర్శక మిత్రులతో కలిసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. దర్శకులు విజయేంద్ర ప్రసాద్, రేలంగి నరసింహారావు, ఎన్. శంకర్, వి.ఎన్. ఆదిత్య, మారుతి, హరీష్ శంకర్, అజయ్ భూపతి, వి.సముద్ర, జీ.రామ్ ప్రసాద్, వెంకీ అట్లూరి, రామ్ భీమన, అనుదీప్, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు! డైరెక్టర్స్ డే, TFDA లోగోలను ఆవిష్కరించారు. అలాగే తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఆఫీషియల్ వెబ్సైట్ని కూడా లాంఛనంగా ప్రారంభించారు. అంతేకాకుండా ఈ ఏడాది “డైరెక్టర్స్ డే” ఈవెంట్ కి చెందిన “ఎంట్రీ పాసుల”ను “బుక్ మై షో” యాప్ ద్వారా త్వరలో విక్రయించడం ప్రారంభిస్తామని నిర్వాహకులు చెప్పారు.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమ సంఘ సభ్యులకు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఉగాది నుంచి అమలు చేస్తున్నామని, అలాగే సభ్యుల గ్రూప్ ఇన్స్యూరెన్స్ పథకం కోసం 35 లక్షల రూపాయల విరాళాలను అనతి కాలంలోనే సేకరించగలిగామని తెలుగు చలనచిత్ర దర్శక సంఘం అధ్యక్షులు బి.వీర శంకర్ చెప్పారు. తమ సభ్యులకు అన్ని విధాలా సేవ చేసేందుకు తాము నిర్విరామంగా కృషి చేస్తామని, మే 4 వ తేదీన తాము జరుపుకుంటోన్న “దర్శకుల దినోత్సవం” ద్వారా సమకూరే నిధులను తమ సంఘ సభ్యుల ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగిస్తామని కూడా ఆయన చెప్పారు. ఉత్సవంలో ప్రముఖ నటులు చిరంజీవి, మోహన్ బాబు, ప్రభాస్, శ్రీకాంత్, నాని, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్, వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్, విశ్వక్ సేన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నవదీప్, వైష్ణవ తేజ్ లాంటి హీరోలు.. హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్లు..టెక్నీషియన్లు ఎందరో పాల్గొంటున్నారని దర్శకులు హరీష్ శంకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష కార్యదర్శులు వీరశంకర్ సుబ్బారెడ్డి పూర్వ అధ్యక్షుడు దర్శకులు ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More